07/08/2022
ప్రభువు నందు ప్రియమైన సహోదర సహోదరీలందరికీ మన కొరకు సకల విధాలైన శోధనలను, లోకమును, సాతానును, సిలువపై ఘోర హింసలను, మరణమును, సమాధిని, శాస్త్రులు పరిసయులు సద్దూకయులు ప్రధాన యాజకుల కుట్రను, హేరోదు పిలాతు రోమా ప్రభుత్వ కఠిన కౄర కర్కశ యంత్రాంగాన్ని సమస్తాన్ని జయించి తిరిగి సజీవుడై పునరుత్థానుడై లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ ఔన్నత్య ప్రభావాలు గల నామమున శుభాభినందనములు.
ఈరోజు (07-08-2022 ఆదివారం) క్యాలెండర్ లో ప్రభువు మనకిచ్చిన తన మంచి వాగ్దానం కొద్ది సేపు మనం ధ్యానం చేద్దాం. మన హృదయ ధ్యానం, మన నోటి మాటలు, మన భక్తి శ్రద్ధలు, మన అనుదిన సేవ ప్రార్థనలు ఆరాధనలు మహిమాన్విత పరలోకపు తండ్రియైన దేవునికి ఒక నైవేద్యంగా ఇంపైన పరిమళ ధూప ద్రవ్యముల సువాసన భరితంగా, తన కంగీకారంగా ఉండును గాక!
"నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను",(యెహోషువ 24:15).
ప్రభువు నందు అత్యంత ప్రియులారా, లోకంలో ఉన్న ఎలాంటి ఎలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు, స్థానాలు, పదవులు, రాజరికాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి స్థానం వీటన్నింటినీ మించిన మహా గొప్పది, అసమానమైనది, పవిత్రమైనది, మహిమ గలది "దేవుని సేవ". ఇది దేవుడు మనకు ప్రేమతో దయచేసిన ఊహకందని మహా గొప్ప పరలోకపు భాగ్యం. దీని గొప్పదనం, ధన్యతనెరిగిన పరిశుద్ధులు
1).మోషే సమస్తాన్ని విడిచి పెట్టి దేవుని పిలుపునకు లోబడి దేవుని సేవకు వచ్చాడు. దేవుడు అతనిని ఎంతో అద్భుతంగా వాడుకొని ప్రచండమైన కార్యాలు జరిగించాడు.
2). యెహోషువ దేవుని పిలుపు మేరకు రాగా, దేవుడు అతనిని బహు విరివిగా విశేషంగా వాడు కొన్నాడు.
3). సమూయేలు చిన్న తనం నుండి దేవుని సేవ ఇష్టపూర్వకంగా, భక్తిగా, సంతోషంగా జరిగించాడు.
4). ఏలియా గొప్ప ఆసక్తితో దేవుని సేవ చేసి ప్రజలను దేవుని వైపునకు తిప్పాడు.
5). ఎలీషా ఎంతో గొప్ప భూస్వామియైయుండి కూడ దేవుని పిలుపునకు లోబడి సమస్తం విడిచిపెట్టి సంతోషంగా దేవుని సేవ చేశాడు.
6). ప్రవక్తలందరూ ఎన్నెన్నో శ్రమలకోర్చి, హింసలకోర్చి ఇష్టపూర్వకంగా భక్తిగా సేవ చేశారు(మత్తయి5:11,12).
7). యేసుక్రీస్తు వారి పిలుపు నందుకొని ఆయన శిష్యులు హత సాక్షులయ్యే వరకు ఇష్టపూర్వకంగా భక్తిగా సంతోషంగా నానా హింసలు శ్రమలుపొందుచు దేవుని సేవ చేశారు (ప్రకటన 12:11).