30/03/2023
రామ రాజ్యం
దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.
"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium). కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.