14/11/2015
సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్ పండుగలను అధికారికంగా నిర్వహించినట్లే క్రైస్తవులు ఘనంగా జరుపుకునే క్రిస్‌మస్ వేడుకలను కూడా అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. క్రిస్‌మస్ పండుగను అధికారికంగా నిర్వహించే విషయంపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఒ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, మైనారిటీ సంక్షేమం కోసం వేసిన కమిటీ చైర్మన్ ఎ.కె.ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, డైరెక్టర్ అక్బర్, మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ యండి. షఫి ఉల్లా, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
క్రిస్‌మస్ వేడుకల సందర్బంగా రాష్ట్రంలోని దాదాపు రెండు లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిసెంబర్ 20న ఆదివారం జరిగే ప్రార్థనల సందర్బంగా క్రైస్తవులకు క్రిస్‌మస్ విందు భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని వంద చర్చిల పరిధిలో, రాష్ట్రంలోని ఇతర 95 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. మొత్తం 195 చోట్ల, ప్రతి దగ్గర 1000 మందికి చొప్పున పురుషులు, స్త్రీలకు దుస్తులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సీనియర్ ఐఎఎస్ అధికారి రేమండ్ పీటర్, క్రైస్తవ మత పెద్దలతో త్వరలోనే ఎ.కె.ఖాన్ సమన్వయంలో సమావేశం జరుగుతుంది.
మైనారిటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి 60 గురుకుల పాఠశాలలను తెరవాలని నిర్ణయించినందున ఈ నెల 20 లోగా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.