12/08/2026
#శుభశ్రావణం
వర్షరుతువు తెచ్చే చిరుజల్లులతో, పచ్చదనంతో నిండిన ప్రకృతి పరవశిస్తుంటే... ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, ముంగిట పసుపు-కుంకుమల శోభలు, గుమ్మాలకు పచ్చని తోరణాలు, పూజ గదులలో వెలిగే దివ్యమైన ఆవునేతి దీపాల కాంతులు శ్రావణ మాస రాకను చాటిచెబుతాయి. ఈ మాసంలో వీచే గాలిలో కూడా ఒక దివ్యమైన పరిమళం, మంగళకరమైన భక్తి భావం, పవిత్రత నిండి ఉంటాయి. అలా శ్రావణ మాసం మన గృహాల్లోకి, మన హృదయాల్లోకి శాంతిసౌభాగ్యాలతో శుభప్రదంగా అడుగిడుతుంది.
🕉️ ఆధ్యాత్మిక చైతన్యానికి శ్రావణ శోభ
శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక అనుభూతుల సమాహారం. శివకేశవులిరువురితో పాటు మహాలక్ష్మికీ అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం, మన మనస్సులను లౌకిక విషయాల నుంచి దైవిక చింతన వైపు మళ్లించే ఒక పవిత్ర సమయం.
🌺 శ్రావణ సోమవారాలు: పరమశివునికి చేసే ఆవుపాల అభిషేకాలు, మారేడు దళాలతో పూజలు, హరహర మహాదేవ నామస్మరణలు ప్రతి హృదయాన్ని పావనం చేస్తాయి.
🌺 మంగళగౌరీ వ్రతం: శ్రావణ మంగళవారాల్లో కొత్తగా పెళ్లయిన వధువులు, సౌభాగ్యవతులు నిష్ఠతో ఆచరించే ఈ వ్రతం కుటుంబంలో ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను నింపుతుంది.
🌺 వరలక్ష్మీ వ్రతం: శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే ఈ వ్రతం ఇళ్లను సాక్షాత్తు వైకుంఠంగా మారుస్తుంది. శ్రీ మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆహ్వానించి, తొమ్మిది తోరాలను ధరించి ఆ తల్లి దివ్యానుగ్రహాన్ని పొందుతారు.
పండుగల సమాహారం: జంద్యాల పూర్ణిమ, తోడబుట్టినవారి ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్, అలాగే మాస చివరిలో వచ్చే జగద్గురువైన శ్రీకృష్ణుని జన్మదినం 'కృష్ణాష్టమి'... ఇలా ప్రతి రోజు ఒక ఉత్సవంలా, ప్రతి క్షణం భగవన్నామస్మరణతో ఆహ్లాదకరంగా సాగుతుంది.
🕉️ అనుబంధాల గుబాళింపు
శ్రావణ మాసం కేవలం పూజలకే పరిమితం కాదు. మానవ సంబంధాలను, సామాజిక ఐక్యతను పటిష్టం చేసే దివ్యమైన పండగ కాలం శ్రావణం. ఈ మాసంలో ప్రతి ఇల్లూ అతిథులతో, బంధుమిత్రులతో, కొత్త పెళ్ళికూతుళ్ళతో కళకళలాడుతుంది. ఒకరింటికి ఒకరు వెళ్లి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం, పేరంటాలు నిర్వహించడం, స్తోత్ర పారాయణలు చేయడం మన సనాతన సాంస్కృతిక వైభవానికి ప్రత్యక్ష నిదర్శనం.
రక్షాబంధన్ (రాఖీ) పండగ ద్వారా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఉన్న రక్షణ, ప్రేమానురాగాలు మరింత బలోపేతమవుతాయి. స్వార్థం, అసూయలను పక్కనబెట్టి, సమాజంలో ఆత్మీయతను, దానగుణాన్ని, సోదరభావాన్ని పెంపొందించడానికి ఈ మాసం ఎంతగానో తోడ్పడుతుంది. పండుగ పిండివంటలు, ప్రసాదాలు నలుగురితో పంచుకోవడం ద్వారా సమాజంలో సామరస్యం పెరుగుతుంది.
🕉️ ఆర్థిక పురోగతి
శ్రావణమాసం అంటే స్థానిక ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే ఒక బలమైన ఆర్థిక శక్తి. భారతదేశపు గ్రామీణ, పట్టణ ఆర్థిక రంగాలపై ఈ మాసం చూపించే ప్రభావం అపారమైనది.
ఈ మాసంలో పూలు, పండ్లు, పసుపు-కుంకుమలు, పూజా ద్రవ్యాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. మల్లెలు, చామంతులు, గులాబీలు, తామర వంటి అనేక రకాల పూలు, ఎన్నో రకాల పండ్లు పండించే రైతులకు, అమ్మే వీధి వ్యాపారులకు ఈ నెల మంచి ఆదాయాన్నందిస్తుంది. కొబ్బరికాయలు, తమలపాకులు, పూజా సామగ్రి అమ్మే చిన్నపాటి దుకాణదారుల కుటుంబాలకు శ్రావణ మాసం ఆర్థికంగా పెద్ద ఆసరాగా నిలుస్తుంది.
వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ నోములు, రక్షాబంధన్ సందర్భాలలోనే కాక, ఇది శుభ కార్యాల మాసం కూడా కావడంతో, అనేక సందర్భాలలో మహిళలు, పిల్లలు, పెద్దలు అంతా నూతన వస్త్రాలు ధరిస్తారు. పట్టుచీరలు, కాటన్ చీరలు తయారుచేసే ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి, మంగళగిరి వంటి చేనేత వస్త్ర రంగాలకు, వేలాది చేనేత కార్మికులకు శ్రావణ మాసం కోసం లభించే ఆర్డర్లు ఏడాది పొడవునా వారికి జీవనాధారమౌతాయి. షాపింగ్ మాల్స్ నుండి వీధి వ్యాపారుల వరకు వస్త్ర విక్రయాలు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి.
వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారికి బంగారు, వెండి వస్తువులను సమర్పించడం, కలశాలను వెండి రూపంలో పెట్టడం ఆచారం. బంగారం, వెండి నాణాలు, అమ్మవారి ముఖ ప్రతిమలు, వెండి దీపాలు, పూజా పాత్రల కొనుగోళ్లు పెరుగుతాయి. ఇది స్థానిక ఆభరణాల తయారీదారులకు పెద్ద యెత్తున ఉపాధి కల్పిస్తుంది.
🕉️ శ్రావణమాసం - ఆచారాలు
మన పూర్వీకులు ధర్మం పేరుతో నిర్ణయించిన ప్రతి ఆచారం వెనుక అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయ దృక్పథం దాగి ఉన్నాయి. శ్రావణ మాసం వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండే వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఆచారాలు ఎంతగానో అవసరం.
ఉపవాసం/సాత్వికాహారం – వర్షాకాలంలో సూరీడు మేఘాల్లో దాక్కోవడంతో తేమ ఎక్కువవడం వల్ల మానవ శరీరంలో జఠరాగ్ని (Digestive System) పనితీరు మందగిస్తుంది. ఆ సమయంలో జీర్ణ వ్యవస్థకు తగినంత విశ్రాంతి కల్పించే శాస్త్రీయ విధానం - ఉపవాసం, లేదా తేలికగా జీర్ణమయ్యే సాత్వికాహార (నూనెలు, కారం, మసాలాలు అధికంగా లేని ఆహారం) నియమం. వేల సంవత్సరాల నాటి మన ఈ నియమాన్నే ఆధునిక వైద్యశాస్త్రం ఇంటెర్మిట్టెంట్ ఫాస్టింగ్ అనీ, దాని వలన మానవ శరీరంలోని వ్యర్థ కణాలు తొలగిపోయే 'ఆటోఫాగీ' ప్రక్రియ వేగవంతమవుతుందనీ శలవిచ్చింది.
మాంసాహార నిషేధం – ఈ నియమం వెనుక బలమైన శాస్త్రీయ, పర్యావరణ కారణాలు ఉన్నాయి. వర్షాకాలం అనేక జంతువులు, పక్షులు, ముఖ్యంగా చేపలు మరియు నీటి జీవుల సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో వాటిని వేటాడకుండా ఉండటం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అంతే కాదు, వర్షాకాలంలో నీరు కలుషితమై జీవులలో క్రిమిసంక్రమణ ఎక్కువగా ఉంటుంది. అలాంటి మాంసాన్ని తింటే మానవులకు జీర్ణకోశ వ్యాధులు, కలరా వంటివి వచ్చే ప్రమాదం ఉన్నందున పూర్వీకులు ఈ సమయంలో మాంసాహారాన్ని నిషేధించే నియమాలు ఏర్పరిచారు.
పసుపు, కుంకుమల వాడకం – పసుపు గొప్ప యాంటీసెప్టిక్ మరియు యాంటీ-బ్యాక్టీరియల్ ఏజెంట్. వర్షాకాలంలో తలుపుల గుమ్మాలకు పసుపు రాయడం వల్ల హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాలు ఇంట్లోకి రాకుండా నిరోధించబడతాయి. కాళ్లకు పసుపు రాసుకోవడం వల్ల వర్షపు నీటి వల్ల వచ్చే 'కాళ్ల పగుళ్లు', 'ఫంగల్ ఇన్ఫెక్షన్లు' తగ్గుతాయి.
మామిడాకుల తోరణాలు – వర్షాకాలంలో గాలిలో తేమ పెరిగి ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. మామిడాకులు ఆరబెట్టినా కూడా ఎక్కువ సమయం ఆక్సిజన్‌ను విడుదల చేసే అరుదైన గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తాయి.
=======================================
🕉️ శ్రావణ జీవన విధానానికి ప్రతీ ఒక్కరూ చేయవలసిన దృఢ సంకల్పం
"ఓ పవిత్ర శ్రావణ మాసమా! నీ శుభ ఆగమన సమయాన, నీ సమక్షంలో నేను ఒక పవిత్రమైన సంకల్పం చేస్తున్నాను. ఈ మాసం అందించిన ఆధ్యాత్మిక చైతన్యాన్ని, నియమ నిష్ఠలను కేవలం ఈ ఒక్క నెలకే పరిమితం చేయకుండా, నా జీవితాంతం ఒక సాధనగా కొనసాగిస్తానని మాటిస్తున్నాను."
1. సాత్విక జీవనం: సూర్యోదయానికి ముందే మేల్కొనడం, శరీరం, మనస్సుల పవిత్రతను కాపాడుకోవడం, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడం వంటి శ్రావణ నియమాలను నా దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటాను.
2. వాక్ శుద్ధి, మనో శుద్ధి: ఎవరినీ మాటలతో గానీ, చేతలతో గానీ బాధించకుండా ప్రతినిత్యం సత్య-ధర్మం మార్గంలో నడుస్తాను. కోపం, అహంకారం, అసూయ వంటి వికారాలను వీడి ప్రశాంతంగా జీవిస్తాను.
3. సేవాభావం: సాటి మనుషులకు సహాయపడే గుణాన్ని, ఆపన్నులకు అండగా నిలిచే దానగుణాన్ని పెంపొందించుకుని, అదే నిజమైన దేవతార్చనగా త్రికరణశుద్ధిగా నమ్ముతాను.
4. ధర్మ రక్షణ: మన ఆచారాలను, సంస్కృతిని, కుటుంబ అనుబంధాలను ఆత్మీయతతో కాపాడుకుంటూ రాబోయే తరాలకు అందిస్తాను.
=======================================
ఈ శ్రావణ మాసం మనందరి జీవితాల్లో ఆరోగ్యం, ప్రశాంతత, ఐశ్వర్యం, ఆనందాలను ప్రసాదించాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని జగన్మాతను ప్రార్థిస్తూ... పవిత్ర శ్రావణ మాసానికి మరొకసారి సాదర ప్రణామాలతో శుభస్వాగతం!
శ్రీ మాత్రే నమః
— సాయి ప్రభాకర్, వేద విజ్ఞాన సమితి
#శ్రావణం
#శ్రావణమాసం
#సనాతనధర్మం