01/12/2022
"ఇతర వ్యక్తుల మీద నిందలను ప్రచారం చేయటం మరియు నమ్మటం" అనే ప్రక్రియ చాలా అసహ్యమైనదీ నికృష్టమైనదీ. ఎందుకంటే ఆ ప్రక్రియలో ఎంతో అన్యాయం, వేషధారణా అసమంజసమైన ఆలోచనాధోరణీ వాక్యవిరోధమైన మనస్తత్వం ఇమిడి ఉన్నాయి. ఆ దారుణ వాస్తవాలను ఒకదాని వెంట మరొకటిగా మీముందు ఆవిష్కరిస్తున్నాను, చిత్తగించండి -
ప్రప్రథమంగా-విరిగినలిగిన మనస్సు గలిగినవారు ఎన్నడూ ఇతరులనుగూర్చి చెడుమాట్లాడరు, నిందా ప్రచారం చేయరు. ఎవరైనా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడుతూ ఉన్నారంటే "నేను అలాంటివాడిని కాను. నేను అతడికంటే మెరుగైన వ్యక్తిని" అనే "అహంభావపూరిత మనస్తత్వం" వారిలో ఉన్నదని అర్ధం.
ప్రవక్తయైన యెషయాకు దేవదర్శనం కలిగినప్పుడు వెంటనే "-అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను....... నేను నశించితిని" అంటూ కేకపెట్టాడు. ఒక్క యెషయాయే కాదు, దేవదర్శనం పొందిన ప్రతి భక్తుడూ, ప్రవక్తా అదేరీతిలో స్పందించారు.
అంతసేపూ నేను మంచివాడిని, నాలో ఏ తప్పులేదు అని నిశ్చయతను వ్యక్తంచేసిన యోబు, తీరా దేవదర్శనం కలిగాక పూర్తిగా భిన్నమైన సాక్ష్యం ఇచ్చాడు. “ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను" అన్నాడు, యోబు.
ఆ మాటలు గమనించారా? “కాపున నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను" అంటున్నాడు భక్తుడు. ఏమిటి కావున? ఏ కారణాన్ని బట్టి యోబు తన్నుతాను అసహ్యించుకున్నాడు?
యోబు తేటగా చెబుతున్నాడు, వినండి- “ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను కావున"! అంటే తన్నుతాను అసహ్యించుకోవటం దేవదర్శనం కలిగిన వ్యక్తిలో ఉండే అనివార్య లక్షణం అన్నమాట. తన్నుతాను అసహ్యించుకునే ఒక వ్యక్తి ఇంకొకరెవరో మంచివాళ్ళు కారని నేరారోపణ చేయగలడా?ససేమిరా చేయలేడు.
అందుకే చెబుతున్నాను- దేవునితో సరైన సంబంధమూ, సహవాసమూ కలిగిన వ్యక్తిలో తప్పనిసరిగా విరిగినలిగిన మనస్సు, దీనత్వం, సాత్వికమూ ఉంటాయి. గనుక అలాంటి వ్యక్తి ఇతరుల పై నిందలను పట్టించుకోడు, ప్రచారం చేయడు.
అయితే ఈనాడు క్రైస్తవులలో అత్యధిక శాతం విశ్వాసులు, దైవ సేవకులతో సహ ఇతరుల పై నిందా ప్రచారానికి పరమానందంగా పూనుకుంటున్నారు. దైవలేఖన కాంతిలో వీరిని పరీక్షిస్తే మీకేమి అర్ధమవుతోంది?
ఈ నిందా ప్రచారకులలో దీనమనస్సూ, సాత్వికమూ లేవు. విరిగినలిగిన మనస్సులేదు. వారు అహంభావపూరితులు, స్వనీతిపరులు. స్వనీతిపరులే ఇతరుల పై నిందలు మోపుతారు. అంటే ఈనాటి క్రైస్తవులలో దైవనీతి కనుమరుగై స్వనీతి వేళ్ళూనుకుంది. “తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించు వ్యక్తులు" అని లేఖనం కొందరినిగూర్చి మాట్లాడుతున్నది (లూకా 18:9). సరిగ్గా ఇదే కోవకు ఈనాటి క్రైస్తవులలోని అత్యధిక శాతం చెందుతారు.
అంటే దేవదర్శనం ఎరుగనివాళ్ళు ఈనాడు క్రైస్తవులుగా చెలామణీ అవుతున్నారన్నమాట. "గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు" అని లేఖనం సెలవిస్తున్నది (సామెతలు 16:5). దేవునికి అసహ్యులైనవారు ఈనాడు విశ్వాసులుగానూ, దైవ సేవకులుగానూ చెలామణి అవుతున్నారన్నమాట.
ఎంత దారుణం! ఇదా క్రైస్తవ్యం? వాళ్ళేనా పరలోక రాజ్యవారసులు! క్రైస్తవ్యం ఇలా భ్రష్టుపట్టిపోయినందుకే ఈనాడు సువార్తసేవా ప్రయాసమంతా వ్యర్ధమైపోతున్నది.
రెండవదిగా ఎదుటివ్యక్తిని బాధించి అతడు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించే వికృత - మనస్తత్వం కూడా ఈ నిందారోపణలకు మరో ముఖ్యకారణం.
మానసికంగా ఆరోగ్యవంతుడైన వ్యక్తి తన ఎదుట మరోవ్యక్తి గాయపడితే చూసి జాలిపడతాడు. ఓదార్చటానికి ప్రయత్నిస్తాడు. కాని కొందరు వ్యక్తులలో మరో విచిత్రమైన వికృత మనస్తత్వం ఉంటుంది - ఆ గాయపడిన వ్యక్తి బాధపడుతూ ఉంటే చూడటం వారికి వినోదాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదోరకమైన రాక్షస ప్రవృత్తి. దీన్నే మనస్తత్వ శాస్త్రంలో 'సాడిజం' (Sa**sm) అంటారు.
సాడిస్టిక్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇతరుల శరీరాలను గాయపరచిచూసి ఆనందిస్తారు. అయితే నిందా ప్రచారకులు ఇతరులను శారీరకంగా కాదు మానసికంగా గాయపరుస్తారు.
ఇలాంటి వ్యక్తులను గూర్చి దావీదు 59వ కీర్తనలో ఇలా వ్రాసాడు- "సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టూ తిరుగుదురు. వినువారెవరును లేరనుకుని వారు తమనోటి నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులతో కత్తులున్నవి” (6,7 వచనాలు).
వారి పెదవులలో కత్తులున్నవట! కత్తులు ఏం చేస్తాయి? గాయపరుస్తాయి. చేతుల్లోని కత్తులు శరీరాలను మాత్రమే గాయపరుస్తాయి. అయితే పెదవులలోని కత్తులు హృదయాలను గాయపరుస్తాయి. "కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు" అని (సామెతలు 12:18) తెలియజేస్తున్నది లేఖనం. నిందా ప్రచారకులందరూ ఇదే కోవక్రిందికి వస్తారు.
ఒకవేళ అవతలి వ్యక్తి మంచివాడు కాడన్నమాట వాస్తవమే అయివుండవచ్చు. అతడు నిజంగానే ఏదోఒక తప్పుచేసి ఉండవచ్చు. అయినంత మాత్రాన ఇప్పుడు ఆ విషయాన్ని పదిమందికీ చేరవేసి మనం సాధించేదేమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? అసలు తప్పేచేయని మానవుడెవడు?
"మనమందరమును అనేక విషయములలో తప్పిపోవుచున్నాము" అని బాహాటంగా ప్రకటించాడు మహాభక్తుడైన యాకోబు (యాకోబు పత్రిక 3:2). "తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?" అని పలికాడు భక్తదావీదు. సామెతలు 20వ అధ్యాయం 9వ వచనంలో “నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిని అనుకొనదగినవాడెవడు?" అని లేఖనం సవాలు చేస్తున్నది. ఇలాంటి వచనాలే బైబిలులో ఇంకెన్నో కనబడుతున్నాయి.
వాస్తవాలు ఇలా ఉండగా ఒకరిని గూర్చి మనం నిందలకు ప్రచారం చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? ఆ ప్రచారంవలన ఎవరైనా రక్షణ పొందుతారా? ఎవరైనా ఆ మాటలను విని మరింత పరిశుద్ధులౌతారా? క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందా?
ఈ సంగతి నిందా ప్రచారకులకు కూడా తెలుసు. అయినా వాళ్ళు ఎంతో ఆత్రంగా, అత్యాసక్తితో దుష్ప్రచారాన్ని చేపడతారు. తమమాటలు ఎదుటివ్యక్తిని కత్తుల్లా గాయపరుస్తున్నాయని వాళ్ళకు తెలుసు. అయినా ఆ ప్రక్రియ వాళ్ళకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇలాంటి వ్యక్తులను లేఖనం "కుక్కలు" అని పిలిచింది. ఈ కుక్కలా పరలోక రాజ్యానికి వెళ్ళేది? ఈ కుక్కలా క్రీస్తు సువార్తను ప్రకటించేది? ఈ కుక్కలా క్రీస్తుకు రాయబారులూ దేవుని ప్రతినిధులూను!
మూడవ కారణం ఏమిటంటే “దేవుని వాక్యభయం" లేనివారు 'నా ప్రవర్తన నూటికి నూరుపాళ్ళూ దేవుని వాక్యానుసారంగా ఉండాలనే తీర్మానం లేనివాళ్ళు మాత్రమే నిందా ప్రచారం చేస్తారు. ఎందుకంటే నిందా ప్రచారం చేయటం లేఖనాలకు పూర్తిగా విరుద్ధమైన కార్యం.
అలా స్వనీతిపరులై “తామే నీతిమంతులమని తమ్మునమ్ముకుని ఇతరులను తృణీకరిస్తూ" అహంకారులై దేవునికి అసహ్యులై హేయులై నిందా ప్రచారాలకు ఒడిగట్టేవారిని లేఖనం "కుక్కలు" అని పిలుస్తున్నది. ఈ వ్యాసం చదువుతున్న నీవు ఆ కుక్కల గుంపులో లేవనే నేను ఆశిస్తున్నాను. నీవున్న సంఘంలో అలాంటి కుక్కలు ఉన్నాయా? నీవున్న ఊర్లో అలాంటి కుక్కలు ఎన్ని వున్నాయ్?
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలలో ఈ కుక్కలదే మెజారిటీ అయిపోయింది! ఈ కుక్కలన్నీ కలిసి "యెహోవా నా కాపరి" అని పాటలు పాడుకుంటున్నాయ్.. ఈ కుక్కలకా యేసు ప్రభువు కాపరి? యేసు ప్రభువు కుక్కల కాపరా? లేక గొర్రెల కాపరా? నిస్సందేహంగా ఆయన గొర్రెలకే కాపరి. ఈ కుక్కలకు కాదు.
-అపొ. డా. A. S. రంజిత్ ఓఫీర్.
(ఇదేనా క్రైస్తవ్యం!
Omega Swaram, June 1999).