Reformed Church, Vijayawada

Reformed Church, Vijayawada Reformed Church, Vijayawada is a small gathering of people trying to explore the Bible truths.

30/12/2025
15/01/2025

జనవరి 15
లోక పాపాలను మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల యేసే

యేసును చూడగానే బాప్తీస్మమిచ్చు యోహాను పలికిన మాట ఇదే (యోహాను 1:29). ఇశ్రాయేలు ప్రజలు జరుపుకునే పండుగల్లో పాపాల విషయమైన ప్రాయశ్చిత్తార్థ దినం కూడా ఒకటి. వారి క్యాలెండర్లో 7వ నెల 10వ రోజున వాళ్లు దీనిని పాటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు (లేవీయ 23:27). కేవలం ప్రాయశ్చిత్తార్థ దినాన మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి (లేవీయ 16:2). ఆ రోజున మొదటిగా తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి (16:6). రెండు మేక పిల్లలను తీసుకురావాలి. వాటిని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర ఉంచాలి. యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ రెండు మేకల మీద వేయాలి. ఏ మేక మీదయితే యెహోవా పేరు వస్తుందో దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఏ మేక మీదయితే విడిచిపెట్టుట అనే చీటీ పడుతుందో దానిని ప్రాణంతోనే అరణ్యంలో విడిచిపెట్టాలి.

లేవీయ 16:21-22 చాలా ఆసక్తికరమైన వాక్యభాగం. "అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను."
గమనించండి, అహరోను ఏం చేయాలో! అతడు సజీవంగా ఉన్న ఆ మేక తలమీద తన రెండు చేతులు పెట్టాలి. ఇశ్రాయేలు ప్రజల దోషాలన్నింటిని అతిక్రమాలన్నింటినీ ఆ మేక తలమీద మోపాలి, వాటిని ఒప్పుకోవాలి. యాజకుడు ఆ మేక తలమీద చేతులుంచి, తన ప్రజల పాపాలను ఆ మేక తలమీద మోపినప్పుడు, వారి పాపాలు ఆ మేకపైకి బదిలీ అయిన భావన ప్రజల్లో కలగాలన్నదే దేవుని ఉద్దేశం. ఆ మేక తల మీదకి ఇశ్రాయేలు ప్రజల పాపాలు బదిలీ అయిన తర్వాత, ఒక మనుష్యుడు దానిని ఎడారి దేశానికి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టాలి. ఆ మేక వారి దోషాలన్నింటినీ ఎడారి దేశానికి భరించిపోతుంది.

లేవీయకాండం 16వ అధ్యాయంలో ఈ రెండు మేక పిల్లలు యేసుక్రీస్తు చేసిన కార్యంలోని రెండు కోణాలను మనకు చూపిస్తున్నాయి. మనుషులు చేసిన పాపాలకు వారికి బదులుగా యేసుక్రీస్తు శిక్ష అనుభవించాడని పాప పరిహారార్థం చంపబడే మేకపిల్ల చూపిస్తున్నది. తన ప్రజల పాపాలను క్రీస్తు వారి నుంచి దూరం చేశాడని విడిచిపెట్టబడిన మేకపిల్ల సూచిస్తున్నది.
యేసు మన పాపాలకు న్యాయంగా రావలసిన దైవోగ్రతను భరించాడు. కాబట్టి నీ పాపాలకు దేవుని ఉగ్రత నీ మీదకు దిగివస్తుందనే భయం నీకు అక్కరలేదు. మన పాపాలను యెరూషలేము గవిని వెలుపలికి ఆయన మోసుకొనిపోయాడు (హెబ్రీ 13:12). మనం నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ఉండాలని, క్రీస్తు పురాతన యెరూషలేము పట్టణం వెలుపల శ్రమపొంది మరణించాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు (కీర్తన 103:12). కాబట్టి దేవుడు ఇక ఏ మాత్రమూ నీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు. నువ్వు కూడా క్రీస్తు అనుగ్రహించే శక్తితో నీ పాపాల నుంచి దూరంగా ఉండేందుకు కృషి చెయ్యాలి.

యేసునందు విశ్వాసముంచిన నీ పాపాలు కొట్టి వేయబడ్డాయి, నీకు దూరం చేయబడ్డాయి. అందుకై నువ్వు దేవుణ్ణి స్తుతించాలి! ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ ప్రాయశ్చితార్థ దినాన తమ పాపాలను బట్టి దుఃఖపడాలి, పశ్చాత్తాపపడాలి. మనం కూడా మన పాపాల నిమిత్తమై దుఃఖపడాలి, వాటిని ఒప్పుకోవాలి, అసహ్యించుకోవాలి, విడిచిపెట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరంలో ఒక్క రోజున చేసే ఈ పండుగ, మనం 365 రోజులు చేయాలి. మన పాపాలను మోసుకొనిపోయిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తుకు స్తోత్రాన్ని ఘనతను మహిమను ప్రభావాన్ని యుగయుగాలు మనం చెల్లించాలి!!
By
Nagesh Sirra

14/01/2025

జనవరి 14

యేసే మన పస్కా బలిపశువు

"...క్రీస్తు అనే మన పస్కా బలిపశువు వధింపబడెను..."(1 కొరింథీ 5:8).

"పస్కా బలిపశువు" అంటే "ఇశ్రాయేలు ప్రజల్లోని తొలిచూలు సంతానానికి ప్రత్యామ్నాయంగా మరణించిన నిర్దోషమైన గొర్రెపిల్ల" అని అర్థం.
సందర్భం: ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. కఠినమైన బానిసత్వాన్ని భరించలేని ఇశ్రాయేలీయులు పెట్టిన మొరలను దేవుడు విన్నాడు. మోషే అహరోనులను దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు, ఫరో దగ్గరకు పంపించాడు. "నా ప్రజలైన ఇశ్రాయేలీయులను అరణ్యంలో నన్ను ఆరాధించడానికి పంపమని" యెహోవా ఫరోకు ఆజ్ఞాపించాడు. ఎంతో అహంకారంతో "యెహోవా ఎవడు?" అని ఫరో ప్రశ్నించి, ఇశ్రాయేలు ప్రజలను బయటకు పంపే ప్రసక్తే లేదన్నాడు. అందువల్ల దేవుడు పది రకాల తెగుళ్ళతో ఐగుప్తు ప్రజలకు, చక్రవర్తి అయిన ఫరోకు, ఐగుప్తు దేవతలకు తీర్పుతీర్చాడు. మొదటి తొమ్మిది తెగుళ్లు ఐగుప్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవమే. అయితే ఈ చిట్టచివరి తెగులు ఐగుప్తు ప్రజలను చావు దెబ్బకొట్టింది. బాక్సింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థిని మట్టి కరిపించే చివరి పిడుగుద్దు (punch) లాంటిదే ఈ చిట్టచివరి తీర్పు.
మనుషుల్లోనూ పశువుల్లోనూ తొలిచూలు సంతానాన్ని దేవుడు సంహరించాడు. ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిముందు ఒక మృతదేహం పడి ఉన్న పరిస్థితిని ఊహించండి. ఎవ్వరూ ఎవ్వరినీ ఆదరించడానికి అవకాశమే లేదు. ఆనాడు ఐగుప్తులో మహా ఘోష పుట్టిందని వాక్యం చెబుతున్నది.
పస్కా పండుగ ఆచరించవలసిన సమయం: ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వెళ్లిన ఆ సమయాన్ని ఆ నెలను మొదటి నెలగా భావించమని దేవుడు చెప్పాడు. మొదటి నెల, పదవ తేదీన, నిర్దోషమైన ఏడాది వయసున్న గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకోవాలి. 14వ రోజున దానిని వధించాలి.

పస్కా గొర్రెపిల్ల విషయంలో నియమాలు:

పస్కా బలిపశువు నిర్దోషమైనదై ఉండాలి. దాని వయసు ఒక్క సంవత్సరమై ఉండాలి. దానిని గొర్రె పిల్లల్లో నుంచిగాని మేక పిల్లల్లో నుంచిగాని తీసుకోవచ్చు. మొదటి నెల 14వ తారీకు సాయంత్రం వేళ దానిని చంపి దాని రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. ఆ రక్తాన్ని వారి ద్వారా బంధాల నిలువు కమ్ములకు, పైకమ్మికి పూయాలి. దానిని చంపేటప్పుడు దాని ఎముకలలో ఒక్క దానిని కూడా విరువకూడదు. దాని మాంసాన్ని అగ్నిచేత కాల్చి తినాలి. నీళ్లలో దాన్ని ఉడకబెట్టకూడదు. ఉడికి ఉడకని దానిని తినకూడడు. తెల్లారేసరికి అందులో దేనినీ మిగల్చకూడడు. ఒకవేళ మిగిలిస్తే దానిని అగ్నిలో కాల్చేయాలి. ఒక కుటుంబానికి సరిపడా దానిని తీసుకోవాలి. ఒకవేళ కుటుంబం చిన్నదైతే వేరే కుటుంబంతో కలిసి దానిని భుజించవచ్చు.

దానిని తినడానికి ఎవరు అర్హులు?

నిబంధన జనుల్లో అనగా ఇశ్రాయేలు ప్రజల్లో ఎవ్వరైనా దానిని తినవచ్చు. పరదేశులు కూడా సున్నతి పొందినవారైతే, వారికి ఇష్టమైతే తినవచ్చు. అయితే వారు పవిత్రులుగా ఉన్నప్పుడే తినాలి. దేని వల్లనైనా వాళ్ళు అపవిత్రులైతే వాళ్లు దానిని తర్వాత నెలలో తినాలి. ఒకవేళ వాళ్లు పస్కా పండుగ సమయానికి ప్రయాణంలో ఉంటే తర్వాత నెలలో 14వ తేదీ సాయంత్రం వేళ దానిని ఆచరించాలి.

పస్కా పండుగ ఉద్దేశం:
1) మొదటిగా ఇశ్రాయేలీయుల చేత కఠినమైన పనులు చేయించిన ఐగుప్తు రాజుకు, ఐగుప్తు ప్రజలకు శిక్ష విధించడం. 2) రెండవదిగా, ఐగుప్తు దేవతలు శక్తిహీనమైనవని నిరూపించడం. ఐగుప్తు దేవతలకు తీర్పుతీరుస్తానని దేవుడు చెప్పిన మాటలు వాక్యంలో మనకు కనబడతాయి. ఈ పదవ తెగులు ద్వారా "మిన్" అనే సంతాన దేవతను, "హెకెట్" అనే పేరు కలిగి ప్రసవ సమయంలో స్త్రీలకు సహాయపడే దేవతను, "ఐసిస్" అనే పేరు కలిగి పిల్లల్ని కాపాడే దేవతను, ఫరో యొక్క జ్యేష్ట కుమారుడు అనే నాలుగవ దేవతను శక్తిహీనమైనవని నిజదేవుడైన యెహోవా నిరూపిస్తున్నాడు. 3) మూడవదిగా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో తొలిచూలు సంతానాన్ని విడిపించడం.

క్రీస్తులో ఇవన్నీ నెరవేరిన విధానం:

I. పస్కా బలిపశువైన క్రీస్తు వధించబడిన సమయం:

తండ్రియైన దేవుడు క్రీస్తును పస్కా బలిపశువుగా నియమించాడు. అందువల్ల యేసుక్రీస్తు పస్కా పండుగ సమయంలోనే మరణించాడు. యూదుల మతాధికారులు యేసును సంహరించాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ పస్కా పండుగ సమయంలో ఆయనను చంపకూడదని నిర్ణయించుకున్నారు. ప్రజలలో అల్లరి రేగుతుందనే కారణంతోనే ఆయనను ఈ పండుగ సమయంలో సంహరించకూడదని వాళ్లు భావించారు (మత్తయి 26:4-5). అయితే పస్కా బలిపశువైన యేసుక్రీస్తు పస్కా పండుగ సమయంలోనే వధించబడాలని నిర్ణయించిన దేవుని సంకల్పమే నెరవేరింది. పస్కా బలిపశువు పస్కా పండుగ రోజున మధ్యాహ్నం 3 గంటలకు వధించబడేదని యూదుల చరిత్రకారుడైన జోసీఫస్ రాశాడు. యేసు శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడని, సుమారు మూడు గంటల సమయానికి మరణించాడని మార్కు తన సువార్త గ్రంథంలో రాశాడు. ఈ విధంగా మన పస్కా బలిపశువైన యేసుక్రీస్తు సరిగ్గా పస్కా బలిపశువు వధించబడే సమయానికే మరణించడం ద్వారా తనను తాను పస్కా బలిపశువుగా నిరూపించుకున్నాడు.

II. పస్కా బలిపశువైన క్రీస్తు మరణించిన విధానం:

పస్కా పండుగ సమయానికి ముందే అనగా తండ్రియైన దేవుడు నిర్ణయించిన సమయానికి ముందే యేసుక్రీస్తును చంపాలని పలు ప్రయత్నాలు జరిగాయి. యేసు పసిబాలునిగా ఉన్న సందర్భంలో రాజైన హేరోదు ఆయనను చంపాలని ప్రయత్నించాడు. లూకా 4వ అధ్యాయంలో యేసు పలికిన మాటలకు అభ్యంతరపడిన యూదులు ఆయనను కొండపై నుంచి తోసివేయాలని ప్రయత్నించారు. యేసు దేవదూషణ చేస్తున్నాడని భావించి ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని యూదులు ప్రయత్నించిన సందర్భాలు యోహాను 5,8,10 వ అధ్యాయాల్లో మనకు కనబడుతాయి. అయితే యేసు ఆ సందర్భాలన్నింటిలోనూ వారి చేతికి చిక్కకుండా తప్పించుకున్నాడు. పస్కా పండుగ సమయంలో ఆయన తనను తానే యూదులకు అప్పగించుకున్నాడు.
సిలువ మరణానికి తనను తాను అప్పగించుకుని యేసు తన రక్తాన్ని చిందించాడు. ఆయన చేతుల్లోనూ కాళ్లలోనూ దిగ్గొట్టిన మేకులు, తలపైన ముళ్ళ కిరీటం, వెనుక భాగంలో కొరడా దెబ్బలు ఆయన శరీరం నుంచి రక్తం ధారలుగా కారేందుకు కారణమయ్యాయి. పస్కా బలిపశువు రక్తం ఇశ్రాయేలీయుల ద్వారబంధాల కమ్ములకు పూయబడినప్పుడు అది బొట్లుబొట్లుగా కిందికి జారే ఉంటుంది కదా! అసలైన పస్కా బలిపశువయిన క్రీస్తు యొక్క రక్తం కూడా ఆ సిలువ యొక్క నిలువ కమ్ముల నుంచి అడ్డకమ్మి నుంచి ధారలుగా కిందికి కారి ఉంటుందని మనం ఊహించవచ్చు.
అంతేకాదు యేసు సిలువపైన మరణించినప్పుడు ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరువబడలేదు ‌(యోహాను 19:36).
పస్కా బలిపశువును దహించి తినమని మొదటి పస్కాపండుగ రోజున దేవుడు ఇశ్రాయేలీయులకు ఆదేశించాడు. క్రీస్తు కూడా తన మరణానికి ముందే తన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్ష రసాలను తిని త్రాగమని తన శిష్యులకు ఆదేశించాడు. పస్కా పండుగను ఇశ్రాయేలు ప్రజలు అన్ని తరాల్లోనూ ఆచరించాలని దేవుడు ఆదేశించాడు. క్రీస్తు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్ష రసాలను కూడా శిష్యులు ఆయన తిరిగి వచ్చేవరకు తిని తాగాలని కొత్త నిబంధన ఆజ్ఞాపిస్తోంది. ప్రభురాత్రి భోజనం సంస్కారంలో పాలుపొందే వారు కూడా ముందుగా సిద్ధపడాలి. తాము తింటున్నది తాగుతున్నది ప్రభువు యొక్క శరీరము ప్రభువు యొక్క రక్తము అని వివేచించకుండా అయోగ్యంగా ఎవరైతే ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగుతాడో వాడు ప్రభువు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవుతాడు. తద్వారా తనకు తానే శిక్షావిధి తెచ్చుకుంటాడు. అందువల్లనే కొందరు బలహీనులుగా, రోగులుగా మారుతున్నారు. చివరికి కొందరు చనిపోతున్నారు కూడా!
తొలి పస్కా పండుగ సమయంలో ఇశ్రాయేలీయుల తొలిచూలు సంతానం మరణాన్ని తప్పించుకోవాలంటే, వారి ద్వారబంధపు కమ్ములపైన నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడాలి. నిత్య మరణాన్ని తప్పించుకోవాలంటే నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తాన్ని తమ హృదయమనే ఆత్మ అనే ద్వారబంధాలపైన మనుషులు పూసుకోవాలి.

III. పస్కా బలి అనుగ్రహించు రక్షణా నిశ్చయత

క్రీస్తునందు విశ్వాసముంచి, తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, రక్షణ పొందిన విశ్వాసుల్లో సైతం కొందరు తాము పరలోకానికి చేరుకుంటామో లేదో అనే సందేహాన్ని భయాన్ని వెలిబుచ్చుతుంటారు. మీరు ఈ క్షణంలో మరణిస్తే పరలోకానికి చేరుకుంటారా? ప్రభువు ఇప్పుడే సంఘం నిమిత్తం వస్తే మీరు ఎత్తబడతారా? అనే ప్రశ్నలు అడిగితే వాళ్లు నిశ్చయతతో "అవును" అని జవాబు చెప్పలేరు. అలా సందేహించేవాళ్లు ఈ కింది మాటలు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు కుటుంబాల్లో రెండింటిని ఇప్పుడు మనం ఊహిద్దాం.
మొదటి కుటుంబంలో ఒక జ్యేష్ట కుమారుని మాటలు ఇలా ఉన్నాయని ఊహించండి: నేను చాలా మంచివాడిని. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు అనేక మంచిపనులు చేశాను. అందువల్ల ఇప్పుడు మీరు గొర్రెపిల్ల రక్తాన్ని మన ద్వారబంధాల కమ్ములకు పూయవలసిన అవసరం లేదు. సంహార దూత ఈ రాత్రి వచ్చినప్పుడు ఈ ఇంట్లో జ్యేష్టపుత్రునిగా ఉన్న నా మంచితనాన్ని ఎరిగి నన్ను సంహరించకుండా దాటిపోతాడు."
దానికి మీరు ఎలా జవాబిస్తారు? "నీ మంచితనం నిన్ను కాపాడదు. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తమే నిన్ను మరణం నుంచి తప్పిస్తుంది" అంటారు. అవునా? కాదా?
మరొక కుటుంబంలో ఈ కింది సంఘటన ఊహిద్దాం: ఆ కుటుంబంలోని జ్యేష్ట కుమారుడు "నాన్నా, నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాను. నేను ఎంతో చెడ్డవాణ్ణని మీకు తెలుసు, నాకు తెలుసు. అందువల్ల మీరు గొర్రెపిల్ల రక్తాన్ని మన ద్వారబంధాలకు పూసినా సంహార దూత నా దుర్మార్గతను బట్టి లోపలికి వచ్చి నన్ను సంహరిస్తాడేమో" అని అన్నాడు అనుకోండి.
దానికి మీరు ఎలా జవాబు చెబుతారు? "ద్వార బంధాలకు పూయబడిన రక్తమే నిన్ను కాపాడుతుంది. అదే దేవుని వాగ్దానం. నువ్వు నిశ్చింతగా ఉండు," అని చెబుతాం కదా!
క్రీస్తు సిలువపైన లోక పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఆ సువార్తను విన్న తర్వాత దానిని తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గర పాప క్షమాపణ పొందకపోతే నీ నిమిత్తమే ఆయన మరణించాడు అని నమ్మకపోతే అప్పుడు నీవు నిత్య శిక్షను అనుభవించేది కేవలం నీ పాపాల నిమిత్తం మాత్రమే కాదు క్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్త బలిని విశ్వసించకపోవడం వల్ల కూడా!
క్రీస్తునందు విశ్వాసముంచకపోతే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నిత్యనాశనాన్ని తప్పించుకోలేవు! క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు గతంలో ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా అవి నిన్ను నాశనానికి తీసుకెళ్లలేవు!
క్రీస్తు పస్కా బలిపశువు అనే వాక్య సత్యాన్నిబట్టి మనం ఆచరించవలసిన మరొక విషయం మనకు 1 కొరింథీ 5:8లో కనిపిస్తుంది. పస్కా బలిపశువును వధించి తిన్న, మరుసటి రోజు నుంచి ఇశ్రాయేలీయులు పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. క్రీస్తు అనే మన పస్కా బలి పశువు వధించబడ్డాడు కాబట్టి క్రీస్తు యొక్క శరీర రక్తాలను ప్రభు రాత్రి భోజనం సమయంలో మనం తిని తాగుతున్నాము. ఇంకా ఆచరించవలసినది పులియని రొట్టెల పండుగనే! ఈ సందర్భంలో పులియని రొట్టెలు అంటే "నిష్కాపట్యము" "సత్యము". పులిసిన రొట్టెలు అంటే "దుర్మార్గత" "దుష్టత్వము". దేవుడే మనకు ఈ విషయంలో సహాయపడును గాక!

13/01/2025

జనవరి 13

దేవుని సార్వభౌమత్వం: జీవం లేని వాటన్నింటినీ దేవుడే పరిపాలిస్తున్నాడు

యెహోవా ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరిచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు (కీర్తన 103:19).

విశ్వవ్యాప్తంగా ఉన్న జడ పదార్థమంతా ఆయన ఆజ్ఞలకు లోబడుతుంది; ఆయన శాసనాలను నెరవేరుస్తుంది. ఈ విషయం బైబిల్లోని మొదటి పేజీలోనే స్పష్టం చేయబడింది: "వెలుగు కమ్మని" "ఆకాశము క్రిందనున్న జలములు ఒక్కచోటనే కూర్చబడి, ఆరిన నేల కనబడును గాక అని" "గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక" అని దేవుడు పలికాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే జరిగింది.

ఐగుప్తు మీదకు పంపబడిన తెగుళ్ల విషయంలో నిర్జీవ పదార్థాలు ఏ విధంగా దేవుని సంపూర్ణ, సార్వభౌమ నియంత్రణకు లోబడ్డాయో గమనించండి. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే వెలుగు చీకటిగాను, నదులు రక్తంగాను మారిపోయాయి. వడగళ్లు కురిసాయి. ఐగుప్తు దేశమంతా మూడు దినాలు గాఢాంధకారమయ్యింది. అయితే ఇశ్రాయేలీయులు జీవిస్తున్న ప్రదేశంలో మాత్రం వెలుగు వచ్చింది. దేవుడు శాసించగానే అగ్నిగంధకాలు పరలోకం నుండి దిగివచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాయి. ఆయన ఆజ్ఞాపించగానే ఎర్ర సముద్ర జలాలు రెండుగా చీలిపోయాయి. ఆయన సెలవియ్యగానే అవి వెనుకకు మళ్ళి, ఐగుప్తు సైనికులను నాశనం చేశాయి. ఆయన మాట చెప్పగానే భూమి నోరు తెరచింది. కోరహు, అతనితో పాటు తిరుగుబాటు చేసిన బృందం మ్రింగి వేయబడ్డారు. నెబుకద్నెజరు నిప్పుల కొలిమిని సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏడు రెట్లు ఎక్కువ చేయించి, దేవుని ముగ్గురు బిడ్డల్ని అందులో విసిరేయించాడు. వాళ్లను విసిరిన వ్యక్తులు ఆ మంటలు వేడికి మాడిపోయారు. కానీ దేవుని బిడ్డల వస్త్రాలనైనా ఆ మంటలు తాకలేకపోయాయి.

సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆయనే నియంత్రిస్తున్నాడు. హిజ్కియా యొక్క సందేహాన్ని నివృత్తి చేయడం కోసం అహాజు యొక్క ఎండగడియారం పై నీడ పది మెట్లు వెనక్కు వెళ్లేలా దేవుడు సూర్యుణ్ణి ఆదేశించాడు. కొత్త నిబంధనా కాలంలో తన కుమారుని జన్మను ప్రకటించడానికి దేవుడు ఒక నక్షత్రాన్ని ఏర్పరిచాడు. ఆ నక్షత్రమే తూర్పు దేశపు జ్ఞానులకు కనబడింది. ఈ నక్షత్రం యేసు ఉన్న ఇంటి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిందని మనం చదువుతున్నాం. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే. బూడిద వంటి మంచు కణాలను చల్లువాడు ఆయనే. ముక్కలు ముక్కలుగా వడగళ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించే చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞలుగా అవన్నీ కరిగిపోతాయి. ఆయన తన గాలి విసర చేయగా నీళ్లు ప్రవహిస్తాయి (కీర్తన 147:15-18). ఏలీయా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం రాకుండా ఆపి, మరలా ఏలీయా చేసిన ప్రార్థనను బట్టి భూమి మీద వర్షం కురిపించిన వాడు దేవుడే.

సృష్టికర్త శరీరధారిగా వచ్చి, మనుషుల మధ్య జీవించినప్పుడు, పంచభూతాల పైన ఆయన ప్రభుత్వ ప్రదర్శన ఎంతగా జరిగిందో చూడండి. తన శిష్యులతో కలిసి, సముద్రంపై ప్రయాణిస్తున్న సందర్భంలో, తుఫాను చెలరేగింది, సముద్రపు కెరటాల మహోద్రేకంతో ఎగిసిపడ్డాయి. ఆయన లేచి గాలిని గద్దించాడు, సముద్రానికి ఆదేశించాడు. విధేయుడైన సేవకుల మాదిరిగా అవి ఆయనకు లోబడ్డాయి. ఆయన ఆజ్ఞాపించగానే సముద్రం దాని కెరటాలపై ఆయనను మోసింది. ఆయన మాట విని అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆయన తాకిన వెంటనే రోగం పారిపోయింది.
అందువల్ల జీవం లేని వాటన్నిటినీ దేవుడే పరిపాలిస్తున్నాడనే మాట సత్యం. భూమ్యాకాశాలు, నీరు, నిప్పు, వడగళ్ళు, మంచు, ప్రచండమైన వాయువులు, భీకరమైన సముద్రాలు, వర్షం మొదలైనవన్నీ ఆయన శక్తిగల మాటకు లోబడతాయి. ఆయన సార్వభౌమ సంకల్పాన్ని నెరవేరుస్తాయి. అందువల్ల వాతావరణం లోని మార్పులకు సాతానుగాడే కారణమని చెప్పడం అజ్ఞానమే. "వాతావరణాన్ని నీ అదుపులో ఉంచుకో" అని ప్రార్థించడం అవివేకమే. ఎందుకంటే వాతావరణం అంతా దేవుని అధీనంలోనే ఉంది. వాతావరణాన్ని మన పరిస్థితులకు తగిన విధంగా నియంత్రించమని దేవుణ్ణి వేడుకోవడం తప్పు కాదు. వాతావరణం గురించి ఫిర్యాదు చేయడం సణుక్కోవడం నిజానికి మనం దేవునికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లే, సణుగుతున్నట్లే.

ఏ.డబ్ల్యూ.పింక్

12/01/2025

జనవరి 12 క్రీస్తే సర్వము (2)

"...క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునైయున్నాడు", (కొలస్సీ 3:11)

బైబిల్లో ఉన్న దైవ ప్రేరేపిత గ్రంథాలన్నింటిలో క్రీస్తే సర్వమైయున్నాడని మనం అర్థంచేసుకోవాలి. బైబిల్లోని రెండు నిబంధనల్లోనూ ప్రతిభాగంలోనూ క్రీస్తు కనబడతాడు. లేఖనంలోని క్లిష్టమైన భాగాలను అర్థం చేసుకోవాలంటే క్రీస్తు యొక్క సిలువను, క్రీస్తు యొక్క కిరీటాన్ని మనం జవాబుగా చేపట్టాలి. వాక్యంలోని అనేక చీకటి ప్రదేశాలను తెరిచే ఏకైక తాళపు చెవి క్రీస్తు మాత్రమే.
పాత నిబంధనలోని ప్రతి బలి అర్పణ సిలువ వేయబడిన క్రీస్తుకే సూచనగా ఉంది. బలిపీఠంపైన అర్పించబడే ప్రతి జంతువు పాపుల నిమిత్తం మరణించబోయే రక్షకుని వైపు చూపిస్తూ ఉంది. జల ప్రళయానికి ముందు భక్తిహీనత ప్రబలుతున్న రోజుల్లో హనోకు ప్రవచించింది క్రీస్తు గురించే (యూదా 14,15). వాగ్దాన భూమిలో గుడారాల్లో నివసించినప్పుడు అబ్రాహాము చూసింది క్రీస్తునే (యోహాను 8:56). యాకోబు తన మరణ సమయంలో క్రీస్తు ఏ గోత్రంలో జన్మిస్తాడో తన కుమారులకు చెప్పాడు (ఆది 49:10). మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన ఆచారబద్ధమైన ధర్మశాస్త్రం యొక్క సారం, క్రీస్తే. ఉదయ సాయంకాలంలో అర్పించే బలులు, నిరంతరం చిందింపబడుతున్న రక్తం, బలిపీఠం, కరుణాపీఠం, ప్రధాన యాజకుడు, పస్కా పండుగ, ప్రాయశ్చిత్త దినం, విడిచిపెట్టబడే మేక మొదలైనవన్నీ క్రీస్తుకూ ఆయన చేయబోయే కార్యానికి ముంగుర్తులుగా చిహ్నాలుగా ఉన్నాయి.
ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మేఘస్తంభము, వారిని పోషించడానికి ప్రతి ఉదయము ఆకాశం నుంచి కురిసిన మన్నా, దేని నుంచయితే నీళ్లు ప్రవహించాయో, వాళ్లను అనుసరించిన ఆ బండ, తాపకరములైన సర్పాలు ప్రజల మధ్యలోనికి పంపబడినప్పుడు ఎత్తబడిన ఇత్తడి సర్పం మొదలైనవన్నీ క్రీస్తుకు గుర్తులుగా ఉన్నాయి. న్యాయాధిపతులందరూ రాబోయే ఉన్నతుడైన విమోచకుని గురించి 12 గోత్రాలు ఇశ్రాయేలుకు గుర్తుచేయడానికి ఏర్పాటు చేయబడ్డారు. వీళ్ళందరూ క్రీస్తుకు ముంగుర్తులుగానే ఉన్నారు. రాజైన దావీదు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. యెషయా నుంచి మలాకి వరకు ప్రవక్తలందరూ మాట్లాడింది క్రీస్తు గురించే. వాళ్లు అద్దంలో నుంచి చూసినట్లే అస్పష్టంగానే క్రీస్తును చూశారు.
కొత్త నిబంధన సంపూర్ణంగా క్రీస్తు గురించినదే అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనుషుల మధ్యన క్రీస్తు జీవించిన మాట్లాడిన సంచరించిన సంగతులు చేసిన కార్యాలు సువార్త గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి. క్రీస్తు ప్రకటించబడడం అపోస్తలుల కార్యాల గ్రంథంలో కనబడుతుంది. క్రీస్తు గురించిన ఆయన ఘనత గురించిన వివరణ పత్రికల్లో రాయబడింది. అయితే మొదటి నుంచి చివరి వరకు అన్ని నామాల కంటే క్రీస్తు నామమే పై నామంగా మనకు కనిపిస్తుంది.
బైబిల్ నాకు ఎంత ప్రాముఖ్యమైనది? అనే ప్రశ్నను ఈ ధ్యానాన్ని చదువుతున్న ప్రతి వ్యక్తి తరచుగా తనకు తానే వేసుకోవాలని నేను ప్రతి పాఠకుణ్ణి కోరుతున్నాను. బైబిల్ అంటే కేవలం కొన్ని నైతిక నియమాలు, మంచి సలహాలు కనబడే గ్రంథం మాత్రమేనా? లేదా బైబిల్లో క్రీస్తు మీకు కనబడుతున్నాడా? ఆ బైబిల్లో క్రీస్తే సర్వంగా ఉన్నాడా? ఒకవేళ ఇవేమీ మీకు కనబడకపోతే ఇంతవరకు బైబిల్ని మీరు చాలా సామాన్యమైనదిగానే ఉపయోగించారు. ఒకవేళ మీరు అలాగే బైబిల్ని చదివితే, సౌర వ్యవస్థను అధ్యయనం చేసి ఆ సౌర కుటుంబానికి కేంద్రంలో ఉన్న సూర్యుని గురించి పక్కన పెట్టేసిన వ్యక్తిలా మీరు ఉంటారు. అలాంటప్పుడు బైబిలు ఒక సామాన్యమైన గ్రంథంగా మీకు కనబడటం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.
జె.సి.రైల్

11/01/2025

జనవరి 11 సృష్టిలో దేవుని సార్వభౌమత్వం

"ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానినిబట్టియే సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి" (ప్రకటన 4:11).

దేవుని గుణలక్షణాలన్నీ ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని బట్టే పని చేస్తుంటాయని ఇంతకు ముందు ధ్యానాల్లో చర్చించాము. ఇప్పుడు ఆయన మార్గాలన్నిటిలోనూ, చర్యలన్నిటిలోనూ ఈ సార్వభౌమత్వం ఎలా కనబడుతుందో చూద్దాం.
ఆది 1:1కి ముందు మహా విశాలమైన నిత్యత్వముండేది. అప్పటికి విశ్వమింకా నిర్మించబడలేదు. సృష్టి కేవలం ఆ గొప్ప సృష్టికర్త యొక్క ఆలోచనలోనే ఉంది. తన సార్వభౌమ మహిమలో దేవుడు మాత్రమే ఒంటరిగా వసించాడు. ఆకాశాలు, భూమి సృష్టించబడడానికి ముందున్న ఆ అనంతమైన యుగం గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు దేవునికి స్తుతులు పాడేందుకు దేవదూతలు లేరు. ఆయన గమనాన్ని ఆకర్షించడానికి సృష్టిలోని ప్రాణులు ఏవీ లేవు. అదుపు చేయాల్సిన తిరుగుబాటుదారులు ఎవ్వరూ లేరు. తన విశాల విశ్వంలో, గంభీరమైన నిశ్శబ్దంలో ఆ మహా దేవుడొక్కడే నివసించాడు. ఒకవేళ దాన్ని కాలమని సంబోధించగలిగితే, ఆ కాలంలో కూడా దేవుడు సార్వభౌముడే!
తన చిత్తానుసారమైన సంకల్పాన్ని బట్టి సృష్టించడానికీ, సృష్టించకుండా ఉండటానికి కూడా ఆయనకు అధికారముంది. ఏ విధంగానైనా సృష్టించే స్వేచ్ఛ ఉంది. ఒకే ప్రపంచాన్ని, లేదా లక్షలాది ప్రపంచాలను సృష్టించే స్వతంత్రముంది. ఆయన చిత్తాన్ని ఎదిరించడానికి అప్పుడు ఎవరున్నారు? లక్షలాది వివిధ ప్రాణుల్ని ఉనికిలోకి తీసుకొచ్చి, సంపూర్ణ సమానత్వాన్ని వాటికిచ్చి, ఒకే విధమైన సామర్థ్యాలను అనుగ్రహించి, వాటన్నిటినీ ఒకే రకమైన పరిస్థితుల్లో, వాతావరణంలో ఆయన ఉంచగలడు. లేదంటే ఒకదానికొకటి భిన్నంగా ఉండే ప్రాణుల్ని, అంటే సృష్టించబడడంలో తప్ప మరి ఏ విషయములోనూ పోలిక లేని జీవులను సృష్టించే స్వేచ్ఛ ఆయనకు ఉంది. ఆయనకున్న హక్కును సవాలు చేయగలిగినవాడెవడు? ఆయనకు నచ్చితే, పరిమితులకు అతీతమైన, విస్తారమైన ప్రపంచాన్ని ఆయన ఉనికిలోకి తెచ్చుండేవాడు. ఆయనకిష్టమైతే కేవలం అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు) మాత్రమే మానవ నేత్రాలకు చూపించగలిగేంత చిన్నదైన ప్రాణిని ఆయన సృష్టించగలిగి ఉండేవాడు. తన సింహాసనం చుట్టూ మండే మహా సెరాపుల్ని సృష్టించడానికీ, పుట్టిన ఘడియలోనే చనిపోయే అతి సూక్ష్మమైన పురుగును సృష్టించడానికీ సార్వభౌమునిగా ఆయనకు హక్కు ఉంది. ఉన్నతులైన సెరాఫులు, నేలమీద ప్రాకే జంతువులు, విశ్వమంతా పరిభ్రమించే గ్రహాలు, తేలియాడే అణువులు, అఖిల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, ఇవన్నీ ఒకదానికొకటి చాలా భిన్నమైనవి.
ఇతర గ్రహాలన్నింటి కంటే సూర్యుడు ఎంతో మహిమకరంగా ఉంటాడు. కొన్ని నక్షత్రాలు బ్రహ్మాండంగాను, మరికొన్ని చిన్నవిగాను ఉంటాయి. ప్రపంచంలో ఉన్న దేశాలు వాతావరణపరంగా భౌగోళికంగా వనరుల పరంగా భిన్నంగా ఉంటాయి. జంతువుల్లో పక్షుల్లో ఫలాల్లో పూలలో వైవిధ్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన దూతలు, సెరాపులు, కెరూబులు, మహాదూతలు, దేవదూతలు వివిధ స్థాయిల్లో ఉన్నట్లు మనకు కనబడతారు. ఒకే కుటుంబంలో పుట్టిన బిడ్డలు కూడా ఎంతో భిన్నంగా కనిపిస్తారు, జీవిస్తారు. కారణమేంటి? బలవంతుడైన దేవుడు వీటిని తన విశ్వంలో సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ అలా కాకుండా సమస్తాన్నీ ఒకేరీతిగా సృష్టించాలనుకుంటే, ఆయన సార్వభౌమ సంకల్పాన్ని ప్రశ్నించగలిగిన వాడెవడున్నాడు? అందువల్ల భక్తుడైన యోహాను రాసిన విధంగా, "ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానినిబట్టియే సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని" ఆయనను స్తుతిద్దాం.

ఏ.డబ్ల్యూ.పింక్

10/01/2025

జనవరి 10 దేవుడు దీర్ఘశాంతుడు
అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు "యెహోవా...దీర్ఘశాంతము గల దేవుడు" అని ప్రకటించెను (నిర్గమ 34:6-7).
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు... దీర్ఘశాంతమును ధరించుకొనుడి (కొలస్సీ 3:12).
మన త్రియేక దేవుడు దీర్ఘశాంతుడు. మనల్ని కూడా దీర్ఘశాంతాన్ని ధరించుకోమని ఆయన పౌలుగారి ద్వారా అజ్ఞాపిస్తున్నాడు. దీర్ఘశాంతం అంటే కోపం లేకపోవడం కాదు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు అని బైబిల్లో ఉంది. ఆయన కోపం (ఉగ్రత) గలవాడు అని కూడా బైబిల్ చెబుతున్నది. కోపం అనేది బలహీనత కాదు, దైవ పరిపూర్ణతల్లో కోపం కూడా ఒకటి. దీర్ఘశాంతం అంటే కోపానికి విరుద్ధమైన లక్షణం కాదు, కానీ కోపానికి అడ్డుకట్ట వేసే లక్షణం. కోపం అనేది ఉధృతమైన నీటి ప్రవాహం లాంటిదైతే, దానికి ఆనకట్ట లాంటిది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనే ఆనకట్టకు పునాది, దయా కనికరాలే.
అనేక సూచక క్రియలను మహత్కార్యాలను చేసి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. కనాను దేశపు రాజులను నాశనం చేసి దానిని వాళ్ల స్వాధీనం చేశాడు. పలు సందర్భాలలో శత్రువుల బారి నుంచి వారిని కాపాడాడు. వాళ్లు లోబడనొల్లని ప్రజలు కాబట్టి అనేకసార్లు విగ్రహాల తట్టు తిరిగిపోయారు. అయినా దేవుడు వారి యెడల దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. వారి యెడల చూపవలసిన తన కోపాన్ని ఆపింది, ఆయన యొక్క దీర్ఘశాంతమే. ఆయన వాళ్లను ఓర్చుకోవలసినదాని కంటే ఎంతో ఎక్కువ కాలమే ఓర్చుకున్నాడు. ఆ తరువాత ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. ఫలితం: ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచమంతటా చెదిరిన వారిగానే ఉన్నారు. ఆయన కోపం నిమిష మాత్రమే ఉంటుంది. ఐనా దాన్ని మనం భరించలేము.
ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శిష్యుల యెడల దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. ఇప్పటికీ మన యెడల దీర్ఘశాంతాన్ని కనపరుస్తూనే ఉన్నాడు. మనం కూడా దీర్ఘశాంతాన్ని కనపరచాలన్నది మనకివ్వబడిన ఆజ్ఞ. దీర్ఘశాంతం మాట దేవుడెరుగు, ముందు మనం శాంతంగా ఉండడం నేర్చుకోవాలి, అవునా? కాదా? కోపించుటకు నిదానించువారిగా ఉండమని యాకోబు మనకు చెబుతున్నాడు. మనం దీనికి రివర్స్ లో ఉంటాం. మనం కోప్పడే విషయంలో వేగంగానూ దీర్ఘశాంతాన్ని కనపరిచే విషయంలో అస్థిరంగానూ ఉంటాం. ఇలాంటి మన ప్రవర్తన వలన మన గృహాల్లో కార్యాలయాల్లో సంఘాల్లో ఎన్ని ఇబ్బందులు కొనితెచ్చుకున్నామో కదా?
ఊరికే రుసరుసలాడే మన పద్ధతిని బట్టి దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం. ఆయన మన యెడల చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని బట్టి ఆయనను స్తుతిద్దాం. ఈ సుగుణాన్ని మనలో వృద్ధి చేయమని ప్రభువును కోరదాం. దీర్ఘశాంతుడే మనలో ఈ సుగుణాన్ని పెంపొందించును గాక! ఆయనతో ఉండడం, ఆయనలో ఉండడం ద్వారానే మనలో ఈ సుగుణం వృద్ధి అవుతుంది.
By
నగేష్. సిర్రా

08/01/2025

జనవరి 8 యేసుక్రీస్తు మార్పులేని దేవుడు
ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములుకూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు (హెబ్రీ 1:10-12).
యేసుక్రీస్తు మార్పులేని దేవుడు. ఇదెంతో గంభీరమైన మాట! తండ్రియైన దేవుడే స్వయంగా ఈ సత్యాన్ని చెబుతున్నాడు. "యేసుక్రీస్తు దేవుని కుమారుడే, దేవుడు కాదు" అని వాదించే మూర్ఖులు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ వక్కాణిస్తున్న సత్యాన్ని చూడండి: యేసు దేవుడైయుండెను (యోహాను 1:1). యేసు మహా దేవుడు (తీతు 2:13). యేసు నిజమైన దేవుడు (1 యోహాను 5:20). యేసు సర్వాధికారియైన దేవుడు (రోమా 9:5). యేసు బలవంతుడైన దేవుడు (యెషయా 9:6). యేసుక్రీస్తు దేవుడు, రక్షకుడు (2 పేతురు 1:1). యేసు యొక్క దైవత్వం గురించి ఇంతకన్నా స్పష్టమైన రుజువులు కోరడం సమంజసమేనా? కానే కాదు! స్వయంగా తండ్రియైన దేవుడే, ప్రభువైన యేసును "దేవా" (1:8) అని సంబోధించడం చూసైనా, ఆయన దైవత్వాన్ని తృణీకరించే మూర్ఖులు మారాలి.
కొందరు అమాయకులు ఉన్నారు. వీళ్లు "శరీరధారి కావడానికి ముందు, పునరుత్థానం తర్వాత కూడా ప్రభువు సంపూర్ణుడైన దేవునిగానే ఉన్నాడు. అయితే భూమ్మీద శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రం ఆయన సంపూర్ణుడైన దేవునిగా లేడు" అని మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తుంటారు. వీళ్ళు చేసే వ్యాఖ్యలు హేతు విరుద్ధమైనవి. మొదటి కారణం: దేవుడు తన దైవత్వాన్ని విడిచి పెట్టడం అసంభవం (God cannot cease to be God). రెండవ కారణం: తండ్రియైన దేవుడు, యేసును "దేవా" అని పిలిచాడు అంటే యేసు దేవుని కంటే తక్కువ వాడు ఎలా అవుతాడు? "యేసు దేవుని కన్నా తక్కువ వాడు" అని వారు చేసే మూర్ఖపు వాదన నిజమైతే, అప్పుడు తండ్రియైన దేవుడు కూడా దేవుడే కాదు. ఎందుకంటే దైవత్వం సంపూర్ణంగా లేనివాణ్ణి "దేవా" అని పిలిచినవాడు కూడా దేవుడయ్యే అవకాశమే లేదు. మూడవ కారణం: కొలస్సీ 2:9లో "దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత" శరీరధారియైన క్రీస్తులో ఉంది అని పౌలు చెప్పాడు. "దైవత్వము యొక్క పరిపూర్ణత" అని పౌలు చెప్పినా, అదేమీ క్రీస్తు దైవత్వాన్ని తగ్గించి ఉండేది కాదు. ఐనప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో "సర్వ" (all) అనే విశేషణాన్ని కూడా పౌలు రాశాడు. తద్వారా వాక్యాన్ని దైవ ప్రత్యక్షత అని నమ్మేవారికి క్రీస్తు దైవత్వం గురించి బలమైన రుజువును అందించాడు.
భూమ్మీద జీవించిన కాలంలో యేసు తన దైవత్వాన్ని విడిచిపెట్టలేదు, కానీ ఆయన మానవత్వాన్ని అదనంగా ధరించుకున్నాడు. కుమారునిలో దైవ స్వభావం మారలేదు, ఆయనలో మానవ స్వభావం అదనంగా చేరింది. ఇక్కడ అద్భుతం ఏంటంటే, మార్పులేని దేవుడు మార్పుకు గురయ్యే మానవ స్వభావాన్ని ధరించుకోవడం. యేసులో ఉన్న మార్పులేని స్వభావానికి, మార్పుకు గురయ్యే స్వభావానికి మధ్యన ఎలాంటి పోరాటమైనా వైరుధ్యమైనా ఉన్నట్లు మనకు మచ్చుకైనా లేఖనాల్లో కనబడదు. కారణం ప్రభువైన యేసు తన మానవ స్వభావానికి అడ్డు రాకుండా తన దైవ స్వభావాన్ని నియంత్రణలో ఉంచుకున్నాడు. పరిపూర్ణమైన మానవునిగా జీవించడానికి అడ్డొచ్చే, తన సర్వశక్తినీ సర్వ జ్ఞానాన్నీ అన్ని చోట్లా ఉండగలిగిన తన స్వభావాన్నీ తనలోనే నియంత్రించుకున్నాడు. ఈ విషయంలోనే క్రీస్తు యొక్క దైవ శక్తి పరోక్షంగా వెల్లడవుతోంది.
రోగుల్ని చూసి, బోధకులు లేని ప్రజల్ని చూసి యేసు కనికరపడ్డాడు. ఇప్పటికీ యేసులో ఈ కనికరం ఇలానే ఉంది. ఇస్కారియోతు యూదా గురించి ఆరంభం నుంచే ఎరిగినప్పటికీ, వాని యెడల మన ప్రభువు దీర్ఘశాంతాన్ని కనబరిచాడు. ఇప్పటికీ ఆయనలో అదే దీర్ఘశాంతం కొనసాగుతూ ఉంది. తన వారిని అంతం వరకు ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏ మాత్రమూ మార్పు రాలేదు. పరిసయ్యుల శాస్త్రుల సద్దూకయ్యుల వేషధారణను ఆయన తీవ్ర ఆగ్రహంతో ఖండించాడు. వేషధారణ విషయంలో ఆయన ప్రచండమైన ఆగ్రహం ఎల్లకాలమూ అదే విధంగా ఉంటుంది. సిలువపై తన ప్రజల పాపాలన్నింటికీ ఒక్కసారే ప్రాయశ్చిత్తం జరిగించగలిగాడు. ఎన్ని యుగాలైనా ఆ శక్తిలో తరుగుదల ఉండదు. అణచివేతకు గురైన ప్రజల యెడల ఆయన చూపిన మృదు స్వభావం నేటికీ ఆయనలో సంపూర్ణంగా ఉంది. అందుకనే "యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నాడు. అవును యుగయుగాలకు ఒక్కటే రీతిగా ఉంటాడు" అని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు (హెబ్రీ 13:8). మార్పులేని దేవుడైన యేసుక్రీస్తు నామానికి స్తుతి మహిమలు కలుగును గాక! ఆమెన్!!
నగేష్. సిర్రా

06/01/2025

జనవరి 6 దేవుడు మార్పులేనివాడు
యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు (మలాకీ 3:6).
మార్పు అనేది సృష్టికీ సృష్టిలోని ప్రాణులకూ మాత్రమే వర్తిస్తుంది. అది బైబిల్లో తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న దేవునికి వర్తించదు. ప్రకృతిలో, వాతావరణంలో మార్పులొస్తాయి. మనుషుల స్వరూప స్వభావాల్లో, వేషభాషల్లో, ఆచార వ్యవహారాల్లో, స్థితి గతుల్లో మార్పులొస్తాయి. కారణం: ఈ లోకమూ, అందున్న సమస్తమూ సృష్టించబడినవే. సృష్టించబడిన ప్రతీదీ, అది జీవమున్నదైనా నిర్జీవ పదార్థమైనా, మార్పుకు గురవుతుంది.
సృష్టికర్త మార్పుకు గురి కాడు. ఆయన గుణ లక్షణాలెన్నడూ మారవు. ఉదాహరణకు దేవుడు అనంత జ్ఞానంగలవాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఇక మీదట కొత్తగా తెలుసుకోవలసింది ఏదీ లేదు, ఉండబోదు. ఆయన దేన్నీ క్రమక్రమంగా తెలుసుకోడు. ఆయన జ్ఞానంలో ఎన్నడూ హెచ్చు తగ్గులు ఉండవు. దేవుడు సర్వ శక్తిమంతుడు. సృష్టికి మునుపు ఆయనలో ఎంత శక్తి ఉండేదో, ఇప్పుడు కూడా అంతే ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటుంది. ఆయనలో మార్పు లేకుండా కొనసాగుతున్న జ్ఞాన బలాలే సృష్టిని స్థిరంగా కాపాడుతున్నాయి. టైటానిక్ ఓడను అద్భుతంగా తయారుచేయగల తెలివి బలం మనుషులకు ఉన్నా, దాన్ని కాపాడుకోగల శక్తి జ్ఞానం మనుషులకు లేకుండా పోయింది. అయితే ఇంత మహా విశాలమైన విశ్వాన్ని సృష్టించిన దేవుడు, దాన్ని కొనసాగించగల సమర్థుడైనందువల్ల సృష్టి ఇప్పటికీ ఉనికిలోనే ఉంది.
అదే విధంగా దేవుడు తన కృప, దీర్ఘశాంతం, సత్యంవంటి గుణ లక్షణాల విషయంలో ఎన్నడూ మార్పు చెందడు. సృష్టి ఆరంభం నుంచి తన బిడ్డల యెడల దేవుడు ఏ విధంగా కృప చూపించాడో దీర్ఘశాంతాన్ని కనపరిచాడో అదే దేవుడు మార్పు లేకుండా అలానే ఉన్నాడు. తన ఆజ్ఞలను అతిక్రమించి, విగ్రహారాధన చేసిన తన ప్రజలను రోషంతో శిక్షించిన దేవుడు, అదే విధమైన రోషంతో ఇప్పటికీ ఉన్నాడు. నోవహు కాలంలో ప్రజల పాపాన్ని బట్టి జల ప్రళయాన్ని పంపించిన, సొదొమ గొమొర్రాలపై అగ్ని గంధకాలను కురిపించిన సర్వలోక న్యాయాధిపతి ఇప్పటికీ అలానే ఉన్నాడు. తన మహాత్కార్యాలతో ఐగుప్తు ప్రజలను శిక్షించిన సర్వ శక్తిమంతుడు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించిన కృపగల విమోచకుడు ఇప్పటికీ అదే విధంగా ఉన్నాడు. తన ప్రజల పాపాన్ని బట్టి తొలుత శిక్షించినా, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారిని సర్వ నాశనం చేయకుండా ఆగిపోయిన నమ్మదగిన దేవుడు ఇప్పటికీ అదే నమ్మకత్వంతో ఉన్నాడు. యెహోవానైన నేను మార్పు లేనివాడు కాబట్టే ఇశ్రాయేలీయులమైన మీరు లయం కాలేదు అని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. దేవుని మార్పులేని తత్వానికి తన ప్రజల క్షేమానికి సంబంధం ఉంది. ఒకవేళ దేవుడు మన క్షేమానికి మన భక్తినే ఆధారం చేసుకుని ఉంటే, మన భక్తి స్థిరంగా ఉండదు కాబట్టి మనల్ని ఎప్పుడో ఆయన నాశనం చేయాల్సి వచ్చేది.
దేవునిలోని కృపా కటాక్షాలు, ప్రేమానురాగాలు, దీర్ఘశాంతం, క్షమాగుణం, నమ్మకత్వం, శక్తీ, జ్ఞానం మార్పు చెందవు కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు. దేవునిలోని సత్యం నీతి న్యాయం ఉగ్రత అనే గుణ లక్షణాలు మార్పు చెందవు కాబట్టి మనం ఆయనకు భయపడాలి. అంతేకాదు మన చుట్టూ ఉన్న మంచి మనుషులు చెడ్డవారిగా మారిపోయినా, చెడ్డవారు మంచివారిగా మారిపోయినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు, ఆందోళనకు గురికానక్కర లేదు. మనుషులు ఎలాగైనా మారిపోవడం సర్వ సాధారణమే!

06/01/2025

జనవరి 5 తండ్రికి సమానుడైన యేసు
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను - తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును," (యోహాను 5:19).
ఈ మాటలు చెప్పడానికి ముందే, అంటే 5:18లో యేసు తాను దేవునితో సమానుణ్ణని చెప్పుకున్నాడు. ఈ వచనంలో ఆ అంశాన్నే ఆయన కొనసాగిస్తున్నాడు. భూమ్మీద యేసు యొక్క జీవితం, పరమందున్న తండ్రి చేస్తున్న పనులకు అద్దంపడుతోంది. తనకు తోచిన ప్రతిదానిని ఆయన చేయలేదు. "తనంతట తాను ఏదీ చేయలేడు" అనే మాటను గమనించండి! ఏంటి, యేసు తనకు తానుగా ఏదీ చేయలేడా? ఈ మాట ఏం తెలియచేస్తున్నది? ఆయన యొక్క శక్తిహీనతను తెలియజేస్తున్నదా? ఒకవేళ ఎవరైనా ఇలా చెబితే వాళ్ళు దేవదూషణ చేసినట్లే! మన ప్రభువైన యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు (యెషయా 9:6). ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు (ఆది 18:14). మరి ఈ మాటకు అర్థం ఏంటి? భూమ్మీద కుమారుడు ఏం చేయాలో పరమందున్న తండ్రి నిర్ణయిస్తాడు. కుమారుడైన యేసు ఆ నిర్ణయానికి తలవంచి, దానిని నెరవేరుస్తాడు. శరీరధారిగా ఉన్నందువలన మాత్రమే కాదు, త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు పనిచేసే విధానాన్ని చూసినా, కుమారుడు తండ్రికి లోబడుతూనే ఉంటాడు. లోబడడం వలన కుమారుడు తండ్రి కంటే తక్కువ కాడు. ఆజ్ఞాపించడం వలన తండ్రి కుమారుని కంటే ఎక్కువ కాడు. నాయకులకు, అనుచరులకు పరిపూర్ణమైన ఆదర్శం మన త్రియేక దేవుడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను గమనించి, అనుసరిస్తే మానవాళికి ఎంతో మేలు. కాబట్టి "కుమారుడు తనంతట తాను ఏదీ చేయనేరడు" అనే మాట "తండ్రియైన దేవుని చిత్తానికి యేసుక్రీస్తు చూపించే సంపూర్ణమైన విధేయతను" సూచిస్తున్నది.
"తండ్రి ఏది చేయుట చూచునో"- ఈ మాట, తండ్రి కుమారుల మధ్యన ఉన్న అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని సూచిస్తున్నది. నా గురించి నా భార్య బిడ్డలకు తెలిసిన దాని కంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకు? ఇతరులతో కంటే నా భార్య బిడ్డలతోనే నేను ఎక్కువ సమయం గడుపుతాను కాబట్టి. ఇతరులతో కంటే నా భార్య బిడ్డలతోనే నా మనసును ఎక్కువగా పంచుకుంటాను కాబట్టి. ఇతరులతో నాకున్న బంధం కంటే, ఇతరుల యెడల నాకున్న ప్రేమ కంటే నా భార్యాబిడ్డల యెడల నాకున్న ప్రేమ వారితో నాకున్న బంధం బలమైనవి కాబట్టి. అదే విధంగా తండ్రి కుమారుల మధ్యనున్న ప్రేమ బంధం మనం ఊహించలేనంత బలమైనది, గొప్పది. అందువలన తండ్రి చేస్తున్న కార్యాలను కుమారుడు చూస్తుంటాడు, తండ్రి కుమారునికి చూపిస్తుంటాడు. "తండ్రి ఏ కార్యాలనైతే చేస్తాడో, వాటినే కుమారుడైన యేసు చేస్తాడు, ఖచ్చితంగా తండ్రి చేసిన విధంగానే యేసు కూడా ఆ కార్యాలను చేస్తాడు." ఈ మాటలు తండ్రితో కుమారుడు సమానుడని రుజువు చేస్తున్నాయి.
భూమ్మీద జీవించిన మనుషుల్లో సొలొమోను అత్యంత జ్ఞానం కలిగిన వాడు. సొలొమోనును అత్యంత దగ్గరగా ఉండి చూసిన వ్యక్తులు అతడు చేసిన విధంగానే పనులు చేయగలిగారా? అతడు మాట్లాడిన విధంగానే మాటలు చెప్పగలిగారా? ఆనాడు ఎవ్వరికీ అది సాధ్యం కాలేదు. ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో అత్యంత బలం పొందినవాడు సంసోను. సంసోను బలం అసమానమైనది. అతడు చేసిన కార్యాలను అత్యంత దగ్గరగా ఉండి చూసిన వ్యక్తుల్లో ఏ ఒక్కరైనా, అతడు చేసిన విధంగానే బలమైన కార్యాలను చేయగలిగారా? లేదు, కదా! అయితే పరలోకమందున్న తండ్రి చేసిన కార్యాలను భూమ్మీదనున్న కుమారుడు చేయగలుగుతున్నాడు. ఖచ్చితంగా తండ్రి చేసిన విధంగానే చేయగలుగుతున్నాడు. వాటిని తప్ప వేరే దేనినీ ఆయన చేయడం లేదు. తండ్రితో అన్ని విషయాల్లో కుమారుడు సమానం కాకపోతే ఆయన చేసిన విధంగానే యేసు కూడా కార్యాలను చేయడం అసంభవమే, అసాధ్యమే! ఇక్కడ మనం ప్రభువైన యేసుక్రీస్తును రెండు విషయాలను బట్టి స్తుతించాలి. మొదటిది, తండ్రితో సమానమైన దైవత్వాన్ని కలిగి ఉన్నందుకు ఆయనను మనం స్తుతించాలి. రెండవది, తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడైన యేసు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం తనను తాను తగ్గించుకున్నందుకు ఆయనను మనం స్తుతించాలి.

Address

Labbipet
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when Reformed Church, Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category