21/02/2022
ఆకెళ్ళ వాణి
మన ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులైన శ్రీ అన్నపూర్ణయ్య గారికి ధన్యవాదాలు
"శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సహిత సప్త దేవాలయాలు - నర్సారావుపేట"
@@@
"శ్రీ చివుకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి గారు".
◆ 2014 లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజింపబడ్డాక ఆంధ్రా ప్రాంతంలో ఉన్న జ్ఞాన సరస్వతి త్రిశక్తి అమ్మవార్ల ఏకైక దేవాలయం, నరసరావు పేటకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉప్పలపాడు గ్రామంలో బైపాస్ రోడ్, శ్రీశైలం.. కర్నూలు... శ్రీశైలం... వినుకొండ వెళ్ళే మెయిన్ హైవేలో వుంది. ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం దూరదూర ప్రాంతాలనుండి వస్తూ వుంటారు.. అలాగే దశరా నవరాత్రులు మొదలగు పర్వదినాలలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది..
ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న సప్త దేవాలయలు.
1) జ్ఞాన సరస్వతి దేవాలయం: ఈ ఆలయంలో , జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. ప్రతి రోజు సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమలు జరుగుతాయి.
2) మహాకాళి ఆలయం: ఈ ఆలయంలో మహాకాళి మహాకాళేశ్వరులకు, ప్రతి ఆదివారం అభిషేకము, ప్రతి నెల మాస శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు, ప్రతి సోమవారం స్వామి వారికి అభిషేకాలు మొదలగునవి జరుగుతాయి..
3) మహాలక్ష్మీ ఆలయం : ఈ ఆలయంలో ప్రతి గురువారం నాడు అమ్మవారికి అభిషేకం మరియు ప్రతి శుక్రవారం నాడు శ్రీ చక్రానికి కుంకుమార్చన జరుపబడతాయి..
4) లక్ష్మి గణపతి ఆలయం : ఈ ఆలయంలో విఘ్నరాజైన ఆ గణపతికి ప్రతి బుధవారం నాడు అభిషేకం జరుపబడుతుంది..
5) శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం : ఈ ఆలయంలో ప్రతి ఆదివారం నాడు స్వామి వారి అభిషేకం జరుగును, ప్రతినెలా చవితి, పంచమి, షష్టి, సప్తమి, తిధులలో కుజ దోషం ఉన్న వారికి, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి విశేష పూజలు జరుగును.
6) శ్రీ మహావిష్ణు ఆలయం : ఈ ఆలయంలో
విష్ణుమూర్తి 11 అడుగుల ఏకశిల విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.. లోకరక్షకుడైన ఆ "శ్రీ మహావిష్ణువు కు, ప్రతి శనివారం నాడు మరియు ఏకాదశి తిధి నాడు, అలాగే శ్రవణా నక్షత్రమునందు అభిషేకాలు జరుపబడతాయి..
7) ఆంజనేయస్వామి : ఈ ఆలయంలో ప్రతి మంగళవారం స్వామి వారికి అభిషేకం మరియు ఆకుపూజలు జరుపబడతాయి..
దేవాలయంలో జరుగు విశేష కార్యక్రమలు:
1) గణపతి నవరాత్రులు
2) దేవి శరన్న నవరాత్రులు.
3 ) కార్తీక మాసం ఈశ్వరుని అభిషేకం. మహా శివరాత్రి పర్వదినం నాడు లింగొద్భవ ప్రత్యేక పూజలు జరుగును.
4) ధనుర్మాసం ప్రత్యేక పూజలు, ముక్కోటి ఏకాదశి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం, ఊరేగింపు జరుగును.
◆ ఈ ఆలయాల నిర్మాణం వెనుక "శ్రీ చివుకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి" గారి అత్యంత భక్తిశ్రద్ధలు, మొక్కవోని అకుంఠిత దీక్ష మరియు కఠోర శ్రమ దాగివున్నయి..
వారు 28 మార్చి 1963 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించారు..
◆ శ్రీ సిద్ధాంతి గారు 1996 లో అమ్మవారి దీక్ష తీసుకుని అనుష్టానం చేసుకుంటూ, ఆ భగవదనుగ్రహంతో తనకు అబ్బిన జ్యోతిష్య పరిజ్ఞానంతో తనదగ్గరకు వచ్చిన వారందరికీ ఉచితంగా జ్యోతిషము చెప్తూ, వారి సమస్యలను తీరుస్తూ ఉండేవారు.. వారు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం దర్శించడానికి వెళ్లినప్పుడు ఆయన గురువు గారు శ్రీ గొల్లపూడి భావనారాయణ రావు గారి దగ్గర పూర్ణ దీక్షా పరులుగా మంత్రోపదేశం స్వీకరించారు.
◆ "అన్నపూర్ణయ్య" గారు 2004లో తిరుచానూరు దేవాలయ సందర్శనకు వెళ్లి, అక్కడ అనుష్టానం చేసుకుంటూ కొన్ని రోజులు వుండగా ఒకరోజు అమ్మవారు, ఒక చిన్న అమ్మాయి రూపంలో కలలో సాక్షాత్కరించి నరసరావుపేటలో "జ్ఞాన సరస్వతి" ఆలయం కట్టమని ఆదేశించారట. ఆయన వెంటనే లేచి ఆ విషయాన్ని పక్కనే వున్న గురువుగారికి చెప్పగా గురువుగారు గుడి కట్టడం మాటలా అని అన్నారుట. అటు పిమ్మట ప్రతిరోజూ అమ్మవారు కలలో కనిపించి గుడి కట్టమని చెప్తూ వుండేవారట. ఒకరోజు ఆయన తనకు క్రమంతప్పకుండా వస్తున్న స్వప్నం గురించి కొంతమంది సన్నిహితులకి తెలియచేసి, నేను ఒక్కడినే గుడి కట్టలేను అని చెప్పగా వారంతా ఆలయం నిర్మించడం అనేది దైవ కార్యం, ఇటువంటి మంచి కార్యక్రమం దైవాజ్ఞ మరియు దైవ కృప లేనిదే సాధ్యం కాదు... సాక్షాత్తు అమ్మవారే కలలో సాక్షాత్కరించి ఆదేశించారు కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయమని, తామంత తమవంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి
ప్రోత్సహించారు.
◆ నర్సారావుపేట లో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగితే, అక్షరాభ్యాసాలు మొదలగునవి అక్కడే చేయవచ్చు అని కొంతమంది కాదనకుండా ధన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దాంతో 46 సెంట్ల భూసేకరణ జరిగి ఆ స్థలంలో 2004 అక్టోబర్ 19వ తారీఖునాడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మహాలక్ష్మి, మహాకాళీ, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలను కంచిలో చేయించి తీసుకుని వచ్చి , ఊరి పొలిమేర నుండి వైభవమైన ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో మంగళవాయిద్యాల నడుమ ప్రతిష్ఠించడం జరిగింది.. విగ్రహాల ప్రతిష్టలో ఎక్కడా కూడా ఇనుము వాడకుండా, ప్రతిష్ఠ చేయడం జరిగింది..
◆ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఒకనాడు విష్ణుమూర్తి కలలో కనిపించి తన గుడి కూడా అదే ప్రాంగణంలో కట్టమని ఆదేశించగా, తన దగ్గర అంత స్థోమత లేకపోవడంతో ఎలా కట్టాలా అని చింతిస్తూ, తన మితృలను , ఊరిలో వారిని సంప్రదించగా, ఒకాయన ముందుకు వచ్చి, విష్ణుమూర్తి విగ్రహ ఖర్చు తాను భరిస్తానని చెప్పడంతో, ఏకశిలపై అత్యంత సుందరంగా 11అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా తయారు చేయించి, ప్రతిష్ఠించడం జరిగింది.
◆ నర్సారావుపేట జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలోని మహాకాళీ మందిరంలో ,
ఆదిదంపతులైన మహాకాళీ అమ్మవారు, మహాకాళేశ్వరుడు ఇద్దరు కూడా ఒకే పానమట్టం మీద వుండడం విశేషం.
◆ "శ్రీ చివుకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి" గారు, అత్యంత భక్తిశ్రద్ధలతో, భారతదేశంలో వున్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్లనే ఆ సరస్వతి అమ్మవారు, ఆయనకి కలలో సాక్షాత్కరించి ఆయన ద్వారా, ఆలయ నిర్మాణం జరిపించారని ఇక్కడి భక్తుల నమ్మకం.. ఇక్కడ ఏడు రోజులకి ఏడు దేవాలయాలు, అన్ని వారాలకి సరిపడ దేవుళ్ళ ఆ ప్రాంగణంలోనే వున్నాయి. ఈ ఆలయంలో, నిరుటేడాది విజయదశమి రోజు దాదాపుగా 200 అక్షరాభ్యాసాలు జరిగాయట. పెండ్లి కాని వారికి పెళ్లి అవుతుంది అని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం.
యా కుందేందు తుషార హార ధవళ యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా పరదండ మండిత కరాయాశ్వేత పద్మాసనా |
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభ్రుతిర్ధేవైస్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ నిశ్శేష జాడ్యాపహా ||
సర్వేజనాః సుఖినోభవంతు..
🙏🙏🙏
◆ దుబాయ్ లో ఉంటూ భారతీయులకు ప్రత్యేకంగా తెలుగు వారికి ఎన్నో సేవలు అందిస్తూ తెలుగు వారి సంస్కృతి కి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా పేరుతెచ్చుకుని, నిత్యం అనేకానేక కార్యక్రమాల నిర్వహణలో తలమునకలుగా ఉంటూ కూడా వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఐ ఎస్ డి కాల్ ద్వారా శ్రీ అన్నపూర్ణయ్య గారిని ఫోన్లో సంప్రదించి పూర్తి వివరాలు అందచేసిన "శ్రీమతి లక్ష్మి కామేశ్వరి" Laxmi Kameswari గారికి ధన్యవాదాలు..
◆ దైవభక్తి పరాయణులు, నిస్వార్ధపరులు మరియు సేవాతత్పరులు అయిన "శ్రీ చివుకుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి" గారు Annapurnaiah Chivukula "ఆకెళ్ళ ఫౌండేషన్" Akella Foundation లో సభ్యులు అని తెలియచెప్పడానికి మాకెంతో సంతోషంగా మరియు గర్వంగా ఉంది..
Courtesy &
Special Thanks to Laxmi Kameswari garu and Ravi Kumar Akella garu