15/07/2016
ఆషాఢ మాస ఏకాదశి #తొలి_ఏకాదశి గా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
ఏకాదశి రోజున శ్రీహరిని పూజించండం మంచిది
ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు.
ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై పండుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో చెపుతారు. అం టే వ్రతము తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు.
అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉం ది. అలాగే శయనైకాదశి అని కూడా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఎందుకంటే పండుగల ప్రారంభానికి పండుగగా!
వ్రతంలోని ప్రధాన నియమాలు :
ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు 1.దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. 2. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్యమాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 5. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 6. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 7.అన్నదానం చేయడం చాలా మంచిది.
తినగూడని, విసర్జించవలసిన పదార్థాలు...
గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మంచంపై పడుకొనుట, బయట భుజించుట తగవు. ఈ నాలుగు నెలలు ఇవన్నీ పనికి రానివిగా గుర్తించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు జాతక కథలలో చాల చోట్ల చెప్పబడింది. జైనులు (అహింసా వ్రతాన్ని పాటిస్తారు). చాతుర్మాస్య వ్రతాన్ని వారు పాటిస్తారు నేటికీ!అసలు ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతాకల్పం ప్రారం భించాలని భగవంతుడు యుధిష్ఠరునకు చెప్పినట్లు అందున్నది. ఈ వ్రతంలో పిప్పల వృక్షం ప్రధానం అంటే ఆ వృక్షానికి ప్రదక్షిణ, దేవాలయాల్లో దీపారధన, ఈ వ్రతంలో సరస్వతీ పూజ కూడా ఉంది.
శ్రీ నారాయణ స్తుతి...
సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భవమ్
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్
అంటే... అనంత శిరస్సులు, అనంతమైన నేత్రములు కలవాడు, విశ్వమంతటికీ సుఖములు కలిగించేవాడు, సర్వ ప్రాణులనూ ఆధారభూతుడు, శాశ్వతుడు, అన్ని లోకాలకు శుభములను కలిగించే వాడు, మంగళ కరుడు, మోక్ష ప్రదాత అయిన శ్రీ మహా విష్ణువుకు నమస్కారం!