27/08/2025
వినాయక చవితి (వరసిద్ధి వినాయక వ్రతం) :
భాద్రపదమాసంలో నాలుగోరోజున వరసిద్ధి వినాయక వ్రతం చేసుకుంటాం. దానినే వినాయక చవితి లేదా చతుర్ధి అని పిలుస్తారు. దేవతలందరూ తమకు ఇష్టమైన తిథులలోనే అవతరిస్తుంటారు. ఆ తిథులలోనే వారికి పూజలు, వ్రతాలు, కల్యాణాలు జరుగుతాయి. అయితే వినాయకుడికి సంబంధించి చతుర్థి తిథి మహిమ గొప్పది. ఆ తిథి మహత్యాన్ని ముద్గల పురాణం వివరించింది.
వినాయక చవితి మన సంస్కృతికి ప్రతీక. ప్రతి ఇంటిలోనూ పసుపుతో, బంకమట్టితో వినాయకుణ్ణి రూపొందించి పూజిస్తారు. పళ్లూ కాయలతో పాలవెల్లిని తయారు చేస్తారు. దానికింద వినాయక ప్రతిమను ఏర్పాటు చేస్తారు. కొండంత దేవుడికి కొండంత పత్రి తేగలమా అనుకుంటూనే ప్రతి ఒక్కరూ యధాశక్తిగా పత్రి సేకరించి వినాయక పూజ నిర్వహిస్తారు. వినాయక చతుర్దినాడు పూజలందుకునే వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడని పిలుస్తారు. యుగయుగాలనాటి వినాయకుని గాథలను వరసిద్ధి వినాయక వ్రతంలో భాగంగా పఠిస్తారు, శ్రవణం చేస్తారు. దేశమంతటా వినాయకచవితిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ వరసిద్ధి వినాయక పూజావిధానాన్ని అందిస్తున్నాం. ఈ పుస్తకం సహాయంలో ఎవరైనా తమ ఇంటిలో వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి. ఎవరైనా ఒకరు చదువుతూ ఉంటే మిగిలిన అందరూ పూజలో పాల్గొంటే సరిపోతుంది.