30/08/2019
All about Kulluru
కుల్లూరు సీమ
***********
కుల్లూరి సీమకు విజయనగరసామ్రాజ్యానికీ విడదీయరాని
సంబంధం ఉంది .శ్రీకృష్ణదేవరాయల హయాంనుండీ ఆరవీటి రాజుల హయాం వరకూ ఈ సంబంధం కొనసాగింది . విజయనగర రాజులు పరిపాలనా సౌలభ్యం
కొఱకు సామ్రాజ్యాన్ని కొన్ని రాజకీయ విభాగాలుగా మలచుకున్నారు . ' సీమ ' అనే విభాగం అందులో ఒకటి .
నెల్లూరు సీమ , ఆత్మకూరు సీమ , వెంకటగిరి సీమ , రాపూరు సీమ , కుల్లూరు సీమ అనేవి మన ప్రాంతానికి
చెందిన ' సీమ ' విభాగాలు .
విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన సంగమ సాలువ వంశాల తదుపరి తుళువ వంశం అధికారాన్ని
చేజిక్కించుకుంది . తుళువ నరసనాయకుడు నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణదేవరాయడు తిమ్మరసయ్య తంత్రాంగంతో 1509 లో ఆగష్టు 8 న
శ్రీజయంతి పర్వదినాన విజయనగర సామ్రాజ్య పట్టాభి
షిక్తుడైనాడు . దిగ్విజయ యాత్రలు సాగించి , సామ్రాజ్యాన్ని బహుదా విస్తరించి , అవిఛ్ఛిన్నంగా 1529
వరకూ రాజ్యపాలన చేసాడు . ఉదయగిరి , కొండవీడు ,
కొండపల్లి , సంహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు .
ఉదయగిరి దుర్గాధిపతి తిరుమల రాహత్తరాయని ఓడించి , తన సేనాపతి రాయసం కొండమరుసయ్యను
దుర్గాధిపతిగా నియమించాడు . దుర్గంలోని బాలకృష్ణ
విగ్రహాన్ని రాజధాని హంపికి తరలించి , కృష్ణాలయం
నిర్మించాడు .
1512 లో ఉదయగిరి దుర్గాధిపతిగా నియమించబడ్డ కొండమరుసయ్య మహామంత్రి తిమ్మరు
సయ్య సమకాలికుడు , బంధువు , సేనానులలో ఒకడు .
నాటి కుల్లూరు సీమలో నేటి కలువాయ , అనంతసాగరం మండలాలూ , తెగచెర్ల వరకూ రాపూరు మండలంలో కొంతభాగం గ్రామాలు ఏలుబడిలో ఉండేవి .
ఈ ప్రాంతాలు నీటి యెద్దడితో పంటలు పండక కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండుటను తెలుసుకుని
రాయలవారు సేద్యపరంగా చెఱువులు నిర్మించడానికీ ,
సైనికపరంగా వటిష్టం చేయడానికీ పూనుకుని , ఉదయగిరి
దుర్గంనుండి కుల్లూరుసీమకు అధిపతిగా నియమించి నాడు . కొండమరుసయ్య 1514 ~ 15 ప్రాంతంలో
కుల్లూరు పట్టణంలో మట్టికోటను నిర్మించి , కోటకు ప్రక్కనే
నల్లచెఱువును , శివాలయాన్నీ నిర్మించాడు . కోట చుట్టూ
శత్రు దుర్భేద్యంగా అగడ్తను ఏర్పరచినాడు . తంజనగరం నుండి గుఱ్ఱాలను కొని తెచ్చి , కోటలో ఆశ్విక దళాన్ని
ఏర్పాటు చేసి , కుల్లూరును సైనిక పట్టణంగా తీర్చిదిద్దినాడు .
అరోజుల్లో , కుల్లూరు పట్టణం యుధ్ధ విద్యలలో నిరంతర శిక్షణ శిబిరాలతో సందడిగా ఉండేది . కొండమరుసయ్య ఆధిపత్యంలోనే అనంతసాగరం , కలు
వాయ చెఱువులు కూడా నిర్మింప బడ్డవి .
విజయనగర రాజుల హయాంలో ఒక సంవత్సర
కాలం అంటే _ ఆశ్వజయ శుధ్ధ దశమి మొదలు మహర్ణవమి వరకు . ఈ సాంప్రదాయం కుల్లూరు పట్టణంలో కూడా ఉండేది . ఆశ్వజయ మాసారంభం నుండి మహర్ణవమి వరకూ తొమ్మిది రోజులు పట్టణంలోని సైనిక శిబిరాలలో యుధ్థవిన్యాసాల పోటీలు జరిగేవి .
గెలుపొందిన వీరులకు విజయదశమి రోజున బహుమతి
ప్రదానం జరిగేది . విజయదశమి నుండి జైత్రయాత్రలు
సాగించేవారు .
చంద్రగిరి రాజధానిగా పాలించిన సాళువ నరసిం
హరాయల వద్ద కొలువు చేసిన ఆరవీటి తిమ్మరాజు రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశం చేజిక్కించుకుంది . తిమ్మరాజు కొడుకు తిరుమలరాయ
లు . అతని కొడుకులలో వీర వెంకటపతి రాయలు చం
ద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాన్ని 1612 వరకూ పాలించినాడు .
వీర వేంకటపతి రాయలపై తమిళప్రాంతం లోని
పాండ్యులు తిరుగుబాటు చేసినారు . ఈ తిరుగుబాటును రాయల సామంతరాజు రేచర్లపద్మనాయక ప్రభువైన రాజా వెలుగోటి వెంకటపతినాయనింగారు సమర్ధంగా
అణచివేసినారు . అందుకు బహుమానంగా వీరవేంకటపతిరాయలు నెల్లూరు ప్రాంతాన్ని అమరానకు
పాలించుకొనుటకిచ్చి , పంచపాండియధరావిభాళుం
డు , సంగ్రామపార్ధుండు , పద్మనాయక వంశాంభోది చంద్రుండు అను బిరిదులతో నాయనింగారిని
సత్కరించినారు .
నాయనింగారి ఏలుబడి లోకి కుల్లూరిసీమ కూడా
చేరింది . అటుపై రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని
కుల్లూరిసీమ కధిపతిగా నియమించుకొనిరి .
విజయనగర రాజుల మార్గంలోనే , వెలుగోటి
వెంకటపతి నాయనింగారు కుడా ప్రజోపయోగ కార్యాలలో
ప్రసిధ్ధి చెందిరి . అనేక చెరువులు వీరి హయాంలోనే మరమ్మత్తులకు నోచుకున్నవి . కుల్లూరుసీమలో భాగమైన
అనంతసాగరం చెఱువు గట్టు కేతామన్నేరు ఉరవడికి
ప్రతియేటా తెగి , నీళ్ళు ఊళ్ళను ముంచుతుండేవి . వెంక
టవతి నాయనింగారు రుద్రప్పనాయనింగారిచే కట్టను పటిష్టపరచి , తూము నిర్మింపజేసి శాశ్వత పరిష్కారం
చూపినారు . అనంతరం కలువాయ చెఱువుకు అలుగు
నిర్మించినారు .
1612లో రాజా వెలుగోటి వెంకటపతి నాయనిం
గారు కుల్లురుసీమ అధివతి రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని తన కొలువుకు రావించి ,
సబహుమానంగా గౌరవించి , తన తండ్రి రాజా కుమార తిమ్మానాయనిగారికి పుణ్యం కలనగననట్లుగా కుల్లూరు
నల్ల చెఱువుకు తూర్పలుగు నిర్మించవలసందిగా కోరిరి .
వారికోరిక మేరకు రుద్రప్పనాయనింగారు ముప్పదిమూ
డు శిలాస్ధంభాలతో నల్లచెఱువుకు అలుగు నిర్మాణం
చేపట్టినారు . సాక్ష్యంగా ఇప్పటికీ మా చెఱువు గట్టున ఒక
శిలా శాసనం ఉంది .
మా కుల్లూరు
**********
1 .
ఉత్తరాన పెన్న , ఊరికి పడమట
చెరువు , చెరువు వెనుక ధరణి ధరము ,
దక్షిణాన చేలు , దర్శింప దూరాన
పెనుశిలేశు డుండు పెన్నిధి వలె .
2 .
నాల్గు దిశల బలము నైసర్గి కమ్ముగా
కలిసి వచ్చి వాస్తు ఘనత దాల్చి
చదువులందు సిరులు సంపదలందున
చుట్టు పట్ల ప్రజల స్తుతులు బొందె .
3 .
సువిశాలమైన వీథులు
నవవిథ కులాలవాళ్ళు నవ్యత లొలుకన్
ప్రవిమల ప్రశాంత ప్రకృతిని
రవి కిరణము వోలె వెల్గు రాజస ఠీవిన్ .
4 .
విజయ నగర రాజ్యములో
మజరా మా కుల్లూరు గ్రామ మద్భుత రీతిన్
అజరామరమై వెలిగెను
ప్రజలెల్లరు కలిసి మెలిసి బ్రతికిరి ఘనతన్ .
5 .
కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండిరట , విజయనగర నియుక్తాధిపతై -
6 .
కొండమరుసు ప్రభువు కుల్లూరు నిర్మించె
చెరువు ప్రక్క సకల శ్రీకరముగ
కొలని ప్రక్క నున్న కొల్లూరు , కుల్లూరు
గాగ మారె కాల క్రమము లోన .
7 .
అచ్యుత స్వామి మా కండ దండగ నిల్చె
శ్రీదేవి భూదేవి చేరి కొలువ
వక్షస్థలముపైన వరలక్ష్మి నివసింప
నిలువెల్ల తోమాల నిలిచి మెరయ
శంఖ చక్రాలతో శార్ఙ గదాదండ
భూషణాలంకృత మూర్తి యగుచు
గరుడుండు పాదాల కడ కొలువుండగా
మోహనాకారమ్ము ముద్దులొలుక
8 .
ఆరడుగులు మించి నిలిచి , చేర వచ్చి
మ్రొక్కు కున్నట్టి భక్తుల మ్రొక్కు దీర్చ
మహిత రమణీయ దివ్య ధామమ్ము నందు
కొలువు దీరెను కుల్లూరు నిలయు డగుచు .
9 .
శ్రీ భూ దేవేరులతో
వైభవముగ నచ్యుతప్ప వరదుడు వెలుగున్
శోభాయమానముగ , నీ
ప్రాభవ మే యూర గనము , వైష్ణవ మూర్తిన్ .
10 .
ఎప్పుడు నిర్మించిరొ ! ఆ
చొప్పులు దెలియంగ రావు , శుభ గోపురమున్
ఒప్పుగ నిర్మించె ఘనుడు
గొప్పగ నీ గుడికి తోట గురుమూర్తి యనన్ .
11 .
ఎంద రెందరొ భక్తులీ మందిరాన్ని
పూని జీర్ణోధ్ధరణ జేసి , పుణ్య ఫలము
నందినా రచ్యుతుని మనోఙ్ఞ నయన లస
దృక్కులు బడి తడిసి వినుతింప బడిరి .
12 .
వారిలో మాయూరి ప్రముఖులు మాదాసు
గంగాధరం గారు కడు ప్రధములు ,
దరిమడ్గు కామయ్య తలకెత్తుకొని కార్య
భారమ్ము వహియించె భక్తి గదుర ,
నాటి దేవాదాయ మేటి కమీషనర్
అనుమతు లిచ్చిరి , ఘనులు , వారు
మా యూరి యల్లుడు , మహిత యశులు , బాల
సుబ్రహ మణ్యము శుభ ప్రథముగ
13 .
దీని పూజాదికములకు పూని , పెను శి
లేశుడు తగు వెచ్చము లిడు , నింక నొకరు
అందె చెన్నప్ప శెట్ఠిగా రందు కొంత
ట్రస్టు రూపాన ఖర్చుకు వ్రాసి నారు .
14 .
అచ్యుత స్వామి గుడిప్రక్క నప్పు డెపుడొ
ఎవరు నిర్మించిరో గాని యెరుక పడదు
చెన్న కేశవ గుడి చాల శిధిలమయ్యె
విగ్రహము కూడ లేదు , పోవిడిచి రటులె .
15 .
బలిజలకు చెన్న కేశవు డెలమి కొలుచు
దైవమై గ్రాలు గాన ప్రాధాన్య మెరిగి
పూని గంగాధరం గారు భుజము మోపి
తలచి నిర్మించె క్రొత్తగా ధార్మి కుండు .
16 .
దేవ దేవుండు దేవేరు లీవిథముగ
దివ్య మంగళ మూర్తులై తీరి నిలువ
నెంత పుణ్యంబు జేశామొ యిచట బుట్టి
చెన్న కేశవ స్వామికి సేవ చేయ .
17 .
ఇందు నందున రాముని మందిరాలు
ఊరి కుత్తర దక్షిణ పూరు లందు
రెండు గల వెందుకో ? వితర్కించి చూడ
తెలిసె నొక గుట్టు , చెప్పెద తెలిసి నంత .
18 .
కొండొక సైన్య పటాలం
బుండిన కోటున్న దిచట , పూర్వము బలిజల్
దండి మగలు రౌతులుగా
నుండి రని మొదట వచించి యుంటిని దెలియన్ .
19 .
యుధ్ధ విద్యల నేర్పించ నుధ్ధతులను
గురువులను దెచ్చి విద్యల గరపి నారు ,
సాము గరిడీలు నేర్పగా సగము సగము
పంచుకొనిరిట్లు పురమును పట్టు కొరకు .
20 .
నల్లంగు వాళ్ళ బడియని
అల్లాగునె వెంకయబడి యని పేర్లరయన్
యెల్లన్ విద్యల నేర్చిరి
కుల్లూరున పిల్ల లెల్ల కోవిదు లవగా .
21 .
బడులు గుడులౌను దశరాకు , ప్రభలు గట్టి
రామ లక్ష్మణ సీత విగ్రహము లొనర
దీర్చి , పురవీథులందున జేర్చి , యచట
సాము గరిడీలు ద్రిప్పుట నీమ మిచట .
22 .
పిల్లలకు తాము నేర్పిన విద్య లరయ
సాము గరిడీలతోటి విస్మయము గదుర
తనరి జేయంగ విద్యా ప్రదర్శనముల
ఊరు ఊరంత ఉర్రూత లూగు చుండు .
23 .
యుధ్ధ విద్యలు కొలువైన యూరు గనుక
సైన్యమున రౌతులై యున్న చదురు గనుక
సాము గరిడీల పోటీలు సాగు చుండు
ముచ్చ టొకనాడు కుల్లూరు పురము గనెను .
24 .
రాజ్యములు కోటలును సైన్య రావడులును
పోయె , నిరుగడ బడులు రూపులను మాసి
రామ మందిరా లయ్యెను , రామణీయ
కముగ దసరా మహోత్సవ కాంతు లొనరె .
25 .
నాకు దెలిసియు దశరాకు నవమి నాడు
కత్తి కర్రల పోటీలు గలవు , విజయ
మందు వారికి తగు బహుమతులు గూడ
ఇచ్చు ముచ్చట జూచితి నిచట నేను .
26 .
దశరా యుత్సవము లనిన
దశ దిశలకు పేరు గాంచి తా కుల్లూరిన్
విశదంబుగ నేనుగుపై
ప్రశస్తముగ రామచంద్ర ప్రభు డూరేగున్ .
27 .
కుల్లూరి బలిజ వంశము
విల్లమ్ములు దాల్చి యుధ్ధ విద్యల నేర్చెన్ ,
బల్లేలు పటాకత్తులు
మొల్లమ్ముగ నింట నింట మూలుగు చుండెన్ .
28 .
దేశ మంతట ప్రతి యూర దేవి పూజ
మాకు మాత్ర మాయుధ పూజ శ్రీకరముగ
యుధ్ధ విద్యలు నేర్చన యూరు గనుక
నేటికిని దసరాకు రాణించు చుండు .
29 .
రామ లక్ష్మణులు మా రాచ బిడ్డలు ధను
ర్బాణాలు దాల్చి వీర్యమ్ము మెరయ
అష్టమి తిథియందు నరయ నల్లేనుంగు
నెక్కి యూరేగుదు రక్కజముగ
ఆనాటి యుభయ మహా ప్రదాత ఘనుడు
గంగాధరం గారు గాఢ భక్తి
జ్వాజ్వల్య మానమై జైకొట్ట జనములు
జరిపింతు రెలమి పూజ లొనరించి
30 .
రేయి రేయంత యును పగలే యనంగ
దీప కాంతులతో , భజంత్రీల - తప్పె
ట్ల ఘన రావము చెలంగ , రంగ రంగ
వైభవము లొప్ప నూరంత వరలు చుండు .
31 .
ఈరేడు లోకాల నేకపత్నీవ్రత
మొక్క రామునికిగా కొండులేదు
ఒక్కటే మాటగ నొక్కటే శరముగ
నొక్కరాముండుగా కొండులేరు
ధర్మంబు దప్పని ధరణీశు డిలలోన
నొక్కరాముండుగా కొండులేరు
రక్షించు విభులలో రాణకెక్కిన యతం
డొక్కరాముండుగా కొండులేరు
32 .
నామజపమాత్ర తరియింప నాశ్రయ మిడ
నొక్కరాముండు తప్ప వేరొండు లేరు
పల్లె పల్లెన గుడులలో భజనలంద
నొక్కరాముండు తప్ప వేరొండు లేరు .
33 .
రాముడేలిన రామరాజ్యమందంతట
నెల మూడు వానలు నిలిచి కురిసె
రాముడేలిన రామరాజ్యమందంతట
ధర్మంబు నాల్గు పాదాల నడిచె
రాముడేలిన రామరాజ్యమందంతట
ప్రకృతి సుభిక్షమై పరవశించె
రాముడేలిన రామరాజ్యమందంతట
ప్రజలలో సుఖ శాంతి పరిఢవిల్లె
34 .
నాడు రాముడే రక్షణ , నేడు “ రామ
నామ “ మా రాముకంటె కనంగ శత స
హస్ర మెక్కుడై నిల్చి , మహా మహిత ప్ర
భావ శీలమై రక్షించు భక్త జనుల .
35 .
శ్రీరామ పట్టాభి షేక చిత్తర్వుతో
యిళ్ళలో జేరెద రిచటి జనులు
తొలుదొల్త శ్రీరామతో మొదుల్ బెట్టక
యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
నిద్రకు జారుట నియతి యిచట
రామనామమ్ములు రంజిల్ల భజియించి
మంచాలు దిగుదురు మనుజులిచట
36 .
మరణ శయ్యను గూడ “ రామా “ యనుటను
మాట గోల్పోవు చున్నను మరువ రిచట
యిచటి జన జీవనమున మమేకమయ్యె
రామనామమ్ము శ్రీరామ రామ రామ .
37 .
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు గదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస
38 .
ములు కనంగను ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశులయి
తవిలి దుర్గాష్టమిని మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .
39 .
కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి .
40 .
శ్రీగణేశుని గుడిని ప్రసిధ్ధి గలుగ
లీల చెన్నప్పశెట్టి నిర్మించె , నిచట
ఊరి యువకులు కూడి మహోత్సవములు
జరుపు చున్నారు ప్రతియేట చవితి నాడు .
41 .
పేలి తిప్ప దిగువ వీరాంజ నేయులు
విగ్రహమ్ము బండ వెలసి యుండ
పరగ నాకు దెలిసి బహుకాల మందుండి
దేవళమ్ము వెలుగు దివ్య మగుచు .
42 .
నాదు చిన్న తనము నందొక యఙ్ఞమ్ము
జరిగె నిచట దైవ సన్నిధి కడ
మహిత హితము గలుగె మహనీయు లెందరో
వచ్చి వైభవమ్ము వచ్చె గుడికి .
43 .
కుల్లూరున్నత పాఠశాలకు తగన్ గూర్చంగ పూర్వోన్నతుల్
వెళ్లే వాడిని ఆంజనేయుడిని సేవించన్ పదోక్లాసు మా
పిల్లల్నెల్లర గొంచు పూజలకు పబ్లిక్ వ్రాయు మున్ముందు తా
నెల్లన్ జల్లగ జూచి పిల్లలను దీవించంగ నెంతేనియున్ .
44 .
చీర్ల శింగరయ్య శెట్టి డొనేషను
కట్టె , నతని పేర ఘనము గాగ
అప్పు డెపుడొ యిచట హైస్కూలు పెట్టిరి
చదువు లన్న నెంత చవులు ప్రజకు !
45 .
నెల్లూరికి దూరములో
కుల్లూరున స్కూలు బెట్టి కూడా యరువై
యేళ్లకు పైగా గడచెను
యెల్లర కిది చదువు జెప్పె నీ ప్రాంతములో .
46 .
నలభయ్యేడు స్వతంత్రము ,
నలభై తొమ్మిదిన స్కూలు నడిపించిరి పె
ద్దలు మా కుల్లూరున తా
వెలుగులు విరజిమ్ము చుండె విద్య గరపుచున్ .
47 .
తల్లీ ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ , నీవు నా
యుల్లంబందున నిల్చి , జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము , నీదు వాక్కునను సంప్రీతిన్ , జగన్మాతరో !
కుల్లూరున్నత పాఠశాల యన నీకుంగీర్తి చేకొందుమే .
48 .
నా డీ ప్రార్థన పద్యము
పాడితి మట , ప్రతి దినమ్ము పరవశమున , మా
పోడుములకు గురువులు పో
రాడిరి , కామయ్య గారు వ్రాసిరి దీనిన్ .
49 .
ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
మిచ్చి గురు స్థాన మెక్క జేసె
ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
విద్యా ప్రదాతయై వినుతి కెక్కె
50 .
నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
తల్లి సేవతో జన్మమ్ము ధన్య మయ్యె
51 .
నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లే తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించే తల్లి !
పరదేవతా ! మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు .
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
52 .
నెల్లూరు దాటి వచ్చిన
కుల్లూరే దిక్కు , చదువు కొనుటకు , చాలా
పల్లెలు , నెల్లూరు కడప
జిల్లా వాళ్ళిటకు వచ్చి చేరిరి చదువన్ .
53 .
వరద రాజులు నాయుడు వంటి వారు
చేరి హెడ్మాష్టరుగ పని చేసి రిచట ,
కోరి గంగాధరం లాంటి గొప్పవారు
చేరి చదివిరి ఘనులైరి తేరి చూడ .
54 .
ఎందరో ఘను లీ స్కూలు నందు జదివి
యున్నతిని బొంది రేనున్ను నుద్యమించి
కోరుకొని వచ్చి యభివృధ్ధి గూర్చి నాడ
కూడి గంగాధరం గారు తోడు నిలువ .
55 .
ఏడెకరాలస్థలమున
నాడొక బిల్డింగు గట్టినా , రది మిగులన్
పాడయ్యెను , రేకులు పగి
లాడాడ , రిపేర్లు చేసి తంతట , కోరన్ -
56 .
ఎనిమిది పక్కా రూముల
కనుమతి యిప్పించి నారు , కట్టిరి భవనాల్ ,
ఘనముగ గంగాధర్ గా
రనయము మా స్కూలటన్న యభిమానముతో .
57 .
కలదు బిల్డింగు ముందు వెన్కలను గ్రౌండు
కంప మొలిచి పాడయ్యె వెన్కాల గ్రౌండు
బాగు చేయించి నామిట్టి పనికి గూడ
పరగ గంగాధరం గారు పాటు పడిరి .
58 .
పది పరీక్ష జరుపు పబ్లికు సెంటరు
కోరి విన్నవించ పోరు సలిపి
కాంక్ష దీర్చి నారు గంగాధరం గారు
పాఠశాల గూర్చి ప్రణతు లిడుదు .
59 .
ఘాటైన కఠిన వైఖరి
పాటించితి నాడు , స్కూలు బాగు పడుటకై ,
నాటికి నాముందున్నది
దీటుగ మన స్కూలు ప్రగతి దీపించుటలే .
60 .
చెంచయ్య శెట్టి మా చిరకాల సర్పంచి
చల్ల చెన్నారెడ్డి సరి మునసుబు
అందె చెన్నప శెట్టి యరుదైన కామందు
బిస్సాటి రోశయ్య ప్రియ కరణము
మాదాసు సోదరుల్ మారాజు లన్నింట
యాదాల రోశయ్య యలఘు శెట్టి
కంబాల గురుమూర్తి ఘనుడైన వ్యాపారి
దువ్వూరి కిచ్చమ్మ దొడ్డ మనిషి
61 .
దర్శి చెంచురామయ్య భూధవుడు మిగుల
ఊరు వూరంత ధనికులే , వీరు గాక
నాడు పేరైన పెద్ద లెందరొ గలుగుట
చేత కుల్లూరు మిగుల ప్రఖ్యాతి గాంచె .
62 .
చదువుకు తన సర్వస్వము
వదులు కొనుట కైన సిధ్ధ పడె , వదాన్యుం
డది గరుడయ్యెకె చెల్లును
సదయుడు కాలేజి కొరకు సంపద లిచ్చెన్ .
63 .
హైస్కూలు కాలేజి కన్నియుం గూర్చెను
హాస్పిటల్ దెప్పించి హాయి గూర్చె
వీథి వీథికి రోడ్లు వేయించె గొప్పగా
పెన్న నీళ్ళిప్పించి ప్రియము గూర్చె
చెన్నకేశవ గుడి చెన్నొంద గట్టించె
పూజాధికముల విభూతి గూర్చె
అభయాంజనేయుని యరుదైన నలువది
యడుగుల విగ్రహం బరయ గూర్చె
64 .
నేడు మాయూరి కొక్కరే నేత , యంద
రకును , మాదాసు గంగాధరం హితుండు ,
కోరి తన యూరి యభివృధ్ధి కొరకె గాక ,
ప్రాంతమును గూడ యభివృధ్ధి బరచు చుండు .
65 .
వర్తకుల వీథిలో నొక భజన చౌక
యుండెడిది , దాని పైన మా యూరి వాళ్ళు
శిరిడి సాయికి గుడిగట్టి సేవజేసి
కొలుచు చున్నారు గొప్పగా తలచి తలచి .
66 .
సాయి బాబ గుడిని సత్యనారాయణ
పూని నిర్వహించి పూర్తి జేసె
ఖర్చు కొఱకు తిరిగి కాళ్ళరిగి పోయినా
జన్మ ధన్య మయ్యె చాల వరకు .
67 .
అమరా సుబ్బారావను
విమలాత్ముడు , బాబ భక్త వినుతుండు , కడున్
శ్రమకోర్చి , దిన దినమ్మును
కమనీయముగా నొనర్చు కైంకర్యములన్ .
68 .
సాయి మందిరాలు సమతకు నిలయాలు
కులము మతము లచట నిలువ రావు ,
మూర్తి పాద పద్మ ములు తాకి పులకించు
ఫలము పొంది రిచట భక్తులెల్ల .
69 .
సాయిని 'తన'వాడని 'ప్రతి
సాయి ప్రభుని గొల్చు వాడు ' సతతము తలచున్ ,
సాయియు 'ప్రతి భక్తుని' తన
చేయారగ 'దరికి' దీసి చెలువము జూపున్ .
70 .
సకల దేవతలను సాయి రూపున జూచి
భజన చేయు విథము ప్రబలె నిపుడు ,
సాయి మందిరాలు సకల దేవతలకు
పూజలందు క్షేత్ర ములయి వెలిగె .
71 .
మందిరాన వెలయు మహిమాన్వితామూర్తి
పాద పూజ చేసి పరవశించు
భాగ్య మిచట దొరుకు , భక్తుల కింకేమి
కావలయును ? శాంతి గన్న పిదప !
72 .
సాయి మాకు ప్రభువు - సన్మార్గ దర్శియై
మమ్ము నడిపి బ్రతుకు మనుపు చుండె ,
అండ నిలిచి పలికి అభయ హస్తమ్మిచ్చి
కష్ట కాలమందు కాయుచుండె .
73 .
వినుతి కెక్క గట్టె వెంకయ్య స్వామికి
గుడిని భక్త జనులు కొలిచి తలువ
నాగరాజుపల్లి నాగేశ్వరుడు పూని
పూర్వ జన్మ ఫలము పుణ్య ప్రదము .
74 .
ఏ మహితాత్ముని ధామమ్ము శాంతికి
చిరునామగా విలసిల్లు చుండు
ఏ మందిరము మహనీయమై తర తమ
భేదాలు లేక శోభిల్లు చుండు
ఏ మూర్తిని స్పృశించి యిరవొంద నానంద
పారవశ్యము వలను పడుచు నుండు
ఎచ్చోట దూరాలు , హెచ్చుబాటులు తగ్గి
అందరొక్కటి గాగ నలరు చుంద్రు
75 .
ఏ యనఘు దర్శనముచేత హాయి గలుగు ,
కోర్కెలీరేడు , కష్టాలు కోలుపడును
అతడె వెంకయ్యస్వామి , నా కతడె దిక్కు ,
గుండె గుడి లోన నిలిపి నే కొలుచు కొందు .
76 .
వేడుకగా విఘ్నేశ్వరు
నాగుడిలో నిల్పె , మా సుధాకరుడు , మహా
భాగుడు , స్తవనీయ యశో
సాగరుడును , తోట వంశ జలనిధి శశియున్ .
77 .
మరణించియును గూడ మనుజుల మధ్యలో
జీవించి యున్నట్టి చిర యశుండు
భయ మనే దెరుగని బంగారు నాయకుం
డుద్యోగ వర్గాల కున్న శక్తి
ప్రభుతను నిలదీసి పలు ఘన కార్యముల్
సాధించి పెట్టిన చతుర యుక్తి
యెన్ జీ వొ నేతృత్వ మిట్లుండ వలె నన్న
దృష్టికి మూర్తిత్వ తీరితండు
78 .
తోట వంశాన బుట్టిన దొడ్డ మనిషి
నాకు మేన మామ కొడుకు మాకు హితుడు
ఆప్తు డన్నింట తోడునీడైన వాడు
కామ్రెడు సుధాకర ప్రసాద్ ఘన యశుండు .
79 .
పోలేరమ్మకు ప్రక్కన
నాలో నొక గుడియు నుండె , నంకమ్మది , యే
కాలముదో , పాడయ్యెను ,
శ్రీలొలుకగ దాని గట్టె శేషయ్య కడున్ .
80 .
ఎగువ పాళె మందు భగవతి మహలక్ష్మి
కొలువు దీరె మహిమ గలుగు తల్లి
అచటి భక్తులెల్ల రామెకు కైంకర్య
మొనర జేయు చుంద్రు ఘనము గాగ .
81 .
చెరువుకు కోటకు మథ్యన
పరమ శివుని గుడి గలదు , శివార్చన పరు లా
వర రాజాన్వయు లెవరో
చిరకీర్తులు గట్టి రెపుడొ , శిథిలం బయ్యెన్ .
82 .
అదిగొ శివుని గుడిని యాదాల కృష్ణయ్య
పట్టు బట్టి మరల గట్టి నాడు
భక్త తతులు వచ్చి పరమేశు పూజలు
జరుగు చున్న వచట చాల ఘనము .
83 .
మా కుల్లూరు పురాధి దేవత సదా మాక్షేమ ముల్గోరుచున్
రాకాచంద్ర మనోఙ్ఞ ధీధితులతో రాజిల్లు పోలేరు తా
పోకార్చున్ కడ గండ్లు రోగములు , రేపున్ మాపు మా యూరికిన్
చేకూర్చున్ మహనీయ శోభనములన్ చెన్నొంద రక్షించుచున్ .
84 .
రేగి రక్కసిపిండు రెక్కలు తెగగొట్టి
కుత్తుకల్ మెలిద్రిప్పి కోయు చుండ
కుడిచేత ఖడ్గంపు కొననుండి కారుచు
నెత్తుటి ధారలు నెగడు చుండ
డాచేత మూకుడు సాచి రౌద్రమ్ముగా
రుధిరమ్ము వట్టి తా గ్రోలుచుండ
ఆపలేక శివుం డడ్డదిడ్డము దూరి
కాళ్ళ క్రిందుగ పడి కనలు చుండ
85 .
దుర్నిరీక్ష్య తేజోమూర్తి దురితదూర
దుర్గ మాయమ్మ కలదు ప్రాదుర్భవించి
మమ్ము కాపాడు చున్న మా మాతృమూర్తి
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .
86 .
భూమి తత్త్వాత్మిక పోలేరుతల్లికి
పసుపు కుంకుమ గంధ ప్రతతు లిడుదు
ఆకాశ తత్త్వాన నలరు మా యమ్మకు
నలరుల దండల నలర నిడుదు
వాయు తత్త్వాత్మికై వరలు మా
అగరు ధూపముతోడ హారతిడుదు
వహ్ని తత్త్వముతోడ వసియించు మాతకు
దేదీప్య సందీప్త దీప మిడుదు .
87 .
అమృత తత్త్వాన వెలుగు మా అమ్మవార్కి
ప్రీతి పొంగళ్లు బెట్టి నైవేద్య మిడుదు
సర్వ తత్త్వాత్మికై వెల్గు సకలజనని
కొనర తాంబూల తదితర ప్రణతు లిడుదు .
88 .
కొలిచెద నమ్మి నిరంతర
మలుపు సొలుపు దరికి రాని మక్కువ కలుగన్
కొలిచెద ననుగన్న మహో
జ్జ్వలిత పరంజ్యోతిని తనివారగ తల్లిన్ .
89 .
తలచెద లలితా మాతగ ,
తలచెద దుర్గాభవాని తల్లిగ , తగ నే
దలచెద పరమేశ్వరిగా
తలచెద మా యమ్మవార్ని తర తరములకున్ .
90 .
పసుపు కుంకుమల , సుగంధ పరిమళముల
నెల్ల వేళల మైపూత లుల్లసిల్ల ,
దీప ధూపాల తోడ సందీప్త యగుట
తలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .
91 .
రక్త సింధూర వర్ణంపు రామణీయ
క , లలిత , మనోఙ్ఞ రూపము , కనక ఖచిత
మణిమయ కిరీటమున , అమ్మ విభవమ్ము
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు
92 .
వేద విహిత విధి విధాన విరచిత శిఖి
శిఖల జ్వాజ్వల్యమాన రోచిషుల నడుమ
మహిత యాగాగ్ని గుండ సంభవ యగుటను
తలచి కుల్లూరు పోలేరుతల్లి గొలుతు .
93 .
నిలిచి బ్రంహ్మాండమంతయు నిండి యున్న
ముగురు తల్లుల శక్తికి మూల మీమె
ఎల్ల లోకములకు తల్లి యీమె యనుచు
తలచి కుల్లూరుపోలేరు తల్లి గొలుతు.
94 .
అమ్మను దర్శించు కొనుడు
అమ్మా యని చేతులెత్తి అమ్మకు మ్రొక్కుం
డమ్మ మనల రక్షించును
అమ్మగుడికి రండి పూజలందు చరించన్
95 .
జయ మంగళ వారంబున
దయగల ఈ తల్లి గొలువ దారిద్ర్యంబుల్
భయములు కష్టములును కడు
రయమున దొలగెడును , శుభము లాభము కలుగున్ .
96 .
సారించి చూడగా దూరాన కొండలు
ఆకసమ్ము కెగసి యవథి యిడగ
వాటి నానుకొనిన వనసీమలో చెట్లు
పచ్చందనమ్ములు పరచుకొనగ
అడవి హద్దున కంకివొడమిన సజ్జ
చేలు పిచ్చుక పిండు వ్రాలి తనర
చేని హద్దున నివసించు పోలేరమ్మ
తల్లి మాగ్రామంబు నెల్ల గావ
97 .
ప్రకృతి యొడిలోని భాగ్యాలు , పంట సిరులు
చదువు సంథ్యలు , నుద్యోగ సంవిథములు ,
కళలు - పోలేరు తల్లి సాకల్య రక్ష
ణ వలయమున - కుల్లూరు మాన్య యయి తనరు .
98 .
చదువులమ్మ మమ్ము చల్లగా దీవించె
సిరుల కొమ్మ మాకు చేరువయ్యె
సిరియు చదువులమ్మ జీవించి రీ యూరి
బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి .
99 .
కోట బలిజ లైరి కొలువులు వెలయించి
రాజసమ్ము నాడు రాజ్యమేలె
పేట బలిజ లైరి పేరైన వాణిజ్య
సరణి పూని మథ్య తరములందు .
100 .
ఒజ్జబంతులైరి ఊరు యూరంతయు
గురువు లనగ నాడు గౌరవమ్ము
ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు
పెద్ద చదువు లందు పేర్మి కలిమి .
101 .
తల్లి దయలు గలుగ కుల్లూరు బలిజలు
భాగ్యవంతు లెల్ల యోగ్యతలకు
చదువులందు సకల సంపద లందున
సాటి రారు మాకు సకల జనులు .
102 .
ఏ పట్టణ మే నగరము
యేపట్టున జూడ మేమె యేర్పడ ఘనమై
చూపట్టుదు మంతట మా
దీపపు వెలు గంతవట్టు దీపింపంగా .
103 .
ఎన్నో తరముల నుండియు
పన్నుగ మా పెద్దలంత పండిత కవులే ,
మున్నిట కావ్యములు వెలసి
యున్నవి కొన్నింటి దెల్పు దుదహృత మొనరన్
104 .
తోట నరసింహ దాసు చేతో ముదముగ
' రామ రామ ' శతకము నేర్పడగ జెప్పె
పిండ మాది జన్మాంతమై వెలయు కథన
మద్భుతమ్ముగ వెలయించె నందు బుధుడు
105 .
దరిమడుగు వంశ ధీనిధు
లిరువురు కవి సోదరులు రచించిరి కావ్యాల్
అరయన్ మల్లయ , కామయ
లరుదగు పండితులు బలిజ లందు ప్రముఖులున్
106 .
ప్రౌఢ కావ్యమ్ము ' భారవి ' , ' రాయ ' లనెడు
నాటకమ్మును కామయ్య , ఆటవెలది
జెలగు ' రామాయణమ్ము 'ను వెలయ జేసె
మల్లయ మనోహరముగ రామార్పణముగ
107 .
త్రవ్వి తీయంగ నింకనూ నివ్వటిల్లు
నిచటి బలిజ బుధ వరుల రచన లెన్నొ
అందు బుట్టిన నేనునూ అంది పుచ్చు
కొంటి కొంతగా నైన నా కోర్కె దీర .
108 .
బలిజను నేను , పుట్టువున పావని గంగకు తమ్ముడన్ , మహా
బలితలకెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుండ , స్వ
స్థలమది కుల్లురీ పురము , సంపదలందున విద్యలందు భూ
తలమున సాటిలేని ఘనతల్ గల యూరిని బుట్టితిన్ కడున్ .
109 .
కాపులలో విశిష్టతలు గల్గిన శూరుల జాతి మాది , మా
ప్రాపున ప్రాభవమ్మొడిసి పట్టెను రాయల రాజ్యలక్ష్మి , మా
చూపుల తీక్ష్ణతల్ దవిలి శోభలు గోల్పడె శత్రురాజ్యముల్ ,
భూపతులై తెలుంగు వర భూముల నేలిరి మాకులీనులున్ .
110 .
సదమల ప్రాకృతీ విభవ చైత్ర రమా రమణీయ శోభలన్
బొదివిన చెట్లు , కొండలును , పూర్ణజలాన్వితమైన చెర్వులున్ ,
నదియు , ననేక గుళ్ళు , విపినమ్ములు , స్వచ్చపు మానసమ్ములున్ ,
చదువులు , శౌర్యముల్ గదిసి చక్కని తల్లి మదీయ గ్రామమే .
111 .
చదివితి తెల్గు నాంగ్లమును సంస్కృతమున్నొక కొంత , యిష్టమై
మదికి లయించు నొజ్జదనమందున ముప్పది యెన్మిదేండ్లుగా
బ్రదికితి , లక్షలాదికి నవారిగ జీవన మార్గ సత్యముల్
విదిత మొనర్ఛి ధన్యతల వెల్గుల గాంచితి , నింత యేటికిన్ .
112 .
ఆస్తికుండనె గాని యసదు నించుకయేని
గ్రుడ్డిగా నమ్మిన గురుతు లేదు
దైవ నిందలు సేయ తలపు బారదుగాని
తాంత్రిక క్రతువులు తగులు పడవు
విశ్వంబు నియతమై విభ్రమించు నటుల
సత్య ధర్మ నియతి చాల ప్రియము
ద్వేషంబు మోసంబు వేషంబు లెరుగను
తప్పుడు పథములు తగవు మదికి
112 .
తామె గొప్పటంచు తగ విఱ్ఱవీగెడు
త్రాష్టు లన్న నాకు తగని మంట
ఒప్పు గాంచ లేక తప్పులే వెదికెడు
వెధవ లన్న పడదు బుధులలోన .
113 .
చరమ జీవితమ్ము పరమాత్మ సేవనా
నంద మగ్న సత్య సదమలముగ
గడిపి గొలగమూడి కరుణామయుడు స్వామి
వెంకయార్యు జేర వేడ్క గలదు .