14/07/2026
🪷🪷🪷🌺❄️🙏❄️🌺🪷🪷🪷
*ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి*
~~~~~~~
*శ్రీ వారాహి నవరాత్రులు*
*15/07/2026 నుండి 23/07/2026 వరకు*
*ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్సరాం క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే*
*మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే "వారాహి నవరాత్రి" ఒకటి.*
*ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ నవరాత్రులలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటికే "గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి, వారాహి నవరాత్రి, శాకంబరి నవరాత్రి" అనే పేర్లు కూడా ఉన్నాయి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను "దండనాథ" అన్నారు.*
*అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల (నాగలి), ముసల (రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.* ఇది మహావారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు. అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది.
*పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం.*
ప్రకృతి పరంగా చూసినట్లైతే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.
*హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు*
☘ పంచమి
☘ దండనాథా
☘ సంకేతా
☘ సమయేశ్వరి
☘ సమయ సంకేతా
☘ వారాహి
☘ పోత్రిణి
☘ వార్తాళి
☘ శివా
☘ ఆజ్ఞా చక్రేశ్వరి
☘ అరిఘ్ని
*ఈ నవ రాత్రులు శాక్తేయం అనుసరణ లో ఉన్న అమ్మవారి ఆలయాల్లోను మరియు గురుముఖతః సప్తమాతృకా లేదా అష్ట మాతృకా మంత్ర విద్యలు స్వీకరించి అనుష్టించే వారు జరుపుకుంటారు. శరన్నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే అచారాలన్నీ దీనికి కూడా పాటిస్తారు.*
ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయాల్లో జరుపునే పూజలు వరుసగా......
*పాడ్యమి -* కలశ స్థాపన, శైలపుత్రి పూజ (తెలుగు రాష్ట్రాల్లో దుర్గా అవతారంలో)
*విదియ -* బ్రహ్మచారిణి పూజ (భద్రకాళి)
*తృతీయ -* చంద్రఘంట పూజ (జగదంబ)
*చతుర్థి -* కూష్మాండ పూజ (అన్నపూర్ణ)
*పంచమి -* స్కందమాత పూజ (సర్వమంగళ)
*షష్ఠి -* కాత్యాయని పూజ (భైరవి)
*సప్తమి -* కాళరాత్రి పూజ (చండి)
*అష్టమి -* మహాగౌరీ పూజ, సంధి పూజ (లలిత)
*నవమి -* సిద్ధిధాత్రి పూజ, నవరాత్రి పారణ (భవాని).
పై తొమ్మిదిరోజులు వారాహి నవరాత్రిగా జరుపుకుంటారు.
వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి / దండనాథ దేవి. ఈ అమ్మవారు వరాహ తను కలిగి ఉంటుంది.
ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన, నవావరణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు. దుర్గా సూక్తం, లలితా సహస్ర నామం, లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేస్తారు.
*గుప్త నవరాత్రి / గుహ్య నవరాత్రి *
వామాచార తాంత్రిక సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతికరణం, వశీకరణం, ఉఛ్ఛాటనం, స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు.
ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతం, దుర్గా సప్తశతి / దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భావిస్తారు.
*ఉగ్రవారాహీ అమ్మవారి దేవాలయం, వారణాసి*
కాశీలో ఉగ్రవారాహీ ప్రత్యేక దేవాలయం ఉన్నది. భూగృహంలో ఉన్న ఈ వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలోకి ప్రవేశం లేదు. ఉదయం 8 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీయరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. కేవలం అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.
*'రాత్రివేళల్లో పూజలందుకునే వారాహిదేవత'* మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరుపాలే
సప్తమాతృకలు.
1 బ్రాహ్మి
2 మహేశ్వరీ
3 కౌమారి
4 వైష్ణవి
5 వారాహి
6 ఇంద్రాణి
7 చాముండి.
కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా *నారసింహి* నీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా *వినాయకి* ని కూడా ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు.
* వరాహుని స్త్రీతత్వమే వారాహి'*
శ్రీ వరాహస్వామి వారి స్త్రీ తత్వముగా వారాహీ తల్లిని అధిక పురాణాలు పేర్కొన్నప్పటికీ, కొన్ని పురాణాలలో శ్రీ వరాహస్వామికి తల్లి గా ప్రకటితమవుతుంది. ఇవి మంత్రార్ధ రహస్యములుగా సాధకులు గ్రహించాలి. అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము. భారతీయ సనాతన ఆరాధనా పద్ధతులలో.. *నామ రూప గుణ తత్వ* వైభవములుగా ఆయా మంత్రాధి దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు. అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానాలలో మడి, ఆచారం, కట్టుబాట్లు, సమయం, ప్రత్యేక పూజలు, నివేదనలు, హోమాలు, తంత్రాలు, మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తుంది. అందుకనే విశ్వవేదిక పైన హిందూ ఆచార సంప్రదాయాలు తలమానికమై అలరారుతున్నాయి.
పూర్వం హిరాణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భులోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్రవారాహీ - 'కాశీ' వారాహిదేవి అమ్మవారి పాత్ర సుస్పష్టము.
వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ తల్లి వరాహముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశము, హలము, వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహానాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు.
*కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా!!* వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం.
ఈ ఆలయం వేళలు తెల్లవారుజామున 4:30 కు మాత్రమే దర్శనం ఉంటుంది కేవలం 3/4 గం మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు.
*ఎందుకని అనేగా మీ సందేహం!*
అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటలకు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం మాత్రమే కనిపిస్తుంది, రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం అవుతాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
*ఆరాధన*
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ *చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్ లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.
*సైన్యాధ్యక్షురాలు*
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.
*"తప్పక గమనించవలసిన అంశం"*
సప్తమాతృకలు లేదా అష్టమాతృకలు ఈ దేవతా మంత్రాల ఉపాసనకు తప్పనిసరిగా గురువు లభించాలి. వారి దిశానిర్దేశములోనే మూలమంత్రములైనా, స్తోత్రపాఠములైనా పఠించాలి. స్వతంత్రించి ఎవ్వరూ అనుసరించకూడదు. ఈ తల్లి శ్రీహరి లోని శక్తి అందుకని అందరూ ఈ తల్లిని వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు రాత్రి కాలంలో సదాచార విధముగా లక్ష్మీ పూజతో అర్చించాలి లక్ష్మీ స్తోత్ర పాఠములు పఠించాలి.
*"నివేదన"*
*పులిహోర, కట్టు పొంగలి తీపి పొంగలి క్షీరాన్నము దద్ధ్యోజనం* మొదలగునవి సమర్పిస్తూ...
విశేష ప్రత్యేక నివేదనలుగా వారాహీమాతకు లడ్డూలు, నల్లనువ్వులు-బెల్లం-యాలకులపొడి మిశ్రమం తో చేసిన లడ్డూలు లేదా నువ్వుల ఉండలు మరియు మామిడిపండ్లు, దానిమ్మపండ్లు నివేదించాలి.
దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని, అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం.
*ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ*
🌷 *శ్రీ మాత్రే నమః* 🌷
🌹 *శుభమస్తు* 🌹
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు* 🙏