26/08/2026
శ్రావణమాస మహాత్మ్యము – 13
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం!
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!
ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు.
ఓ మునీశ్వరా! ఇకముందు "శ్రావణ మాసములో రెండు పక్షములయందు వచ్చునటువంటి ఏకాదశుల ముందు చేయతగిన కృత్యమును" చెప్పెదను. సావధాన మనస్సు గలవాడవై వినుము.
ఓ చిన్నవాడా! శ్రేష్ఠమైన ఈ ఏకాదశీ వ్రతమును ఇదివరకు ఎవరికిని నేను చెప్పియుండలేదు. రహస్యముగా ఉన్నది. కాబట్టి, ఈ ఏకాదశీ వ్రతము విశేషమగు పుణ్యమును ఇచ్చునదిగాను, మహాపాతకములను నశింపజేయునదిగాను, మనుష్యులకు కోరిన కోరికలను ఇచ్చునదిగాను, ఉపపాతకములను అన్నింటిని నశింపజేయునదిగాను, శ్రేష్ఠమైన వ్రతములన్నింటిలోను గొప్పదిగాను, శుభములను ఒసగునదిగాను, సమస్తమైన మహామునులచేతను చెప్పబడెను.
కాబట్టి, ఓ మునీశ్వరా! ఈ ఏకాదశీ వ్రతమును నీకు చెప్పెదను. సావధానచిత్తము గలవాడవై వినుము. దశమి దినంబున ప్రాతఃకాలంబున స్నానము చేసి, పరిశుద్ధుడై, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, వేదమును చదివినవారు, పురాణమును తెలిసినవారు, ఇంద్రియములను జయించినవారు మొదలగు సత్పురుషుల వలన అనుజ్ఞ గైకొని, దేవదేవుడగు భగవంతుని షోడశోపచారములచేత పూజించి, “పద్మములవంటి నేత్రములు గల ఓ నారాయణమూర్తీ! ఈ దినంబున ఏకభుక్తమును, ఏకాదశీ దినంబున ఉపవాసమును చేసి, ద్వాదశీ దినంబున భుజించెదను. ఓ భగవంతుడా! నన్ను రక్షింపుము” అని ప్రార్థించవలెను.
ఓ చిన్నవాడా! ఈ మూడు దినములయందు నియమముగా ఉండి, గురువులు, దేవతలు, అగ్నిహోత్రము వీరి సన్నిధానమునందే నివసించుచు, కామక్రోధాది దుష్టగుణములను విడిచి, శాంతస్వభావము గలవాడై, ఈ మూడు దినములయందును భూమియందే పరుండవలయును.
ఓ చిన్నవాడా! అనంతరము ఏకాదశి నాడు ఉదయముననే లేచి, విష్ణువునందు చిత్తము గలవాడై, తుమ్మినను, దగ్గినను “శ్రీధర! శ్రీధర!” అని స్మరణ చేయుచు, పాషండులు మొదలగు వారిని చూచుట, వారితో సంభాషించుట, వారి మాటలను వినుట మొదలగువాటిని మూడు దినములు విడిచి, ముక్తికి కారణమగు ఏకాదశీ వ్రతమును చేయవలయును.
అనంతరము మధ్యాహ్నకాలంబున నదులు మొదలగు పవిత్రములగు జలంబున స్నానము చేసి, క్రోధాది దుర్గుణములను విడిచి, పంచగవ్య ప్రాశనము చేసి, సూర్యునకు నమస్కారము చేసి, భగవంతుని శరణును పొంది, తన కులాచార సంబంధమగు కృత్యములను నెరవేర్చి యింటికి రావలెను.
అనంతరము శ్రద్ధాభక్తులతో కూడినవాడై, పుష్పములు, ధూపములు, దీపములు, అనేక విధములగు నైవేద్యములు మొదలగువానిచే శ్రీధరుని పూజించవలయును.
ఒక కలశమునకు మంచి గంధము పూసి, దానికి నూతనమగు రెండు వస్త్రములను చుట్టి, దానిలో రత్నములు, బంగారము ఉంచి, శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములచే ఒప్పబడుచుండెడి విష్ణుమూర్తి ప్రతిమను పూర్వమందు చెప్పబడిన కలశమునందుంచి, యథావిధిగా పూజించి, ఆ రాత్రియంతయు సంగీతము, వాద్యములు, హరికథా కాలక్షేపములు మొదలగువానిచే వెళ్లబుచ్చి, ద్వాదశి నాడు తెల్లవారగానే లేచి, స్నానసంధ్యావందనాది నిత్యకృత్యములు నెరవేర్చి, శ్రీధరునియందే చిత్తము గలవాడై, ఆ ప్రతిమను తిరిగి పూజించి, దక్షిణతో కూడ ఆ కలశమును, ప్రతిమను ఆచార్యునకు దానమియ్యవలయును.
ఓ మునీశ్వరా! “శ్రీధరుడు సంతోషించుగాక, నాకు విశేషమగు ఐశ్వర్యమును ఇచ్చుగాక” అని ప్రార్థించి, జగత్ప్రభువగు విష్ణుమూర్తిని పూజించి, నవనీతము మొదలగునవన్నియు బ్రాహ్మణునకు ఇచ్చి, మరియు ఇతరులగు బ్రాహ్మణులకు కూడ భోజనము పెట్టి, తన శక్తికొలది దక్షిణను ఇయ్యవలయును.
అనంతరము భృత్యులు మొదలగు వారికిని భోజనము పెట్టి, గోవులకు పచ్చిక మొదలగు మేత వేసి, అనంతరము స్నేహితులు, బంధువులు మొదలగు వారితో కూడి తాను భుజింపవలెను.
ఓ సనత్కుమారా! ఈ ప్రకారము శ్రావణ శుక్ల ఏకాదశీ వ్రతము చెప్పబడినది. ఈ ప్రకారముగానే శ్రావణ మాసములో బహుళ ఏకాదశి యందును వ్రతము చేయవలయును.
రెండు ఏకాదశుల యందును కృత్యములు సమానమే గాని, నామములు మాత్రము వేరు. అది ఏవిధముగా అనగా, శుక్లపక్ష ఏకాదశి యందు పూజించినప్పుడు శ్రీధరుడు అనియు, బహుళపక్ష ఏకాదశి యందు పూజించునప్పుడు జనార్దనుడు అనియు పూజింపవలయును.
శుక్లపక్షంబున శ్రీధరుడనియును, బహుళపక్షంబున జనార్దనుడనియు విష్ణుమూర్తి వేరువేరు నామముల చెప్పబడుచున్నాడు. కాబట్టి ఈ విధమగు రెండు ఏకాదశీ వ్రతములను నీకు చక్కగా వివరించి చెప్పితిని.
దీనితో సమానమగు పుణ్యవ్రతము ఇదివరకు ఎక్కడను లేదు, ఇక ముందును కలుగబోదు. కావున, ఇది నీవు రహస్యముగా నుంచుము, దుష్టస్వభావులకు చెప్పగూడదు.
ఈశ్వర ఉవాచ:
ఓ మునీశ్వరుడా! ఇకముందు, “ద్వాదశి యందు విష్ణువును గూర్చి పవిత్రారోపణ వ్రతమును” చెప్పెదను, వినుము. ఈ పవిత్రారోపణ విషయమై ఇదివరకు దేవీసంబంధమగు పవిత్రారోపణమునకు చెప్పబడినట్లుగానే కృత్యములన్నియును సమానము. దీనియందు గల విశేషములు మాత్రము చెప్పెదను. సావధానమనస్సు గలవాడవై వినుము. దీనియందు వ్రతము చేయుటకు తగిన అధికారి విషయమును గూర్చి చెప్పబడినది కావున, దానిని గూర్చి చెప్పెదను.
బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, స్త్రీలు, శూద్రులు అందరును తమ ధర్మములయందు ఉండువారలై, భక్తితో కూడుకొని ఈ పవిత్రారోపణ వ్రతమును చేయవచ్చును.
విష్ణువును గురించి పవిత్రమును అర్పించునప్పుడు బ్రాహ్మణుడు “ఆతో దేవీ” అను మంత్రమును జెప్పుచు అర్పింపవలయును. స్త్రీలు, శూద్రులు విష్ణువు యొక్క పేరును చెప్పుచు పవిత్రమును అర్పింపవలయును.
శివుని గురించి పవిత్రారోపణ వ్రత విషయములో “కద్రుద్రాయ” అను మంత్రమును చెప్పి బ్రాహ్మణుడు పవిత్రమును అర్పించవలయును. శివుని నామములను చెప్పి స్త్రీలు, శూద్రులు పవిత్రమును అర్పించవలయును.
కృతయుగములో మణులతో కూడిన పవిత్రమును, త్రేతాయుగములో బంగారపు పవిత్రమును, ద్వాపరయుగములో పట్టుపవిత్రమును, కలియుగములో ప్రత్తి సంబంధమగు పవిత్రమును అర్పణ చేయవలెను.
ఈ పవిత్రారోపణమును యతీశ్వరులు మనస్సునందే చేయవలయును. ఈ పవిత్రములను వెదురు పాత్రయందుంచి, శుభ్రమగు నూతన వస్త్రములచే కప్పి, “ఓ ప్రభువా! నేను పాత్రను వస్త్రముచే కప్పిన రీతిగానే నా వ్రతలోపములు అన్నియును కప్పివేయుము. నీవు సంతసించుటకు ఈ పవిత్రారోపణ వ్రతమును చేసితిని. ఓ స్వామీ! నా యందు దయగలవాడవై, నేను చేయు వ్రతమునకు విఘ్నము కలిగింపకుము” అని ప్రార్థించవలెను.
ఓ దేవా! ఎల్లప్పుడు సమస్త విధములచే నీవే నాకు దిక్కు. ఓ స్వామీ! నేను ఈ పవిత్రస్వరూపుడనై నిన్ను సంతోషింపజేయువాడనగుదును.
ఓ స్వామీ! వ్రతమునకు విఘ్నమును కలిగించెడి కామము, క్రోధము మొదలగు దుర్గుణములు నాకు కలుగనీయకుము. ఇది మొదలు సంవత్సరము పూర్తి అగుపర్యంతము నీవు నన్ను రక్షింపుము. నీకు నమస్కారము చేసెదను.
ఈ ప్రకారము దేవతను ప్రార్థించి, వెదురుచే నిర్మింపబడిన శోభస్కరమగు పాత్రయందుంచబడిన పవిత్రమును ఇట్లు ప్రార్థించవలెను.
“ఓ పవిత్రమా! నేను సంవత్సర పర్యంతము చేసిన పూజను పవిత్రము చేయుట కొఱకు ఇప్పుడు విష్ణులోకము నుండి వచ్చితివి. నీకు నమస్కారము.
ఓ స్వామీ! విష్ణుతేజస్సు వలన కలిగినదియు, మనోహరమైనదియు, సమస్త పాపములను పోగొట్టునదియు, సమస్త కోరికలనొసగునదియు అయిన ఈ పవిత్రమును నీ శరీరమందుంచెదను.
ఓ స్వామీ! నారాయణమూర్తీ! నిన్ను పూజించుట కొఱకు ఆవాహన చేసితిని. కావున నీకు నమస్కారము చేసెదను. నాకు ప్రత్యక్షమగుము. ప్రాతఃకాలంబున ఈ పవిత్రమును నీకు అర్పణ చేసెదను.”
అనంతరం పుష్పాంజలినిచ్చి ఆ రాత్రి జాగరణ చేయవలయును. ఇట్లు ఏకాదశి నాడు ఆవాహన చేసి, ద్వాదశి నాడు ఉదయంబున తిరిగి పూజింపవలెను.
గంధం, గరికెలు, అక్షతలు మొదలగువానితో అలంకరింపబడిన పవిత్రమును పుచ్చుకొని, “ఓ స్వామీ! నన్ను పవిత్రమును చేయుటకును, సంవత్సర పర్యంతము నే చేసిన పూజ సఫలమగుటకును, నేను అర్పణచేయునటువంటి పవిత్రమును గ్రహింపుము” అని ప్రార్థించవలెను.
“ఓ స్వామీ! నేను చేసిన పాపమును పోగొట్టి నన్ను పవిత్రునిగా చేయుము. ఓ దేవతా సార్వభౌమా! నీ అనుగ్రహము వలన పరిశుద్ధుడనగుదును” అని ప్రార్థించి, మూలబీజాక్షరములతో సంపుటి చేయబడిన మంత్రములతో పవిత్రమును స్వామికి అర్పణచేయవలెను.
మహానైవేద్యము, నీరాజనము మొదలగునవి జరిపి, పిమ్మట అగ్నిహోత్రమునందు మూలమంత్రముతో నెయ్యి, పరమాన్నము మొదలగు వానిని హోమము చేయవలయును.
ఈ మూలమంత్రంతోనే పవిత్రమునకు ఉద్వాసన చెప్పి, “ఓ పవిత్రమా! సంవత్సర పర్యంతము నే చేసిన పూజను సఫలమగునట్లు చేసితివి. నీవు ఇప్పుడు విష్ణులోకమునకు వెళ్లుము” అని చెప్పి, ఆ పవిత్రమును తీసి బ్రాహ్మణునికై ఇయ్యవలయును, లేక ఉదకంలోనైనా విడువవలయును.
ఈ విధమగు విష్ణువును గూర్చిన పవిత్రారోపణ వ్రతమును నీకు చెప్పితిని. ఈ వ్రతమును చేసినవారు ఇహలోకమున సుఖములనొంది, అనంతరం మోక్షమునొందుదురు అని సనత్కుమార మునీశ్వరునితో సాంబమూర్తి చెప్పెను.
|| ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర-సనత్కుమార సంవాదే — “ఉభయైకాదశీ వ్రతకథనం” మరియు “ద్వాదశీ వ్రతకథనం” నామోధ్యాయః సమాప్తః ||
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀