� శ్రీమద్ ఇల్లిందకుంట దివ్య క్షేత్ర మాహాత్మ్యమ్�
( ఇంద్రవల్లిగిరి క్షేత్రం )
"ఇంద్రవల్లి గిరి నివాసాయ ఇందిరాయ పరమాత్మనే సీతేందిరా సంయుతాయ ఇందీవరాయ తే నమః" !! అపర అయోధ్య గా..గయా క్షేత్రం గా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం ఈ ఇంద్రవల్లి పుర క్షేత్రం"..సుప్రసిద్ధ శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రం....శ్రీ రామచంద్ర స్వామి సీతా లక్ష్మణ సహితం గా త్రేతాయుగం లో దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ మేరక
ు పితృ వాక్య పరిపాలనా దక్షుడై అరణ్య వాసం చేస్తున్నప్పటి సమయం లో అయోధ్యా నగరం నుండి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలో ఇచట ఉన్నటువంటి ఇల్లంద వృక్షాల వనములో కొన్ని రోజులు నివసించిన దివ్య స్థలం ఈ ఇల్లంద పుర క్షేత్రం. ఈ దివ్య తపో భూమి లో తపమాచరిస్తున్నటువంటి కశ్యపాది మహర్షుల యొక్క ఆదరము పొంది వారి యొక్క ఆజ్ఞ చేత ఈ ప్రాంతముననే కొన్ని దినములు ఒక కుటీరము ఏర్పరుచుకొని.. ఇక్ష్వాకు వంశములో పరం పరానుగతంగా నిత్యం సేవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నటివంటి తమ కులదైవమైన శ్రీ రంగనాథుణ్ణి అర్చిస్తూ వారి వనవాస కాలమును గడిపిన దివ్య క్షేత్రం ఇది.. ఈ దివ్య స్థలమున ఉన్నటువంటి సమయం లో రామచంద్ర మూర్తి యొక్క తండ్రిగారైన దశరధ మహారాజు యొక్క మరణానంతరం జరిపేటటువంటి పితృ తర్పణాది శ్రాద్ధ కర్మలు ఇచ్చటగల (ఇంద్రవల్లీ) ఇల్లంద వృక్షముల ఫలములతో నిర్వహించడం జరిగింది, శ్రీ రాముడు ఆచరించిన ఈ కార్యముల ద్వారా పితృ దేవతలు తృప్తి చెంది.. పితృలోకాన్ని అంతా తరింప చేసినటువంటి స్థలం కనుక ఈ క్షేత్రము సాక్షాత్తు ( విష్ణు పాద గయా ) క్షేత్రముతో సమానమైనదని క్షేత్ర పురాణం తెలియచేస్తున్నది.. ఇప్పటికి కూడా ఈ క్షేత్రములో భక్తులు గతించినటువంటి తమ వారి యొక్క (పెద్దలకు)పితృ తర్పణాది శ్రాద్ధ కర్మలు అన్నదానాది కార్యక్రమములు నిర్వహిస్తూ ఉండటం విశేషం.. ఈ క్షేత్రము లో చేసే ఏ విధమైన కర్మలు "గయా"క్షేత్రం లో చేసిన దానితో సమానమై.. పితృ దోశాల్లాంటివి అన్ని తొలిగిపోయి అనంతకోటి ఫలితములు ఇస్తుందని బ్రహ్మాండ పురాణం తెలియచేస్తుంది. శ్రీ రాముడు స్వయంగా తన దివ్య భవ్యమైన అతి సుందర స్వరూపం తో నడయాడిన దివ్య భూమి ఇది స్వామి సీతామాత యొక్క పాదసేవను పొందుతూ.. లక్ష్మణ స్వామి యొక్క సర్వ కైంకర్యములను స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంద (ఇంద్రవల్లి) వృక్ష మూల స్థానములో చిన్న రాతికొండపై ఉత్తర ముఖముగా చూస్తూ స్థిరముగా స్వయం వ్యక్త మూర్తిగా పవళించి వెలసి యుండటం విశేషం.. సంవత్సరం లో ఒక్క ముక్కోటి( వైకుంఠ ) ఏకాదశి నాడు మాత్రమే కాకుండా ఇక్కడ నిత్యమూ ఉత్తర ముఖముగా స్వామి తన దివ్య మంగళవిగ్రహదర్శనమును అశేష భక్త కోటికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు, అందుకే ఈ మూల స్వామి కి "మోక్ష మూర్తి" "వైకుంఠ రాముడు" అని పేరున కీర్తిస్తారు ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రం లో మూల మూర్తియే కాకుండా ఉత్సవమూర్తులు సహితం మానవులకు ఉండేవిధంగా పుట్టుమచ్చలు కలిగివుండి, "అభయం సర్వ భూతేభ్యో" అని రామాయణం లో ప్రతిజ్న చేసినట్టు స్వామి కుడి చేయితో "అభయ ముద్ర"దర్షింప చేస్తూ ఉండి స్వయం వ్యక్త మూర్తులుగా ఉద్భవించడం ఇచట మరొక్క విశేషమైనటువంటిది.. అందుకే ఈ క్షేత్రము సంపూర్ణమైన అర్చామూర్తి క్షేత్రముగా విరాజిల్లుతున్నది సాక్షాత్తు అయోధ్యా క్షేత్రముతో సమానమైనదిగా కొనియాడబడుతున్నది, ఈ క్షేత్ర ఉత్సవ మూర్తిని "అభయ ప్రద"మూర్తి అని "కళ్యాణ మూర్తి"అని కీర్తిస్తుంటారు.. ఈ స్వామి సాక్షాతూ బ్రహ్మ దేవుడుకి పరమశివుడికి ప్రత్యక్షం.. "బ్రహ్మ గారు పరమ శివుడు" సకల దేవతా, మహర్షి గణాల తో బ్రాహ్మీ ముహూర్తం లో దివ్య పుష్కరిణిలో స్నానమాచరించి పాంచరాత్రాగమోక్తం గా స్వామిని అర్చిస్తారని పురాణాదులు చెప్తున్నాయి, పార్వతీ పరమశివుడు అవ్యక్తంగా.. తన ప్రభువైన రామచంద్ర స్వామి యొక్క పాదాలకు సరి సమానంగా ఆసీనుడై ఉండి నిరంతరం శ్రీ రామ ధ్యాన, స్మరణం చేస్తూ ఉంటాడని,ఏ విధంగా అయితే కాశీ క్షేత్రములో వలే తారక మంత్ర బ్రహ్మమైన శ్రీ రామ నామమును ఉపదేశం చేస్తూ ఉంటాడో.. ఈ క్షేత్రం లో కూడా వచ్చిన భక్తులందరికీ అనన్య భక్తితో రాముని సేవించిన వారికి రామ మంత్ర జప ఫలమును అందిస్తాడని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతుంది.. రామ స్వామి సన్నిధికి ఎదురుగా సదా రామ నామ స్మరణ బ్రోలునటువంటి సదాశివుడిని మనం నేటికిని దర్శించు కొనవచ్చును.. ఈ క్షేత్రములో ఉన్నటువంటి "దివ్య స్వామి పుష్కరిణి" సాక్షాత్తు రామచంద్ర మూర్తితో సమానమైనదిగా విరాజిల్లుతూ ఉన్నది, స్వామి యొక్క స్పర్శ చేత దివ్య మహిమాన్వితమై.. స్వామి యొక్క దివ్య తేజస్సు అందులో పరిపూర్ణముగా అవాహితమై ఉన్నదని పురాణాలూ తెలుపుతున్నాయి, అందులో శుచిగా స్నానమాచరించిన వారికి అనేక రోగములనుండి విముక్తులై పరమ పవిత్రులవుతారని పురాణోక్తి.. ఈ స్వామి కి ఇంకొక విశేష నామం ఉన్నది..ఇక్కడ స్వామి ని "వైద్య రాముడు"అనే నామంతో కీర్తిస్తారుఅనేక శారీరక, మానసిక వ్యాధులున్నటివంటి భక్తులెందరో ఇక్కడికి వచ్చి స్వామిని ఆశ్రయించినట్లైతే.. పుష్కరిణిలో స్నానమాచరించి భక్తిగా శ్రద్ధగా స్వామి నిశరణు వేడిన వారికి తప్పకుండ స్వామి యొక్క అనుగ్రహం తో స్వప్న సాక్షాత్కారమై ఔషధమందించి వారిని సకల రోగముల నుండి విముక్తులను చేసిన సందర్భాలు కోకొల్లలు.. ఈ స్వామికి మరొక్క దివ్య నామం కూడా ఉన్నది.. జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తిగా సకల విద్యలను అనుగ్రహించే స్వామిగా ఉన్నాడు కనుక ఈ క్షేత్ర నాధుడైన రామచంద్రమూర్తిని "విద్యా రాముడు" అనే నామంతో కూడా కీర్తిస్తారు.. స్వామివారికి సంవత్సరంలో అనేక ఉత్సవములు జరుపబడుతుంటాయి విశేషించి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు కలియుగ వైకుంఠాన్ని తలపిస్తూ అత్యంత వైభవంగా.. నయన మనోహరంగా జరుగుతుంటాయి, కన్నుల పండుగగా జరిగే శ్రీ రామ నవమి కల్యాణ మహోత్సవానికి అశేషమైన భక్త జనకోటి తరలి వచ్చి సీతారాముల దివ్య కల్యాణాన్ని సేవించుకుంటారు, దేవతలు కూడా అదృశ్య రూపంలో స్వామి కల్యాణాన్ని సేవించుకుంటారని సరస్వతి బ్రహ్మలు, పార్వతీ పరమేశ్వరులు సైతం కల్యాణ మండపంలో అదృశ్యంగా వేంచేసి ఉండి స్వామి వారి కళ్యాణం జరిపిస్తారని క్షేత్ర మాహాత్మ్యం తెలియజేస్తుంది, ఇక్కడ అత్యంత వైభవంగా రోజుకొక శేష, హంస, గరుడ, హనుమత్, గజ, అశ్వ, ఇత్యాది వాహనాల మీద స్వామి వివిధ అలంకారములతో దర్శనమిస్తూ కడు రమణీయముగా ఉత్సవములను జరుపుకుంటూ ఉంటాడు.. ఇచట విశేషించి రెండు రథోత్సవములు జరుపబడుతుంటాయి.. "రథస్థం రాఘవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే " అని శాస్త్రం చెపుతుంది..చిన్న (ఇంద్ర) రధోత్సవము, పెద్ద బ్రహ్మ రథోత్సవములు అశేష భక్త జనవాహిని మధ్య కోలాహలంగా వైభవంగా జరుగుట విశేషం ఇంత గొప్ప చరిత్ర కలిగి ఇన్నిరకాల విశేష ఉత్సవాలు జరుగుతున్న ఈ క్షేత్రము స్వామి కల్పవృక్షము గా వేంచేసి ఉన్న ఈ దివ్య స్థలం అద్భుతముగా భూలోక వైకుంఠముగా విరాజిల్లుతున్నది.. ప్రతి మానవుడు కనీసం తన అరవై సంవత్సరంలో ఒక్కసారైనా దర్శించి తీరవలిసినదే అనిఈ స్వామిని సేవించుటకు ముందు జీవితమునకు, సేవించిన తర్వాత జీవితము యొక్క ధన్యతను ప్రతి మానవుడు పొందవలిసినదే అని.. క్షేత్ర మాహాత్మ్యం "సీతాయుత విహారాయ మణిహారాయ భూషితే సద్భక్త భక్త భద్రాయ రామచంద్రాయ మంగళమ్"!!" ఇంద్రవల్లి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన రామచంద్ర సమోదేవో నభూతో నభవిష్యతి" !! శ్రీమతే రామానుజాయ నమః