16/06/2022
_*అయ్యప్ప నమస్కార శ్లోకములు - 44 వాటి అర్ధ వివరణ*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
_*1. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం |*_
_*పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం ||*_
*తా : లోకైక వీరులు మహాత్ములచే పూజలందు కొనువారు , సకల లోకములను సర్వవేళలా రక్షించువారు , కోరిన వారికి కోరినంత వరములను ప్రసాదించే ప్రభువు పార్వతిదేవి ప్రేమకు సంపూర్ణ పాత్రులు ధర్మాన్ని శాసించి నేర్పించువారు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*2. విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభో ప్రియం సుతం |*_
_*క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం ||*_
*తా : విప్రులు అనగా మిక్కిలి శ్రేష్ఠులైన బ్రహ్మణోత్తములు. అట్టి విప్రులచే పూజింపబడు వారు , ఈ విశ్వమంత కొలిచేటి వారు , విష్ణు శివుల ప్రియ సుతుడు , ఎల్లవేళలా తనను శరణు వేడిన వారిని వెంటనే అనుగ్రహించి పాలించువారు అయిన " శ్రీ ధర్మశాస్తా" వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*3. మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం |*_
_*సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం ||*_
*తా : మదమెక్కిన ఏనుగు వంటి గంభీరనడక గలవారు భక్తులపై ప్రేమ కురిపించు వారు , తనను వేడుకొనిన వారికి ఎదురగు సర్వ విఘ్నములను తృటిలో తొలగించు వారు , సర్వదేవతా స్వరూపులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*4. అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం |*_
_*అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం ||*_
*తా : మన కులదైవమై మనలను సదా కాపాడు ఈశ్వరుడు మనలో యుండెటి కామ క్రోధాదులనబడు ఆరు శత్రువులను లేకుండా చేసి , మనలను పునీతులుగావించగల మన ఇష్టా ఇష్టములను తెలుసుకొని కొరవడిలేక వరములను కురిపించు వారు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*5. పాండ్యేశవంశ తిలకం భారతీ కేళి విగ్రహం |*_
_*ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం ||*_
*తా : పాండ్య వంశమునకు తిలకము వంటి వారు , కేరళ దేశమున పసిబాలుడై వెలసి ఎన్నో లీలా వినోదములను చూపించి , అచ్చటి వారికి ఆనందమును కల్గించినవారు , ఆపదలో చిక్కుకొని అలమటించే భక్తులను కాపాడుటలో సాటిలేనివారు , దేవాది దేవుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను*
_*6. పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |*_
_*యస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ||*_
*తా : శాస్తా పంచరత్న స్తోత్రమను పేరుగల ఈ శ్లోకములను శుద్ధుడై నిత్యము పఠించు మానవునికి అయ్యప్ప దేవుడు ప్రసన్నుడై , వాని మనస్సున సదా నివశించును.*
_*7. త్రియంబక పూరాదీశం గణాధిప సమన్వితం |*_ _*గజారూడ మహం వందే శాస్తరం కుల దైవతం ||*_
*తా : త్రయంబక పురమనబడు దివ్య స్థానమునకు అధిపతియగు , గణాధిపుడైన గణపతితో సమముగా కైలాసమునందుండు వారు , ఏనుగు మీదెక్కి వచ్చి భక్తుల కోర్కెలను తీర్చే వారు , మన కులదైవ సమానులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*8. యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః |*_
_*త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం ||*_
*తా : లోకులకు అమృతమును పంచిపెట్టిన అపర ధన్వంత్రియగు మహావిష్ణువును తల్లిగాను , వైద్యుల కెల్ల వైద్యనాథుడైన పరమేశ్వరుని తండ్రిగాను , పొందిన మహా వైద్యోశ్వరులు , దయానిధియు అయినట్టి " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*9. అరుణోదయ సంకాశం నీలకుండల ధారిణం |*_
_*నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మ నందనం ||*_
*తా : అరుణోదయ కాంతిలా మెరుస్తుండు వారు , కర్ణములందు నీలి రత్నం పొదిగిన కుండలములను ధరించి యుండు వారు , నీలి వస్త్రములను ధరించు వారు , పరబ్రహ్మమయమైన వారు , బ్రహ్మపుత్రుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*10. చాప బాణం వామహాస్తే రౌభ్య వేత్రం చ దక్షిణే |*_
_*విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం ||*_
*తా : ధర్మహీనులను శాసించు వాడను నేనే అనునట్లు తన కుడి హస్తములో విల్లంబు దాల్చి , ఎడ మకర మందు వెండి దండమును పెట్టుకొని ధగ ధగ మెరిసే మేలుజాతి వజ్రములు పొదిగిన కుండలములు తదితర ఆభరణములు ధరించి ప్రశోభిల్లు వారు , శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియసుతులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను*
_*11. వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం |*_
_*వీరపట్టధరం ఘోరం వందేహం శంభు నందనం ||*_
*తా : శత్రువులపై నన్ను కోపము వలన ఎరుపెక్కిన నయనములతో వార్లను హతమార్చుటకు బెబ్బులి మీద అమరియుండు వారు , పట్ట బంధం కట్టి రత్నహారములనే కవచములుగా దాల్చి దుష్ట సంహారమొనర్చు వీరాధి వీరులు , పరమ శివుని ప్రియ సుతులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*12. కింకిణోద్యాణ భూతేశం పూర్ణచంద్ర నిభాననం |*_
_*కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం ||*_
*తా : కింకిణి కిణికిణి యని శబ్దంచేసే చిన్ని చిన్ని గజ్జలు తొడిగిన మేఘాలను నడుమ ధరించి యుండువారు , పూర్ణ చంద్రుని కాంతిని పోలిన ముఖవర్ఛస్సు గలవారు , అతి భయంకరమైన అడవి వీరుని రూపమున నడయాడు వారు పాండ్యవంశీయులను ఉద్ధరించుట కొరకై వారి ఇష్టపుత్రుడై యుండి వారిని పావనులు గావించిన వారు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*13. భూత భేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసనం |*_
_*మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం ||*_
*తా : భూత భేతాలు ఎల్లప్పుడు నమస్కరించుచుండు పాదములు గలవారు కాంతమల శిఖరాన యుండు స్వర్ణమందిరములో నివసించువారు , మణికంఠుడు అనిలోకులచే సుప్రసిద్ధముగా కొనియాడబడేవారు , పరాశక్తికి మిక్కిలి ఇష్టమైన పుత్రుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*14. శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం |*_
_*శబరీ గిర్రిశ్వరం దేవం నమామి భూతనాయకం ||*_
*తా : దేవా ! శ్రీహరి పుత్రుడవు , హరిహారాత్ముల సంజాతుడువు , శబరీ శిఖిరాన వెలుగొందు సర్వ భూతాదిపా ! శరణం శరణం.*
_*15. జగత్ ప్రియం జగన్నాథం జగదానంద దాయకం |*_
_*జగదీశం కృపా పూర్ణం నమామి మోహనీ సుతం ||*_
*తా : లోకమునకు ప్రియము గూర్చువాడును , జగత్తునకు ప్రభువును , సర్వ లోకములకు ఆనందము కలిగించువాడును , జగదీశ్వరుడును , కృపాగుణముచే నిండినవాడును , మోహిని కుమారుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*16. భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం |*_
_*పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం ||*_
*తా : సకల భూతనాధుడును , తారక బ్రహ్మస్వరూపుడును , గిరీశుడును , పార్వతినందనుడును , పరమేశ్వర పుత్రుడును , సర్వపాపములను నాశనముచేయువాడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*17. జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం |*_
_*వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం ||*_
*తా : జనార్ధనకుమారుడును , ఆటవిక వేషము ధరించినవాడును , మనోహరుడును , అరణ్య నివాసమునందు ప్రేమగలవాడును , జగన్నాధుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*18. పాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం |*_
_*బాలరూపం లోకనాధం నమామి శభరీశ్వరం ||*_
*తా : ముక్కంటి కొడుకును , కలిదోషమూలను నాశనము చేయువాడును , బాలరూపమున నుండువాడును , లోకనాయకుడును , శబరిగిరీశ్వరుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*19. ఓంకార మూర్తి మార్తిగ్నం దేవం హరిహరాత్మజం |*_
_*శబరి పీఠ నిలయం శాస్తారం ప్రణతోస్మ్యహం ॥*_
*తా : ఓంకార మంత్రార్థ స్వరూపులైన వారు , తనను అర్థించే వారి కష్టములన్నిటిని తొలగించి కాపాడే కరుణా సాగరులు, లోకములో ధర్మాన్ని నెలకొలుపుటకు , హరిహరుల అభేధమును ఋజువు చేయుటకు హరిహరపుత్రులై ఆవిర్భవించిన వారు , శబరిగిరిని తన ప్రధాన నిలయమై గొనిన వారు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించు చున్నాను.*
*_20. నక్షత్ర నాద వదనం నాథం త్రిభువనాత్మకం ।_*
*_నమితాశేష భువనం శాస్తారం నౌమి పావనం ॥_*
*తా : తారల మధ్య ప్రశోబిల్లు పున్నమి చంద్రునివలే అందమైన ముఖముగల వారు , త్రిభువనములకు నాథుడైన వారు , ఈ రేడు పదునాల్గు భువనములోని జీవరాసులచే ఆరాధించబడేటి వారు , మహా పవిత్రమూర్తియు అయినట్టి శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించుచున్నాను.*
*_21. మన్మథాయుధ సౌందర్యం మహాభూత నిశ్శేవితం |_*
*_మృగయా రసికం శూరం శాస్తారం ప్రణతోస్మ్యహం ॥_*
*తా : మన్మథుని బాణములో యుండు తామర పూవు అశోకపుష్పం , మామిడిపూవు , మల్లి , నీలోత్పలం మున్నగు ఐదు దేవతా పుష్పముల ఛాయవంటి దేహకాంతి గలవారు , కైలాస మందుండు ప్రమద గణములు మొదలు సర్వగణములచే విధిగా ఆరాధించ బడువారు , వేటాడుటలో మిక్కిలి మక్కువ గలవారు , భువిలోనే అజేయులు వీరులు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించుచున్నాను.*
*_22. శివప్రదాయినం భక్త దైవతం పాండ్య బాలకం |_*
*_శూర్దూల దుఃఖ హర్తారం శాస్తారం ప్రణదోస్మ్యహం ॥_*
*తా : సర్వ మంగళములను సమకూర్చియిచ్చు వారును , సర్వదా భక్తులచేత ఆరాధింపబడు పరబ్రహ్మస్వరూపులు కారణకార్యర్థమై పాండ్యబాలుడు ఆవిర్భవించి లీలా వినోదములు సలిపిన వారు , ఘోర వ్యాఘ్రములకు సైతం దుఃఖములను పోగొట్టువారు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించు చున్నాను.*
*_23. వారణేంద్ర సమారూఢం విశ్వ త్రాణ పరాయణం |_* *_వేద్రోద్భాసిత కరాంభోజం శాస్తారం ప్రణదోస్మ్యహం ॥_*
*తా : ఇంద్రుని వాహనమగు ఐరావతమునకు సమమైన ఏనుగుపై ఎక్కి కూర్చిని యుండు వారు , విశ్వమంతయు తన కరుణా విలాసములచే పాలించి ఆనందించు వారు , సకల వేదశాస్త్రమంత్ర , తంత్ర గ్రంథములను కరకమలము నందు దాల్చి సంతసించు వారు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*24. యక్షిణ్యైయభిమితం పూర్ణా పుష్కలా పరిసేవితం ।*_
*_క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణతోస్మ్యహం ॥_*
*తా: మంత్రశక్తితో పలు అరుదైన పనులను సాధించే యక్షిణులకు అత్యంత ప్రతిపాత్రులు , సదా తనను సేవించు పూర్ణా పుష్కళా యను ఇరువురు దేవియర్లు ప్రేమ పాత్రులు , కళ్యాణ రూపుడైయున్నతను ఆరాధించి మ్రోక్కులు తీర్చేవారందరి కోర్కెలను కొరవడిలేక కోరుకున్న క్షణమే ప్రసాదించి ఆనంద పరచు వారు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*25. శివవీర్య సముద్ భూతం , శ్రీనివాస తనూద్భవం |*_
_*శిఖివాహనుజం వందే శాస్తారం కులదైవతం ॥*_
*తా : శివుని వీర్యముతో ఉద్భవించిన వారు , శ్రీనివాసుని తనువునుండి ఆవిర్భవించిన వారు , కుమార స్వామి యొక్క ప్రియ సోదరులు , మహమ్మారి వంటి మహా రోగములను గూడా మాపిజేయగలవారు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*26. రత్నాభం సుప్రసన్నం శశిధర మకుటం రత్న భూషాభిరాం ।*_
_*శూలం కేటం కపాలం శరముశలధనుర్ బాహుదండే దానం ॥*_
*తా : రత్నప్రభలతో మెరయువాడు , చంద్రని మకుటము నందు ధరించినవాడు. రత్నాభరణములను ధరించినవాడు. ముంగాళ్ళ వరకూ చాచబడినటువంటి (ఆజానుబాహుడు) చేతులందు శూలము , డాలు , కపాలము , విల్లంబులు , ఢమరుకమును ధరించినవాడు. అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించుచున్నాను.*
_*27. మత్తేభారూఢ మాధ్యం హరిహరతనయం కోమళాంగం దాయస్యం |*_ _*విశ్వేశం భక్తపాలం నతజన వరదం గ్రామబాలం నమామి ॥*_
*తా : మదపుటేనుగును అధిరోహించియుండువాడు. సున్నితముగా నుండు అంగములను కలిగినవాడు. దయాపరుడు. ప్రపంచమునకు ఈశ్వరుని వంటివాడు. భక్తులను సదా కాపాడువాడు , భక్తులకు వరములను ప్రసాదించువాడు. గ్రామ పాలకుడు అయిన హరిహర తనయునికి ప్రథమ నమస్కారము చేయుచున్నాను.*
_*28. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।*_
*_తస్మాత్ కారుణ్య భావేన రక్షః రక్షః మహేశ్వరః ॥_*
*తా : మహేశ్వరా ! నీవు తప్ప మాకు వేరు గతి లేదు. నీవే శరణము. కాబట్టి మమ్ము కరుణతో కాపాడుము.*
_*29. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।*_
*_తస్మాత్ కారుణ్య భావేన రక్షః రక్షః జనార్ధన ॥_*
*తా : వైకుంఠనాథా ! నీవు తప్ప మాకు వేరు గతి లేదు. నీవే శరణము. కాబట్టి కరుణతో మమ్ము కాపాడుము.*
*_30. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।_*
*_తస్మాత్ కారుణ్య భావేన రక్షమాం శబరీశ్వర ॥_*
*తా : శబరీశ్వరా ! (శ్రీ ధర్మశాస్తా) నీవు తప్ప మాకు వేరు గతి లేదు. కరుణతో మమ్ము కాపాడుము.*
_*31. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా ।*_
_*దానోహమితిమాం మత్వా క్షమస్వ శబరీశ్వర ॥*_
*తా : శబరీశ్వరా (శీ ధర్మశాస్తా) నీ దాసులమైన మేము చేసిన పూజలందు తప్పులున్నచో మన్నించి , కరుణతో మమ్ము అనుగ్రహించి కాపాడుము.*
_*32. ద్వి హస్తం పద్మ సంస్తంశ శుక్ల యజ్ఞోపవీతినం |*_ _*పూర్ణ పుష్కలా సంయుక్తం శాస్తారం ప్రణమామ్యహం ॥*_
*తా : రెండు చేతులను కలవాడవు , పద్మాసనమున అమరియుండు వాడవు , తెల్లని జంధ్యమును ధరించిన వాడవు. శ్రీ పూర్ణా పుష్కలా సమేతుడవు అయిన శ్రీ ధర్మశాస్తా వారిని నమస్కరించుచున్నాను.*
_*33. సాస్తారం సర్వ భూదేశం శివభక్తం శివాత్మజం|*_
_*స్తుత్వా తత్పలమవాప్నోతి సత్యమేతత్ కలౌయుగే ॥*_
*తా : సకల జీవ రాశులకూ ఈశుని వంటి వాడవు. శివభక్తుడవు , శివ పుత్రుడవు అయిన శ్రీ ధర్మశాస్తా నిన్ను పూజించుట వలన సకల వాంఛితార్థములు నెరవేరగలవు. ఇది తధ్యము.*
_*34. సాక్షాతు విష్ణు స్వయం మాతా పితా యస్య మహేశ్వరంః ।*_ *_తం వందే సర్వ భూతేశం శాస్తారం కరుణానిధిం ॥_*
*తా : సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును తల్లిగానూ , మహేశ్వరుని తండ్రి గానూ , కలవాడవు. సర్వ భూత గణములకూ ఈశుని వంటి వాడవు. కరుణానిధివి అయిన శ్రీధర్మశాస్తా వారిని నమస్కరించుచున్నాను.*
_*35. మహా శాస్తాయ దేవాయ నిత్యాయ నిధనాత్మనే |*_
*_సమస్త లోక నాథాయ నాథాయ ప్రభవే నమః ॥_*
*తా : మహాశాస్తా ! దేవదేవా , అంతటా నిండి యుండు వాడవు. లోక నాయకుడవు. గురుదేవుడవు. ప్రభువువు , అయిన నీకు నమస్కారము*
_*36. మహా శాస్తాయ సర్వజ్ఞాయ మహాత్మనే |*_
*_యోగనిష్ఠాయ నిత్యాయ నిత్య శుద్ధాయ తే నమః ॥_*
*తా : మహాశాస్తా ! శాంతస్వరూపుడవు, సర్వజ్ఞుడవు , మహాత్ముడవు , యోగాత్ముడవు , అంతటా నిండియుండు వాడవు. పరిశుద్ధడవు అయిన నీకు నమస్కారము*
_*37. మహా శాస్తా గజారూఢ గణేశాన్ సురేశ్వర |*_
_*విశ్వేశ్వర సురశ్రేష్ట లోకనాథ నమోస్తుతే ॥*_
*తా : మహాశాస్తా ! గజవాహనుడవు, గణములకు , దేవతలకు ఈశ్వరుని వంటి వాడవు , దేవతల యందు అధికుడవు , లోక నాథుడవు అయిన నీకు నమస్కారము.*
_*38. మహా శాస్తాయ వీరాయ నిత్యాయ నిఖిలాత్మనే |*_
*_నాగాసుర హంత్రేచ శ్రీశగర్భాయ తే నమః ॥_*
*తా : వీరుడవు , నిత్యుడవు , పరిపూర్ణమైన వాడవు. నాగాసురుని సంహారించిన వాడవు. లక్ష్మీవతి యొక్క పుత్రుడవు అయిన మహాశాస్తా ! నీకు నమస్కారము*
*_39. హరి శంభు హృదయానందకరాయ చ మహాత్మనే|_* _*మహారాజ వసిష్ఠాయ మహాశాస్తాయ తే నమః ॥*_
*తా : హరిహరలకు హృదయానందమును కలుగజేసినవాడవు , మహాత్ముడవు , మహారాజునవు , సకల శాస్త్రములను ఎరిగిన వాడవు అయిన మహాశాస్తా నీకు నమస్కారము.*
*_40. విశ్వరూప ప్రదర్శాయ కారుణ్య నమోస్తుతే |_*
*_నమోస్తు సుప్రసన్నాయ పురుషాయ మహాత్మనే ॥_*
*తా : ప్రపంచమంతటా పరిణమించి యుండువాడవు , కరుణామయుడవు , ఆనంద స్వరూపుడవు , ఉత్తమ పురుషడవు , మహాత్ముడవు అయిన నీకు నమస్కారము.*
_*41. యోగానంద స్వరూపాయ మహాశాస్తాయ తే నమః |*_
*_నమో హరీశ పుత్రాయ నమస్తేనంత సాక్షిణే॥_*
*తా : యోగానంద స్వరూపుడవు. హరి హరులకు పుత్రుడవు. జగమున కంతటికీ సాక్షి భూతుడవైన మహాశాస్తా ! నీకు నమస్కారము.*
*_42. ఆనంద రూపిణే తుభ్యం మహా శాస్త్రే నమో నమః |_* *_యోగారూఢాయ నిత్యాయ యోగ గమ్యాయ యోగినే ॥_*
*తా : ఆనంద స్వరూపుడవు , యోగ నిష్టయందు ఉండువాడవు. నిత్యుడవు , యోగ పశ్యుడవు , మహాయోగివి అయన మహాశాస్తా ! నీకు నమస్కారము.*
*_43. సర్వాత్మన్ సర్వదేవేచ సర్వ వ్యాపిన్ మహేశ్వర |_*
_*దామోదరేశ పుత్రాయ నమస్తే భక్త పాలినే |*_
_*యోగాధ్యక్షాయ కూటాయ మహాశాస్తాయ తే నమః ||*_
*తా : సర్వాత్ముడవు , సకల దేవతలకూ ఈశుని వంటి వాడవు, అంతటా నిండి యుండు వాడవు. మహేశ్వరునికి , దామోదరుని పుత్రుడైన వాడవు. భక్తులను కాపాడువాడవు , యోగినులకు అధిపతి యిన వాడవు. అతి రహస్యమైన వాడవు అయిన శ్రీ ధర్మశాస్తా ! నీకు నమస్కారము.*
_*44. భూతనాథ సదానంద సర్వ భూత దయాపర*_
_*రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః*_
*తా : భూత ప్రేత పిశాచములకు నాధుడై వాటి శల్యమును అరికట్టి పాలించు ఓ భూతనాథ సదా ఆనంద చిత్తము లో యుండు వాడా , సృష్టిలోని సర్వభూతరాశుల యందు ఎనలేని దయగల్గిన పరాత్పరా , పై చెప్పబడిన రీతిగాను , ఇంకను నా మతి కందని పలు దివ్య శక్తులు గల్గిన శక్తి పుత్రా ! హే ధర్మశాస్తా మిమ్ములను త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను. బహు బలము నిండిన ఓ మహా ప్రభో ! మమ్ములను సదా రక్షించి పాలించ వలెన
_*అయ్యప్ప దేవ దేవా శరణం తవైవ*_
_*స్వామిన్ మమేవ శబరిగిరి వాసనాథా*_
_*అయ్యప్ప హే శరణ మిత్యధి ఘోషయంతో*_
_*రక్షాస్వయాయ సతతం వయమార్త బందో*_
_*ఓం శ్రీ పూర్ణపుష్కళాంభా సమేత శ్రీ హరి హర పుత్ర స్వామినే నమః అనంత కోటి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.*_
*ఓ అయ్యప్ప దేవా ! నీ దివ్య చరణములే మాకు శరణములు కరుణానిధి ! భక్త చింతామణి ! స్వామి ! మమ్ము కరుణింపుము " ఓ అయ్యప్ప ! నీవే మాకు శరణు " అని ఘోషించు చున్నాను. నన్ను నిరంతరం రక్షింపుము. ఓ శరణాగత దీప బంధూ ! నీకు నమస్కారములు*
*శ్రీ పూర్ణపుష్కళాంభా సమేత శ్రీ హరి హర పుత్ర స్వామినే నమః అనంత కోటి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి*
_*ఓం స్వామియే శరణం అయ్యప్ప*_
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*