29/12/2017
భజ గోవిందమ్ ! భజ గోవిందమ్ !
3. నారీస్తనభర నాభీదేశం,
దృష్వ్టా మాగా మోహావేశమ్
ఏతన్మాంస వసాదివికారం,
మనసి విచిన్తయ వారం వారమ్.
భావం : స్త్రీల స్తనభారమును,నాభీ ప్రదేశమును చూసి మోహావేశం పొందకు. అవి మాంసంతో, వస ( క్రొవ్వు) తో వికారంగా ఉంటాయనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనస్సులో భావించుకో.
స్త్రీ సౌందర్యానికి ఆకర్షితుడైతే, మోక్ష సాధకుడు యోగభ్రష్టుడౌతాడని,అందువల్ల మనో వికారానికి గురి కారాదని శంకరులు ఈ శ్లోకంలో హెచ్చరిస్తున్నారు.
కాంతా కనకాలు ఆధ్యాత్మిక రంగంలో ఏకాగ్రతను భగ్నం చేస్తాయనే మాట అనుభవంలో ఉన్నదే. “ఈనాడు చాలామంది పొద్దు పొడిస్తే కాంచన కాంక్ష, పొద్దు గ్రుంకితే కామినీ కాంక్షగా జీవిస్తున్నా”రని భగవాన్ సత్యసాయి బాబా చెప్పారు. స్త్రీ వ్యామోహంతో విశ్వామిత్రాది మహర్షుల తపోనిష్ఠలు పంచబంగాళమయ్యాయి.
“ధనుర్దాసు” అనే వస్తాదు, తన భార్యయైన “హేమాంబ” నేత్రసౌందర్యానికి లోబడి, ఆ కళ్ళకు ఎక్కడ సూర్య రశ్మి సోకుతుందో! ఆ నేత్ర సౌందర్యం ఎక్కడ వాడిపోతుందో! అని భయపడుతూ ఉండేవాడు. ఆమెతో కలిసి తెల్లవారకుండానే శ్రీరంగంలో కావేరీనదికి స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా ఆమె కళ్ళమీద సూర్య కిరణం పడరాదని, ఆమెకు గొడుగు పట్టేవాడు! తనను చూసి ఎందరు పరిహసిస్తున్నా పట్టించుకునేవాడు కాదు. అతని ఏకాగ్రత అశాశ్వత సౌందర్యారాధనలో నిస్తేజమౌతోందని, దానిని శాశ్వత సౌందర్యారాధన వైపు మళ్ళిస్తే అతని జీవితం చరితార్థమౌతుందని భగవద్రామానుజులు భావించి ,అతనికి శ్రీరంగనాథస్వామివారి నేత్ర సౌందర్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ ఘట్టంతో ధనుర్దాసుకు నిత్యసౌందర్యం అంటే ఏమిటో అర్థమైంది. తదనంతర కాలంలో అతడు పరమ వైష్ణవుడయ్యాడు.
శరీరగతమైన అందం పరిణామశీలం కలది. ఒకప్పటి అందచందాలు, బిగువులు, విలాసాలు ఎప్పటికైనా వికృతాలవటం తథ్యం.అందుకే స్త్రీ బాహ్య సౌందర్యం పట్ల మోహావేశం తగదని శంకరులు హితవు చెప్తున్నారు. “యౌవనం తాలూకు అందాలన్నీ వార్ధక్యమనే అగ్నిలో దగ్ధమై బూడిదలా రాలుతున్నా” యన్నాడు ఒక సంస్కృత కవి.ఒక ముసలి అవ్వ వంగిన తన నడుమును పైకెత్త లేక భూమినే చూస్తూ నడుస్తోంది. ఒక ఆకతాయి ఆమె దగ్గరకు వెళ్ళి “అవ్వా! ఏమిటీ వెతుకుతున్నావు?” అంటే , “నాయనా ! నా యౌవనం అనే ముత్యం ఎక్కడో జారిపోయింది , దాన్ని వెతుకుతున్నాను” అందిట! ఇది ప్రాకృతిక సత్యం. దీనిని పదే పదే స్మరించుకుంటూ వ్యవహరించాలని భగవత్పాదుల సందేశం.
శ్రీ కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకంలో “చింతామణి” పాత్ర అందరికీ సుపరిచితం. ఆమె అందాన్ని వలగా వేసి, ఆమె తల్లి “శ్రీహరి” ఎందరో ధనవంతులను, ప్రాజ్ఞులను ఆకర్షించింది. అందరూ ఆమె అందానికి దాసానుదాసులయ్యారు. తమ ఆస్తులను అమ్ముకొని ఆమెకిచ్చి తాము నిర్ధనులయ్యారు. వారి భార్యలు ఎంతో క్షోభించారు.కథాంతంలో అంతటి సౌందర్యరాశీ, దేహసౌందర్యం పట్ల, తన వేశ్యావృత్తి పట్ల విరక్తయై -
“చమురు జిడ్డు మొగంబు చంద్రబింబంబంచు
పుసి కన్నులను దమ్మి పూవులనుచు
జీమిడి ముక్కు విచ్చిన నూవుఁ బూవంచు
వాలు చూపులు విరికోలలనుచు
చొల్లు పెదవి తేనె జొబ్బిలు గనియంచు
పాల తిత్తులు పూలబంతులనుచు
కంపుతొడ లనంటి కంబంబులంచును
చీడ పాదంబులు చివురు లనుచు
రక్త మాంస పురీష మూత్రముల పాత్ర
మేలిమి పసిండి బొమ్మంచు , మెరుపటంచు
నజ్ఞులగువారు మోహాంధు లగుచు దలతు
రంతియేగాక సౌందర్య మనగఁ గలదె?”
(చమురు పట్టి జిడ్డోడే ముఖాన్ని చంద్రబింబమనీ,పుసులు కట్టిన కళ్ళను తామరపువ్వులనీ, చీమిడి కారే ముక్కును నువ్వు పువ్వనీ,వాలు చూపుల్ని పూలబాణాలనీ,చొల్లుకారే పెదిమలను తేనెలూరే గనులనీ, పాల తిత్తులను (స్తనాలను) పూలచెండ్లనీ, కంపుకొట్టే తొడలను అరటి స్తంభాలనీ, చీడపట్టిన పాదాలను మెత్తని చిగుళ్ళనీ, రక్త మాంస మూత్రాదులతో నిండిన పాత్ర లాంటి దేహాన్ని బంగారు బొమ్మ అనీ - మోహంతో కళ్ళు మూసుకు పోయిన వాళ్ళు భావిస్తారే గానీ - శాశ్వత మైన అందమంటూ అసలెక్కడిది?) అంటుంది తన ప్రియుడైన బిల్వమంగళునితో.
ఒకప్పుడు వేశ్యలోలుడై యధేచ్ఛగా తిరుగుతున్న వేమనకు ఆయన వదిన గారు ఒక సందర్భంలో నగ్నంగా కనిపించిన సన్నివేశంతో ఆయనకు జ్ఞానోదయం అయింది. అంతవరకూ తాను తుచ్ఛ శారీరక సౌఖ్యాల కోసం వెంపరలాడాడని గ్రహించాడు. మోహాన్ని వదలి యోగి వేమన అయ్యాడు.
[భజ గోవిందమ్ ! భజ గోవిందమ్ !
4. నళినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్.
భావం : తామరాకు మీది జలబిందువు చంచలమైనది. అలాగే జీవితం కూడా మరింత చంచలమైనది. లోకమంతా వ్యాధులతో,దురభిమానంతో మ్రింగబడుతోంది.దుఃఖంతో ఆక్రమింపబడి ఉంది.
జీవితం అశాశ్వతం, అది ఎప్పుడైనా నశించిపోయేదే. లోకమంతా రోగాలతో, దురభిమానాలతో నిండి ఉంది, సర్వత్రా దుఃఖమే వ్యాపించి ఉంది - అని భగవత్పాదులు జీవితాన్ని, లోకాన్ని విశ్లేషిస్తున్నారు.
“నీటిబొట్టు, తామరాకు” అనే పదాలద్వారా భగవత్పాదులు జీవుల జన్మయాత్రను గూర్చి ప్రస్తావించారు. సరస్సు - పరమాత్మ! తామరాకు - సృష్టి! నీటిబొట్టు - జీవుడు! పరమాత్మ నుండి సృష్టిలోకి జీవుని ప్రవేశం సంభవిస్తుంది. “బిందువు” సరస్సులోనిదే - కానీ అది భిన్నమనిపిస్తుంది!
ఇది “పరమాత్మ,జీవాత్మ వేరు” అనుకోవటం వంటిది! నిజానికి రెండూ ఒకటే అనే అద్వైత తత్త్వం ఇక్కడ కనిపిస్తుంది.
మాయా ప్రభావంతో జీవి తాను పరమేశ్వరుడినే అనే విషయాన్ని విస్మరిస్తాడు. నీటి బిందువు మళ్ళీ సరస్సులో చేరుతుంది. జీవి పరమాత్మను చేరుతుంది.
జీవియొక్క జీవితం చాలా చంచలమైనది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్తున్నారు.
మరొక విధంగా ఆలోచిస్తే ,తామరాకుమీది నీటిబొట్టు - సూర్యకాంతితో తళతళ మెరిసిపోతూ, అది ఒక విలువైన మంచిముత్యమనిపిస్తుంది! తన అందానికి తానే మురిసిపోతూ అజ్ఞానంతో అహంకరిస్తుంది. సూర్యతేజం మరింత పెరిగితే , ఆ వేడికి అది వెంటనే ఆవిరై రూపుమాసిపోతుంది!
దీనిని మానవ జీవితానికి చక్కగా అన్వయించవచ్చు. మానవుడు కూడా తాను ధనవంతుడిననో, అందగాడిననో , పెద్ద అధికారిననో, గొప్ప విద్వాంసుడిననో - అనేక కారణాలతో అహంకరిస్తూ ఉంటాడు. కానీ, ఇవన్నీ అశాశ్వతాలని గ్రహించడు. సర్వమూ దైవాధీనమనే సత్యాన్ని మరచి విఱ్ఱవీగి, అంతా తన గొప్పతనమే అనుకొని, ఒక దశలో తప్పకుండా పశ్చాత్తప్తుడౌతాడు.
“జంతూనాం నరజన్మ దుర్లభమ్” అన్నారు కదా! ఇక్కడ జీవితం యొక్క ఉత్కృష్టతను, అల్పకాలికతను కూడా స్ఫురింపజేసి ధర్మాచరణకు ప్రోత్సహిస్తున్నారు శంకరులు.
“క్షణం చిత్తం, క్షణం విత్తం క్షణం జీవిత మావయోః
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః”
మన మనస్సులోని సంకల్పాలు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి, ధనమా - అది మరింత చంచలమైనది! ఆయుర్దాయం ముగిసిపోతోంది! యముడు నిర్దయుడు! ఆయుష్షును పెంచడు!అందుకే చేయదలచిన, చేయవలసిన ధర్మాన్ని త్వరగా ఆచరించాలి - అనే ఆత్మీయమైన సూచన ఈ శ్లోకంలో ఉంది.
లోకమంతా వ్యాధులతో, దురభిమానాలతో, విచారంతో నిండి తల్లడిల్లుతోందనే మాట కూడా శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. వ్యాధులు రావటానికి కారణం కొంత మన స్వయంకృతాపరాధం కాగా, గత జన్మలలో చేసిన పాపం కొంత.(“పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే”)
వీటిలో శారీరక వ్యాధులు కొన్ని, అజ్ఞానాహంకార జనితాతైన రోగాలు కొన్ని. అసలు సంసారమే ఒక వ్యాధి. అందుకే దానిని “భవరోగం” అంటారు.వ్యాధి ఎలా సంక్రమించినా ,అది మనోవైకల్యాన్ని కలిగిస్తుంది. అనారోగ్యం దైవసాధనపై దృష్టిని కేంద్రీకరించనీయదు. యుక్తాహార విహారాలతో వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు.
కానీ జిహ్వా చాపల్యంతో తినరానివి తినటం, త్రాగరానివి త్రాగటంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధకుడు మితాహారం తీసుకోవాలి. భగవత్పాదులు సాధన పంచకంలో “క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం” అన్నారు.ఆకలి అనే రోగానికి భిక్షాన్నమనే ఔషధంతో చికిత్స చేసుకోవాలట!
“రోజులో ఒకసారి తిన్నవాడు యోగి, రెండుసార్లు తింటే భోగి, మూడుసార్లు తింటే రోగి” అనే అనుభవ వాక్యం ప్రచారంలో ఉంది.
దురభిమానాన్నే గర్వం, అహంకారం అనికూడా అంటారు. ఇది వ్యక్తిత్వానికి చేటు తెస్తుంది. అందరి కంటే నేను అధికుడను అనుకోవటంతో ఆగక, మిగిలినవారు అల్పులు అనుకోవటం ఆ గర్వానికి పరాకాష్ఠ! గర్వం జ్ఞానాన్ని మరుగున పడవేస్తుంది. కన్ను, మిన్ను కానని అహంకారం ఏదో ఒక క్షణంలో భారీ మూల్యమే చెల్లించుకుంటుంది!
ఇక , లోకంలో శోకం సర్వత్రా వ్యాపించి ఉంది.అసలు మానవులు ఏడుస్తూనే జన్మిస్తారు. ఆ తరువాత, అజ్ఞానం, అత్యాశలతో అనుక్షణం శోకిస్తూనే ఉంటారు. తాము చిదానంద స్వరూపులమనే ఎరుక వారికి ఉండదు.
“ఏడ్చుచుండు అనునిత్యము నరుడు, నవ్వెడివాడే నారాయణుడు” అన్నారు సత్యసాయిబాబా.
శోకింప కూడని తావులలో శోకించకూడదని భగవద్గీతా సందేశం.
“నాయనా! ఈ జీవితం అశాశ్వతం, నువ్వు జీవిస్తున్న ఈ లోకం వ్యాధులతో, అహంకారంతో, అంతులేని శోకంతో నిండి ఉంది.అందువల్ల అప్రమత్తుడవై ఉండు. గోవిందుణ్ణి సేవించు.సంసార సాగరాన్ని తరించు” అని పరమదయా స్వరూపులైన శంకరులు ఈ శ్లోకంలో ప్రవచించారు.